news18-telugu
Updated: January 20, 2020, 11:09 PM IST
తమ్మినేని సీితారాం(ఫైల్ ఫోటో)
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. ఎలాంటి ఓటింగ్ లేకుండానే సభలో బిల్లు పాస్ అయింది. ఈ కొత్త బిల్లు ప్రకారం అమరావతి శాసన రాజధాని, విశాఖపట్నం పరిపాలనా రాజధాని, కర్నూలు జ్యుడీషియల్ క్యాపిటల్‌గా నిర్ణయిస్తూ ప్రభుత్వం తీర్మానం చేసింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఇదో చరిత్రాత్మకమైన రోజని స్పీకర్ తమ్మినేని సీతారాం, సభానాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఒక వ్యక్తి చేసిన తప్పు వల్ల రాష్ట్రంలో ప్రజలు నష్టపోయారని సీఎం జగన్ అన్నారు. ‘రాజధాని కోసం నారాయణ అనే సొంత కమిటీని వేశారు. శివరామకృష్ణన్ కమిటీ ఈ ప్రాంతం రాజధానికి అనుకూలం కాదు అని చెప్పింది. చంద్రబాబు రియల్ ఎస్టేట్ కోసమే రాజధానిని ఇక్కడ పెట్టారు. సింగపూర్ అన్నారు, అదన్నారు ఇది అన్నారు ఈ ఐదేళ్లు బాహుబలి సినిమా చూపించారు. ప్రాంతాల మధ్య సమస్యలు వస్తాయని శివరామకృష్ణన్ కమిటీ అప్పుడే చెప్పింది. అందుకే అభివృద్ధిని వికేంద్రీకరించాలని నిర్ణయించాం.’ అని జగన్ మోహన్ రెడ్డి అన్నారు.
బిల్లు పాస్ అయిన సందర్భంగా స్పీకర్ ఉద్వేగానికి లోనయ్యారు. ‘ఈ రాష్ట్ర శాసనసభ చరిత్రలో ఇది చారిత్రాత్మకమైన రోజు. ఈ గొప్ప నిర్ణయంలో నేను భాగస్వామిని కావడం, బిల్లును సభకు పరిచయం చేసే గొప్ప అవకాశం రావడంతో నా జన్మ ధన్యమైంది. ఈ అవకాశం ఇచ్చిన సభానాయకుడు సీఎం జగన్‌కు, సభకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. ఈ నిర్ణయంతో ఆకలి లేని, పేదరికం లేని, నిరక్షరాస్యత లేని, నిరుద్యోగం లేని, ఉపాధి ఉండే ఉత్తరాంధ్రను చీఫ్ మినిస్టర్ నిర్మిస్తారని ప్రపంచానికి, ఈ సభ ద్వారా తెలియజేస్తున్నా. ధాంక్యూ సీఎం సార్.’ అని ఉద్వేగానికి గురయ్యారు. అనంతరం సభను రేపటికి వాయిదా వేశారు. బిల్లు శాసనసభ ఆమోదం పొందడంతో ప్రస్తుతం అందరి దృష్టి శాసనమండలి మీద ఉంది. శాసనమండలిలో టీడీపీకి సంఖ్యాబలం ఎక్కువ ఉంది.
Published by:
Ashok Kumar Bonepalli
First published:
January 20, 2020, 11:02 PM IST