Your Assembly: కొత్త చరిత్రకు పులివెందుల నాంది పలుకుతుందా? రెండో సీఎంని అందిస్తుందా?

పులివెందులలో రెడ్డి సామాజికవర్గం వారే అధికం. మిగతా బీసీ కులాలతో పాటు ఎస్సీలు కూడా ఉన్నా వారి సంఖ్య నామ మాత్రమే. వీరిలో రెడ్లే నియోజకవర్గంలో గెలుపోటములను నిర్దేశిస్తుంటారు.

news18-telugu
Updated: April 5, 2019, 2:29 PM IST
Your Assembly: కొత్త చరిత్రకు పులివెందుల నాంది పలుకుతుందా? రెండో సీఎంని అందిస్తుందా?
వైఎస్ జగన్(ఫైల్ ఫోటో)
  • Share this:
1955లో ఏర్పాటైన కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం ఇప్పటివరకూ జరిగిన 15 అసెంబ్లీ ఎన్నికల్లో 11 సార్లు వైఎస్ కుటుంబానికి విజయాలు కట్టబెట్టింది. 1978 నుంచి వరుసగా 11 సార్లు వైఎస్ కుటుంబ సభ్యులే ఇక్కడ గెలిచారంటే వారికున్న పట్టు ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. రూపాయి డాక్టర్ గా కెరీర్ ప్రారంభించి, రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగిన వైఎస్ఆర్ అంటే ఇక్కడి ప్రజలకు వల్లమాలిన అభిమానం. అందుకే ఆ కుటుంబానికి రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా రికార్డు స్ధాయిలో విజయాలు అందిస్తున్నారు. దేవుని గడపగా చెప్పుకునే కడప జిల్లాలో పులివెందుల నియోజకవర్గానిది ప్రత్యేక చరిత్ర. ముఖ్యంగా దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డిని రాష్ట్రానికి పరిచయం చేసిన ఘనత ఈ నియోజకవర్గానిదే. గుల్బర్బా మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదివి పులివెందుల నియోజకవర్గంలో రూపాయి డాక్టరుగా ప్రస్థానం ప్రారంభించిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. అనంతరం తండ్రి రాజారెడ్డి సూచన మేరకు రాజకీయాల్లో ప్రవేశించి ఎన్నో పదవులు చేపట్టారు. 1978లో తొలిసారి వైఎస్ఆర్ కు తొలి విజయాన్ని అందించిన పులివెందుల నియోజకవర్గం అప్పటి నుంచి 2014 వరకూ వైఎస్ కుటుంబ సభ్యులకు వరుస విజయాలను కట్టబెట్టింది. 1978, 83, 85 ఎన్నికల్లో వైఎస్సార్ ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలవగా... 1989, 1994లో ఆయన సోదరుడు వివేకానందరెడ్డి పోటీ చేసి గెలిచారు. తిరిగి 1999 నుంచి వైఎస్ ఇక్కడి నుంచి గెలుస్తూ వచ్చారు. అదే క్రమంలో ఆయన 2004, 2009లో సీఎంగా కూడా పనిచేశారు.

సతీమణి విజయమ్మతో వైఎస్ఆర్ ఫైల్


2009లో వైఎస్ మరణం తర్వాత అక్కడ వైఎస్ విజయమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2011లో వైసీపీ తరఫున పోటీ చేసిన విజయమ్మ తన మరిది వైఎస్ వివేకానందరెడ్డి మీద విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో పులివెందుల నుంచి గెలిచిన జగన్... తాజాగా మరోసారి ఇక్కడ అదృష్టం పరీక్షించుకుంటున్నారు. ఈసారి వైసీపీ అధికారంలోకి వస్తే జగన్ సీఎం కానున్నారు.

ys jagan, ysrcp, ys jagan kakinada public meeting, ys jagan election campaign, andhrapradesh elections 2019, వైఎస్ జగన్, కాకినాడ బహిరంగ సభలో జగన్, జగన్ ఎన్నికల ప్రచారం, ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు 2019
ఎన్నికల నగారా మోగిస్తున్న వైఎస్ జగన్..


రెడ్డి సామాజికవర్గం ప్రభావం అధికంగా ఉండే రాయలసీమ ప్రాంత నియోజకవర్గాల్లో ఒకటైన పులివెందులకు గతంలో ఫ్యాక్షన్ గడ్డగా పేరుండేది. వైఎస్ తండ్రి రాజారెడ్డి హయాంలో ఇక్కడ ఫ్యాక్షన్ రాజకీయాలు జోరుగా నడిచాయని చెబుతారు. రాజారెడ్డి కూడా ఫ్యాక్షన్ రాజకీయాలకే బలయ్యారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మాత్రం రాజకీయాల్లో సీఎం కావాలన్న బలమైన కాంక్షతో ఫ్యాక్షన్ రాజకీయాలకు దూరంగా ఉండిపోయారు. అనంతరం ఆయన కుమారుడు జగన్ తో పాటు ఇతర కుటుంబ సభ్యులు కూడా ఫ్యాక్షన్ రాజకీయాల జోలికి పోలేదు. అయితే తాజాగా జరిగిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య మాత్రం మరోసారి ఇక్కడి ప్రతీకార రాజకీయాలను గుర్తుచేసింది.

పులివెందులలో నామినేషన్ వేస్తున్న వైఎస్ జగన్


1978 సమయంలో తొలిసారిగా నియోజకవర్గంలో డాక్టర్ గా మంచి పేరున్న వైఎస్ఆర్ పులివెందుల నుంచి గెలుపొందారు. ఆ తర్వాత ఆయన చేసిన అభివృద్ధి, మంత్రిగా ఆయన వ్యవహారశైలితో ప్రజల మన్ననలు పొందారు. ఆ తర్వాత వైఎస్ ను గెలిపిస్తే సీఎం అవుతారన్న నమ్మకంతోనే పులివెందుల ప్రజలు ఓట్లు వేయడం సర్వసాధారణమైపోయింది. ఇప్పటికీ వైఎస్ జగన్ గెలిస్తే సీఎం అయ్యే అవకాశం ఉందన్న అభిప్రాయంతోనే ఇక్కడి ఓటర్లు ఆయన్ను గెలిపిస్తున్నారు. గతంలో సీఎంగా వైఎస్ చేసిన అభివృద్ధి ఇప్పటికీ వాళ్ల కళ్ల ముందు మెదులుతూనే ఉంది. ఇడుపులపాయలో ట్రిపుల్ ఐటీతో పాటు నియోజకవర్గంలో మౌలిక సదుపాయాల కల్పన, తుమ్మలపల్లె యురేనియం మైనింగ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్ధ, పులివెందుల రింగ్ రోడ్డు నియోజకవర్గాన్ని అభివృద్ధిలో మందు వరుసలో నిలిపాయి.

పులివెందుల పట్టణంలో పార్కులతో పాటు ప్రార్ధనా స్ధలాల అభివృద్ధి కూడా స్పష్టంగా కనిపిస్తుంటుంది.

పులవెందులలో జగన్ నామినేషన్ కార్యక్రమానికి హాజరైన ప్రజలు


పులివెందులలో మొత్తం 2 లక్షల 12 వేల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో మహిళల సంఖ్యే అధికం. నియోజకవర్గంలో మహిళలు లక్షా 7 వేల మంది ఉంటే పురుషుల సంఖ్య లక్షా 5 వేల వరకూ ఉంటుంది. వీరిలో రెడ్డి సామాజికవర్గం వారే అధికం. మిగతా బీసీ కులాలతో పాటు ఎస్సీలు కూడా ఉన్నా వారి సంఖ్య నామ మాత్రమే. వీరిలో రెడ్లే నియోజకవర్గంలో గెలుపోటములను నిర్దేశిస్తుంటారు. ఈసారి కూడా వైఎస్ కుటుంబానికి ఓట్లు వేయాలని వీరంతా సిద్ధమవుతున్నారు. ఇక్కడ జగన్ గెలుపుపై అనుమానాలు లేకపోయినా మెజారిటీపైనే అందరి దృష్టీ నెలకొంది. జగన్ గెలిస్తే సీఎం అవుతారన్న అంచనాలే దీనికి కారణం.

(సయ్యద్ అహ్మద్, కరస్పాండెంట్, న్యూస్‌18)
Published by: Ashok Kumar Bonepalli
First published: April 5, 2019, 2:29 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading