ఏపీలో ఎన్నికల పోలింగ్ కు మరో ఐదురోజులే మిగిలున్న నేపథ్యంలో ఈసారి గెలిచేదెవరు, ఓడేదెవరు, ఫలితాలను మలుపు తిప్పేదెవరన్న అంశంపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చ సాగుతోంది. గత ఎన్నికల్లో టీడీపీకి మద్దతునిచ్చిన కాపులు ఈసారి ఎటువైపు మొగ్గుచూపుతున్నారు ? పవన్ కళ్యాణ్ రాకతో కాపు ఓటు బ్యాంకు జనసేన వైపుకు ఏమేరకు మళ్లుతుందన్న అంశాలు కీలకంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో న్యూస్ 18 క్షేత్రస్ధాయి పరిశీలనలో పలు కీలక అంశాలు వెలుగుచూశాయి.
టీడీపీ, వైసీపీ మధ్య హోరాహోరీ పోరు తప్పదని భావిస్తున్న ఈ ఎన్నికల్లో ఏపీలోని గోదావరి జిల్లాలతో పాటు విశాఖ, ఇతర జిల్లాల్లో ఉన్న కాపు ఓటు బ్యాంకు వీరిద్దరిలో ఎవరికి మద్దతిస్తుంది? వీరిద్దరినీ కాదని తొలిసారి బరిలో ఉన్న జనసేన వైపు మొగ్గు చూపుతుందా అన్న అంశం ప్రధానంగా మారింది. గత ఎన్నికల్లో గోదావరి జిల్లాల్లో టీడీపీ విజయం వెనుక పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన ప్రభావం తీవ్రంగా ఉంది. జనసేన స్వయంగా పోటీ చేయకపోయినా... టీడీపీకి నేరుగా మద్దతు ప్రకటించడంతో కాపు సామాజికవర్గం చాలాకాలం తర్వాత టీడీపీవైపు మొగ్గు చూపింది. రిజర్వేషన్ల హామీతో పాటు కాపు కార్పోరేషన్ ఏర్పాటు వంటి అంశాలు కూడా ఈ సామాజికవర్గంపై తీవ్ర ప్రభావం చూపాయి.
టీడీపీ అధికారంలోకి వచ్చాక రిజర్వేషన్ల హామీని రెండున్నరేళ్ల పాటు విస్మరించింది. ముద్రగడ పద్మనాభం ఉద్యమంతో కాపులంతా ఏకమవుతున్నారని గుర్తించిన ప్రభుత్వం... జస్టిస్ మంజునాథ కమిషన్ ను ఏర్పాటు చేసింది. కాపు సామాజికవర్గం వెనుకబాటుపై మంజునాథ కమిషన్ కూడా క్లారిటీ ఇవ్వలేకపోవడంతో ప్రభుత్వం ఇరుకునపడింది. దీంతో మంజునాథ నివేదికపై సంతకం కూడా చేయకుండానే బాధ్యతల నుంచి తప్పుకున్నారు. దీంతో టీడీపీ ప్రభుత్వం కమిషన్ లోని ఇతర సభ్యుల సంతకాలతో నివేదిక సేకరించి అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. దీని ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వాలని కోరుతూ కేంద్రానికి లేఖ కూడా రాసింది. చివరికి కేంద్రం దాన్ని తిరస్కరించడంతో కాపు రిజర్వేషన్ల డిమాండ్ మళ్లీ మొదటికొచ్చింది.
అదే సమయంలో కేంద్రం ఓసీ కులాలకు ప్రకటించిన పదిశాతం రిజర్వేషన్లలో ఐదుశాతాన్ని కాపులకు కేటాయిస్తూ చంద్రబాబు సర్కారు మరో నిర్ణయం తీసుకుంది. ఇది న్యాయపరంగా చెల్లుబాటు అవుతుందా లేదా అంశాన్ని పక్కనబెడితే కాపులకు రిజర్వేషన్ల హామీని నిలబెట్టుకున్నట్లు టీడీపీ చెప్పుకోవడానికి ఓ అవకాశం దొరికింది. అయితే కాపులు దీన్నీ నమ్మకపోవడంతో ఎన్నికల వేళ టీడీపీకి ఇబ్బందికరమైన పరిస్ధితి ఏర్పడుతోంది.
టీడీపీ రిజర్వేషన్ల హామీపై మాటతప్పడం, తాను అనుకూలమే కానీ, నిర్ణయం కేంద్రానిదే అని జగనే తేల్చేసిన నేపథ్యంలో తొలిసారి ఎన్నికల బరిలో ఉన్న జనసేన వైపు కాపుల చూపు మళ్లింది. అధినేత పవన్ కళ్యాణ్ స్వయంగా కాపు సామాజికవర్గానికి చెందిన నేత అయినా రిజర్వేషన్లు సాధించే సామర్ధ్యం ఆయనకు లేదన్న విషయంలో ఎవరికీ అనుమానాలు లేవు. దీంతో మరోసారి టీడీపీ, వైసీపీల్లో ఏదో ఒక పార్టీవైపు కాపులు మళ్లాల్సిన పరిస్ధితి. అలాగని ఈ రెండు పార్టీల్లో ఎవరో ఒకరు రిజర్వేషన్లు ఇస్తారా అంటే అదీ గ్యారంటీ లేదు. దీంతో కాపుల్లోనూ గందరగోళ పరిస్ధితి నెలకొంది.
ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో పరిస్ధితిని గమనిస్తే ఐదేళ్లుగా రిజర్వేషన్ల పేరుతో తమను మభ్యపెట్టారని, రిజర్వేషన్ల కోసం ఉద్యమం చేస్తే తుని రైలు దహనం ఘటన పేరుతో కేసులు పెట్టి వేధించడం వంటి కారణాలతో కాపుల్లో టీడీపీపై వ్యతిరేకత పెరిగినట్లు తెలుస్తోంది. అదే సమయంలో వైసీపీ కాపు రిజర్వేషన్ల విషయంలో అనుకూలంగా ఉన్నా... ఇవ్వాల్సింది కేంద్రమే నంటూ క్లారిటీ ఇవ్వడంతో ఆ పార్టీకి కాస్త మొగ్గు కనిపిస్తోంది. ఇక రిజర్వేషన్ల హామీతో సంబంధం లేకుండా జనసేనను కాపులు తమ సొంత పార్టీగా భావిస్తున్నారు. దీంతో పలుచోట్ల జనసేనకు అనుకూల పరిస్ధితి కనిపిస్తోంది. కానీ అది నియోజకవర్గాల్లో గెలుపోటములు నిర్ణయించే అవకాశాన్ని ఇస్తుంది. కానీ జనసేనకు విజయాలు కట్టబెట్టేలా మాత్రం లేదు. దీంతో కాపుల ఓట్లలో భారీ చీలిక తప్పేలా లేదు. వారు ఏ పార్టీవైపు పూర్తిగా మొగ్గే పరిస్ధితి లేదనేది ఇక్కడ తేలింది.
(సయ్యద్ అహ్మద్, కరస్పాండెంట్, న్యూస్18)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh Assembly Election 2019, Andhra Pradesh Lok Sabha Elections 2019, Janasena party, Lok Sabha Election 2019, Mudragada Padmanabham, Tdp, Ysrcp