సినీ నటుడు అలీపై జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ చేసిన విమర్శలు తెలుగు రాష్ట్రాల్లో హాట్‌టాపిక్‌గా మారాయి. ప్రాణమిత్రుడైన అలీ.. తనను మోసం చేసి వైసీపీలోకి వెళ్లారని పవన్ ఆరోపించడం సంచలనం రేపింది. ఇటు టాలీవుడ్‌లోనూ దీనిపై చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో జనసేనాని వ్యాఖ్యలపై స్వయంగా అలీయే స్పందించారు. వైసీపీలోకి వెళ్తే తప్పేంటని పవన్ కల్యాణ్‌కు గట్టిగా కౌంటర్ ఇచ్చారు అలీ. చిరంజీవి వేసిన బాటలో పవన్ సినిమాల్లోకి వచ్చారని..కానీ తాను స్వశక్తితోనే ఇండస్ట్రీలోకి వచ్చానని మండిపడ్డారు. సార్..సార్..అంటూనే పవన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు అలీ.
మీరు చిరంజీవి వేసిన బాటలో మీరు వచ్చారు. కానీ నేను నా బాట వేసుకొని పైకి వచ్చాను. అలీ కష్టాల్లో ఉన్నప్పుడు సాయపడ్డాను అని పవన్ అన్నారు. మీరు ఏ విధంగా సాయపడ్డారు పవన్ సర్. అంటే ధనం ఏమైనా ఇచ్చారా..సర్..! సినిమాలు లేక ఇంట్లో ఉంటే తీసుకెళ్లి అవకాశాలు ఇప్పించారా? మీరు ఇండస్ట్రీలోకి రాకమునుపు నుంచి నేను ఒక మంచి పొజిషన్లో ఉన్నా. రూపాయి సాయం చేయమని ఏనాడూ ఎవ్వరి దగ్గరా అడగలేదు. అల్లా దయవల్ల చాలా బాగున్నాను. ఆకలితో చచ్చిపోతాను తప్ప వెళ్లి అమ్మా.. దేహీ అనే స్థితికి వెళ్లను.
— అలీ, సినీ నటుడు
మీరు రాజమండ్రిలో విమర్శ చేయటం సరికాదు. వైయస్సార్ సీపీలో వెళ్లటం తప్పేంటి? అదేమైన నేరమా? రాజ్యాంగంలో రాసుందా అక్కడకు వెళ్లకూడదని. నాకు స్వేచ్ఛ లేదా? మీ గురించి నేను వ్యాఖ్యానిస్తే మీరు నాగురించి కామెంట్ చేయాలి. రాజమండ్రిలో మీరు కామెంట్ చేయటం సరికాదు. మీరు నా చుట్టానికి టిక్కెట్ ఇచ్చానని పవన్ అంటున్నారు. నేను మిమ్మల్ని వచ్చి అడిగానా? పోనీ ఇచ్చే ముందు నన్ను అడిగారా? పార్టీలోకి రమ్మని పవన్ ఎప్పుడైనా అడిగారా? అడగనప్పుడు ఇంత పెద్ద కామెంట్ చేయటం ఎందుకు?
— అలీ, సినీ నటుడు
పవన్ కల్యాణ్ ఎప్పుడూ బాగుండాలని కోరుకునే వ్యక్తుల్లో తాను మొదటి వ్యక్తినని అలీ అన్నారు. అలాంటి తనపై పవన్ ఆరోపణలు చేయడం బాధించిందన్నారు. కాగా, అలీ, పవన్ బెస్ట్ ఫ్రెండ్స్..! అలీ తనకు గుండెకాయలాంటి వాడని పవన్ కల్యాణ్ గతంలో చాలాసార్లు అన్నారు. కానీ ఈ ఎపిసోడ్లో ఇరువురి మధ్య దూరం పెరిగింది. మిత్రులు కాస్త శత్రువులుగా మారారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.