చంద్రబాబు మళ్లీ బీజేపీతో కలుస్తారా? ఎగ్జిట్‌పోల్ తర్వాత వ్యూహం మారిందా?

ఫలితాలు ఏమాత్రం ప్రతికూలంగా వచ్చినా... ఈవీఎంల వల్లే ఓడిపోయామన్న ప్రచారంతో పాటు మరోసారి ఎన్డీయేవైపు చూసేందుకు కూడా వెనుకాడకపోవచ్చనే ప్రచారం అమరావతిలో జరుగుతోంది. ఈ పరిస్ధితిని ముందుగా ఊహించడం వల్లే చంద్రబాబు ఈ మధ్య మోడీపై విమర్శల దాడిని తగ్గించినట్లు తెలుస్తోంది.

news18-telugu
Updated: May 20, 2019, 9:54 PM IST
చంద్రబాబు మళ్లీ బీజేపీతో కలుస్తారా? ఎగ్జిట్‌పోల్ తర్వాత వ్యూహం మారిందా?
చంద్రబాబు నాయుడు, ప్రధాని మోదీ
  • Share this:
కేంద్రలో మరోసారి ఎన్డీయేదే అధికారం..! నరేంద్ర మోదీయే ప్రధాన మంత్రి..! ఎగ్జిట్ పోల్స్ చెప్పింది ఇదే..! ఎగ్జిట్ పోల్‌ అంచనాల నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు వ్యూహం మార్చుకుంటారా ? మంగళవారం ఈసీతో భేటీ తర్వాత యూపీఏతో కలిసి ఉండే పక్షాల విషయంలో ఓ క్లారిటీ వస్తుంది. దీని ఆధారంగా చంద్రబాబు ప్లాన్ బీ అమలుకు తెరలేపుతారా ? రెండేళ్ల క్రితం విభజన హామీల అమలులో విఫలమైందంటూ ఎన్డీయే నుంచి బయటికొచ్చిన చంద్రబాబు... మరోసారి ఎన్డీయే తలుపు తడతారా ? ముఖ్యంగా కేంద్రంలో అధికారం చేపట్టే ఎన్డీయేకు తన ప్రత్యర్ధి జగన్‌ దగ్గర కాకుండా ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభిస్తారా ? ఇప్పుడు అమరావతిలో ఇదే ప్రచారం జోరందుకుంటోంది.

రెండేళ్ల క్రితం ఎన్డీయేతో విభేదించి కేంద్ర మంత్రి పదవులకు రాజీనామా చేసి బయటికొచ్చిన టీడీపీ... జాతీయ, రాష్ట్ర స్ధాయిలో బీజేపీపై అలుపెరగని పోరు సాగించింది. ఎన్డీయే నుంచి టీడీపీ బయటికి రావడంపై అప్పట్లో ఇంటా బయటా భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనా టీడీపీ పట్టించుకోలేదు. అంతటితో ఆగకుండా బీజేపీతో అంటకాగుతున్నారంటూ వైసీపీ, టీఆర్ఎస్‌లపై తీవ్ర ఆరోపణలకు దిగింది. అధినేత చంద్రబాబు ధర్మపోరాట దీక్షల పేరిట రాష్ట్రంలోనూ, ఢిల్లీలోనూ బీజేపీ వైఖరిపై తీవ్ర విమర్శలకు దిగారు. మరోసారి ఎట్టి పరిస్ధితుల్లోనూ బీజేపీ అధికారంలోకి రాదని చంద్రబాబు అప్పట్లో అంచనా వేశారు. దీనికి తగినట్లుగానే యూపీఏను బలోపేతం చేసే దిశగా కాంగ్రెస్‌తో మంతనాలు సాగించారు.

ఎన్నికలు ముగిశాయి. ఫలితాల రాక మాత్రమే మిగిలింది. ఈ సమయంలో వెలువడిన ఎగ్జిట్ పోల్స్ చంద్రబాబు ఆశలను వమ్ము చేసేలా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా జాతీయ స్ధాయిలో న్యూస్ 18తో పాటు అన్ని మీడియా సంస్ధలు ఎన్టీయే మరోసారి భారీ మెజారిటీతో అధికారంలోకి రావడం ఖాయమని తేల్చేశాయి. దీంతో ఇన్నాళ్లు మోడీకి వ్యతిరేకంగా పావులు కదిపిన మాయావతి,స్టాలిన్ వంటి ప్రాంతీయ శక్తులు సైతం తమ మనసు మార్చుకున్నట్లు కనిపిస్తున్నాయి. తిరిగి మోడీ అధికారంలోకి వస్తే తమకు కష్టాలు తప్పవనే అంచనాతో ఉన్న ఆయా పార్టీలు... ఈ నెల 23న సోనియా గాంధీ ఏర్పాటు చేసిన యూపీఏ సమావేశానికి వెళ్లబోవడం లేదని చెప్పాయి. అసలే ఎగ్జిట్ పోల్స్ ఇచ్చిన షాక్ తో ఆందోళనలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి మాయా, స్టాలిన్ దూరం కావడం సహజంగానే చంద్రబాబులోనూ ఆందోళన పెంచుతోంది. దీంతో ఆయన తదుపరి పరిస్ధితులను చక్కదిద్దేందుకు మరోసారి రంగంలోకి దిగారు.

సోమవారం సాయంత్రం కోల్‌కతాలో బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో సమావేశమైన చంద్రబాబు... గంటపాటు చర్చలు జరిపారు. అయితే ఇందులో వీరిద్దరూ భవిష్యత్ కార్యాచరణపై ఏకాభిప్రాయానికి రాలేకపోయినట్లు తెలుస్తోంది. మమతతో భేటీ తర్వాత చంద్రబాబు మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోవడాన్ని బట్టి చూస్తే పరిస్ధితి అర్ధమవుతోంది. ఈ నేపథ్యంలో మంగళవారం బీజేపీ వ్యతిరేకపక్షాతో కలిసి ఈసీతో భేటీ కావాలని చంద్రబాబు కోరడాన్ని బట్టి చూస్తే రెండు విధాలుగా ఆయన వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే యూపీఏ భేటీకి హాజరుకాబోమని స్పష్టం చేసిన విపక్షాల విషయంలో ఓ క్లారిటీకి రావడం లేదా వారిని వదిలిపెట్టి తదుపరి కార్యాచరణకు సిద్ధం కావడం చంద్రబాబు లక్ష్యంగా కనిపిస్తోంది.

ఎగ్జిట్ పోల్ అంచనాల నేపథ్యంలో మరోసారి కేంద్రంలో మోడీ అధికారంలోకి వస్తే అనుసరించాల్సిన వ్యూహంపై చంద్రబాబు విపక్షాలతో సమాలోచనలు చేస్తున్నారు. మాయవతి, స్టాలిన్ తో పాటు ఇతర పార్టీలు కూడా వెనుకడుగు వేసే పరిస్ధితే ఉంటే తాను కూడా వ్యూహం మార్చుకోవాలని చంద్రబాబు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఫలితాలు ఏమాత్రం ప్రతికూలంగా వచ్చినా... ఈవీఎంల వల్లే ఓడిపోయామన్న ప్రచారంతో పాటు మరోసారి ఎన్డీయేవైపు చూసేందుకు కూడా వెనుకాడకపోవచ్చనే ప్రచారం అమరావతిలో జరుగుతోంది. ఈ పరిస్ధితిని ముందుగా ఊహించడం వల్లే చంద్రబాబు ఈ మధ్య మోడీపై విమర్శల దాడిని తగ్గించినట్లు తెలుస్తోంది. మోడీకి బదులుగా ఈసీని లక్ష్యంగా చేసుకోవడం వెనుక ఉద్దేశం కూడా ఇదే అని విపక్ష వైసీపీ నేతలు కూడా ఆరోపిస్తున్నారు.

(సయ్యద్ అహ్మద్, న్యూస్ 18 కరెస్పాండెంట్, విజయవాడ)
Published by: Shiva Kumar Addula
First published: May 20, 2019, 9:54 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading