HOME »NEWS »POLITICS »ap assembly elections 2019 sidda raghava rao vs magunta srinivasulu reddy who will win in ongole parliamentary constituency sk

మాగుంట వర్సెస్ శిద్దా...ఒంగోలు పార్లమెంట్ బరిలో విజేత ఎవరు?

మాగుంట వర్సెస్ శిద్దా...ఒంగోలు పార్లమెంట్ బరిలో విజేత ఎవరు?
మాగుంట శ్రీనివాసులు రెడ్డి, శిద్దా రాఘవరావు

చివరి నిమిషంలో ఇరుపార్టీలు అభ్యర్థులను ప్రకటించడం, రెండు పార్టీల్లోనూ కొత్తగా వచ్చిన వారికి టికెట్లు ఇవ్వడంతో పాతవారు అసంతృప్తిలో ఉన్నారు. అసంతృప్త నేతల అలక టీడీపీ, వైసీపీ రెండు పార్టీలకు మైనస్‌గా కనిపిస్తోంది.

 • Share this:
  (డి.లక్ష్మీనారాయణ, న్యూస్ 18 ప్రకాశం జిల్లా కరెస్పాండెంట్ )

  జాతీయోద్యమ పోరాటంలో సైమన్ గోబ్యాక్ అంటూ సాగిన ఉద్యమంలో చొక్కా గుండీలు విప్పి "రండిరా..కాల్చండి రా" అని బ్రిటీష్ తూటాలకు సవాల్ విసిరిన స్వాతంత్య్ర సమరయోధుడు, మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ తొలిసి సీఎం టంగుటూరి ప్రకాశం పంతులు సొంత జిల్లా ప్రకాశం జిల్లా. అంతర్జాతీయ ఖ్యాతి గడించిన ఒంగోలు జాతిగిత్తల పుట్టినిల్లైన ఒంగోలు ఎంపీ స్థానంలోనే ఆయన స్వగ్రామం వినోదరాయుని పాలెం కూడా ఉంది. కమ్యూనిస్ట్ నేత మాదాల నారాయణ స్వామి, జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించిన బెజవాడ పాపిరెడ్డి, మాగుంట సుబ్బరామిరెడ్డి వంటి నేతలు కూడా ఇక్కడి నుంచే ప్రాతినిధ్యం వహించారు. ఇలాంటి ఒంగోలు లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఈ ఎన్నికల్లో మాగుంట శ్రీనివాసులు రెడ్డి (వైసీపీ), శిద్దా రాఘవరావు (టీడీపీ) పోటీచేస్తున్నారు. సామాజికంగా, ఆర్థికంగా ఇద్దరూ బలమైన నేతలు కావడంతో ఈ స్థానంపై ఏపీ రాజకీయాల దృష్టి సారించాయి.  ఒంగోలు ఎంపీగా టీడీపీ తరఫున మాగుంట శ్రీనివాసులు రెడ్డి, వైసీపీ తరఫున మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి బరిలో ఉంటారని అంతా భావించారు. కానీ చెన్నై, నెల్లూరులోని మాగుంట కుటుంబానికి చెందిన వ్యాపారసంస్థలపై ఐటీ, ఈడీ దాడులు జరగడంతో పరిస్థితి మారిపోయింది. దీనికితోడు టీడీపీ తరఫున పోటీచేస్తే విజయం సాధించడం కష్టమనే సొంత సర్వే రిపోర్టులతో మాగుంట శ్రీనివాసులు రెడ్డి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో చివరి నిమిషంలో మంత్రి శిద్ధా రాఘవరావును ఎంపీగా బరిలో నిలిపింది టీడీపీ. వైసీపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న మాగుంట శ్రీనివాసులు రెడ్డి గెలుపు దాదాపు ఖాయంగా మొదట కనిపించినా..ఆ తర్వాత పరిస్థితి మారిపోయింది. వైఎస్ జగన్ బాబాయి, ఒంగోలు మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తనకు టికెట్ దక్కలేదన్న అసంతృప్తితో విదేశాలకు వెళ్లిపోయారు. విదేశాల నుంచి తిరిగి వచ్చినప్పటికీ వైసీపీకి దూరంగా ఉంటున్నారు. ఎన్నికలు జరిగే వరకూ ప్రకాశం జిల్లాలో అడుగుపెట్టనని ప్రకటించడంతో మాగుంట గెలుపుపై అనుమానాలు ముసురుకుంటున్నాయి. అదే క్రమంలోటీడీపీ నేతల్లో ఆశలు రేకెత్తిస్తున్నాయి.

  మాగుంట కుటుంబం చేసిన సేవాకార్యక్రమాలతో పాటు రెడ్డి సామాజికవర్గం నేత కావడం, వివాదరహితుడు కావడం, అన్ని పార్టీల్లోని నాయకులతో స్నేహసంబంధాలు ఉండటం మాగుంట శ్రీనివాసులురెడ్డికి ప్రధానమైన బలం. ఏపీలోని జిల్లాల్లో అధిక శాతం ఎస్సీ సామాజికవర్గం ప్రకాశం జిల్లాలో ఉంది. ఆ వర్గం వైసీపీకి బలమైన మద్దతుదారు కావడం కూడా మాగుంటకు కలిసి వచ్చే అంశం. ఇప్పటి వరకు ఒంగోలు ఎంపీ స్థానానికి 16 సార్లు ఎన్నికలు జరిగితే 10 సార్లు రెడ్డి సామాజికవర్గం వారే ఎంపీగా విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థి రెడ్డి సామాజికవర్గం కావడంతో ఇది ఆయనకు ప్రధాన బలం. కానీ కనిగిరి, గిద్దలూరు, దర్శి నియోజకవర్గాలలో బలమైన అనుచరగణం ఉన్న మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఎన్నికలకు దూరంగా ఉండటంతో ఆయన వర్గం మాగుంటకు సహకరించడం అనుమానంగానే కనిపిస్తోంది. ఐటీ, ఈడీ దాడులకు భయపడి వైసీపీలో చేరారని జిల్లాలో బలమైన ప్రచారం ఉండటం, మాగుంట నామినేషన్ వేయగానే ట్విట్టర్లో రుణఎగవేత దారుడు విజయ్ మాల్యా 'ఆల్ ద బెస్ట్' చెబుతూ ట్వీట్ చేయడం విద్యావంతుల్లో మైనస్ అయింది. గిద్దలూరులో మాజీ వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే పిడతల సాయికల్పనారెడ్డి టీడీపీకి మద్దతుగా నిలవడం, కొండపి నియోజకవర్గంలో ఇంఛార్జిగా ఉన్న వరికూటి అశోక్ బాబును వైసీపీ అధిష్టానం తప్పించడం, దర్శిలో పోటీ చేస్తున్న వైసీపీ, టీడీపీ అభ్యర్థులు ఇద్దరూ కాపు సామాజికవర్గం వారు కావడం మాగుంట శ్రీనివాసులు రెడ్డికి ప్రతికూలంగా మారే అవకాశముంది.

  మాగుంట శ్రీనివాసులు రెడ్డి


  ఇక టీడీపీ విషయానికొస్తే..పసుపు-కుంకుమ, అన్నదాత సుఖీభవ పథకాలతో పాటు చివరి విడత రైతు రుణమాఫీ నిధులు విడుదలైతే లబ్ధిదారులంతా టీడీపీకి మద్దతుగా ఉంటారని టీడీపీ అభ్యర్థి శిద్ధా రాఘవరావు బలంగా నమ్ముతున్నారు. టీడీపీ తరఫున బరిలో ఉన్న రెడ్డి, కమ్మ, కాపు సామాజికవర్గం అభ్యర్థులు బలమైన వారు కావడంతో..పార్లమెంట్ స్థానంలోనూ టీడీపీకి ఓట్లు పోలయ్యేలా చూస్తారనే నమ్మకంతో ఉన్నారు శిద్దా. ఒంగోలు ఎంపీ స్థానం పరిధిలో వైశ్య సామాజికవర్గం ఓట్లు సుమారు లక్షా ఇరవై వేలు ఉండటం.. టీడీపీ అభ్యర్థి శిధ్దా రాఘవరావు వైశ్య సామాజికవర్గం కావడం ఆయన బలం. మంత్రిగా పనిచేసిన అనుభవంతో పాటు జిల్లాలోని అందరు శాసన సభ్యులతో సన్నిహిత సంబంధాలు ఉండటం ఆయనకు కలసివచ్చే అంశం. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులుగా కనిగిరిలో ఉగ్ర నరసింహారెడ్డి, గిద్దలూరులో ముత్తుముల అశోక్ రెడ్డి పోటీచేస్తుండటంతో రెడ్డి సామాజికవర్గం ఓట్లు టీడీపీకి పోలయ్యే అవకాశం ఉంది. ఐతే వైశ్య సామాజికవర్గం వారికే మాత్రమే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారన్న వాదన శిద్దాకు మైనస్ గా మారింది.

  శిద్దా రాఘవరావు


  చివరి నిమిషంలో ఇరుపార్టీలు అభ్యర్థులను ప్రకటించడం, రెండు పార్టీల్లోనూ కొత్తగా వచ్చిన వారికి టికెట్లు ఇవ్వడంతో పాతవారు అసంతృప్తిలో ఉన్నారు. అసంతృప్త నేతల అలక టీడీపీ, వైసీపీ రెండు పార్టీలకు మైనస్‌గా కనిపిస్తోంది. ఎలాగైనా సరే టీడీపీ ఓడిపోకూడదని కమ్మ సామాజికవర్గం ఐకమత్యంగా కృషి చేస్తుండటం, అదే స్థాయిలో రెడ్డి సామాజికవర్గం కూడా వైసీపీకోసం పనిచేస్తుండటం ఆసక్తికరమైన అంశం.


  కనిగిరి, దర్శి, గిద్దలూరు, ఒంగోలు నియోజకవర్గం, మార్కాపురం టౌన్‌లోనూ కాపు సామాజికవర్గం బలంగా ఉంది. జనసేన తరపున బెల్లంకొండ సాయిబాబా అనే కొత్తవ్యక్తి బరిలో ఉన్నారు. ఆయన ఎవరో కూడా ప్రజలకు తెలియదు. దీంతో కాపుల ఓట్లు ఎటు మల్లుతాయి అనేది ప్రశ్నార్థకమే. కనిగిరి, దర్శి, గిద్దలూరు, మార్కాపురంలో కరవు కారణంగా సుమారు 90 వేలమంది వలస కూలీలు పనులకోసం పక్కరాష్ట్రాలకు వెళ్లారు. వీరు సహజంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసే అవకాశం ఉంది. కానీ, ఇరు పార్టీలు మధ్యవర్తుల ద్వారా వారి ఓట్ల కొనుగోలుకు ప్రయత్నాలు ఇప్పటికే ప్రారంభించారు. మరి వీరు ఏ పార్టీ వైపు నిలుస్తారు అనేది కూడా కీలకం.

  మరోవైపు కాంగ్రెస్, జనసేన పార్టీలు అంతర్గతంగా టీడీపీకి సహకరిస్తున్న పరిస్థితి జిల్లాలో కనిపిస్తోంది. గిద్దలూరు నియోజకవర్గంలో కాపు, రెడ్డి సామాజికవర్గాల ప్రజలు ఎక్కువగా ఉంటారు. టీడీపీ రెడ్డి సామాజికవర్గానికి, వైసీపీ కాపు సామాజికవర్గానికి టికెట్ ఇస్తే.. జనసేన చంద్రశేఖర్ యాదవ్ అనే యాదవ సామాజికవర్గం వ్యక్తిని బరిలో నిలిపింది. దీంతో బీసీ ఓట్లలో కచ్చితంగా చీలిక వస్తుంది. ఇది వైసీపీకి మైనస్‌గా మారవచ్చు. కనిగిరి నియోజకవర్గంలో కూడా కాపు, బీసీ, రెడ్డి సామాజికవర్గానికి ప్రజలతే ఆధిపత్యం. ఇక్కడ వైసీపీ యాదవ సామాజికవర్గానికి, టీడీపీ రెడ్డి సామాజికవర్గానికి టికెట్లు ఇచ్చాయి. టీడీపీకి సిట్టింగ్ ఎమ్మెల్యే కాపు సామాజికవర్గానికి చెందిన నేత కావడంతో కాపు, రెడ్డి సామాజికవర్గం ఓట్లు టీడీపీకి వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ నియోజకవర్గ టికెట్‌ను జనసేన సీపీఐకి కేటాయిండం కూడా టీడీపీకి అనుకూలించే అంశం.

  ఒంగోలులో కూడా కాపు సామాజికవర్గానికి 26 వేల వరకూ ఓట్ బ్యాంకుంది. ఇక్కడ జనసేన కాపు సామాజికవర్గం వారిని కాకుండా ముస్లిం సామాజికవర్గం అభ్యర్థిని బరిలో నిలిపింది. దీంతో మొదటి నుంచి వైసీపీకి మద్దతుగా ఉన్న ముస్లిం ఓట్లలో చీలిక ఏర్పడి వైసీపీకి నష్టం కలగవచ్చు. ఈ పరిణామాలను గమనిస్తే ఒంగోలు ఎంపీ స్థానం పరిధిలో జనసేన టీడీపీకి మేలు చేసే విధానం అవలంభించింది అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఏదేమైనా? వర్గ, కుల రాజకీయాలకు అలవాటైన ఒంగోలు పార్లమెంట్ స్థానంలో రాజకీయ చైతన్యం కలిగిన ఓటర్లు ఎవరిని గెలిపిస్తారు అనేది చివరి వరకూ సస్పెన్సే..!
  Published by:Shiva Kumar Addula
  First published:March 25, 2019, 18:19 IST