గుంటూరు జిల్లాలోని చిలకలూరిపేట అసెంబ్లీ స్థానంలో ఈసారి పోటీ ఆసక్తికరంగా మారింది. టీడీపీ తరఫున మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ప్రముఖ పారిశ్రామికవేత్త, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మరోసారి బరిలోకి దిగుతున్నారు. ఆయనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి వెనుకబడిన వర్గాలకు చెందిన NRI విడదల రజని పోటీచేస్తున్నారు. మరి ఇద్దరిలో గెలుపు ఎవరిని వరించబోతోంది? కలిసి వచ్చే అంశాలేంటి? ప్రతికూలతలేంటి?
ప్రత్తిపాటి పుల్లారావు చిలకలూరిపేటలో 1999 నుంచి నాలుగు సార్లు పోటీచేశారు. ఒకసారి ఓడిపోగా..మూడుసార్లు విజయం సాధించారు. 2014లో తన ప్రత్యర్థి మర్రి రాజశేఖర్‌పై సుమారు 10,000 ఓట్ల పైచిలుకు మెజార్టీ సాధించారు. అనంతరం చంద్రబాబు కేబినెట్‌లో మంత్రి పదవిని కూడా పొందారు. గత 20 ఏళ్లుగా నియోజకవర్గాన్ని అట్టిపెట్టుకుని ఉన్న ఆయనకు అన్ని గ్రామాల్లో మంచి పట్టు ఉంది. దాంతో పాటు టీడీపీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు కూడా కలిసి వస్తాయని ఆయన భావిస్తున్నారు. ఐతే ప్రత్తిపాటి ఫ్యామిలీ అవినీతి పతాకస్థాయికి చేరిందనే ఆరోపణలు ఆయనకు మైనస్‌గా మారే అవకాశముంది.
మొదటి నుంచి టీడీపీ వైపు నిలిచిన బీసి వర్గాలు ఈ సారి ఎటువైపు ఉంటారనే దానిపైనే చిలకలూరిపేట భవితవ్యం ఆధారపడి ఉంది. కమ్మ, రెడ్డి, కాపు సామాజికవర్గానికి చెందిన ఓటర్లు చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్నా గెలుపు ఓటముల శాసించే స్థాయి మాత్రం బీసీలదే. వైసీపీ అభ్యర్థి రజనీ బీసీ నాయకురాలు కావడంతో ఆ సామాజికవర్గం ఓటర్లు వైసీపీ వైపు మొగ్గుచూపే అవకాశాలున్నాయి. దానికి తోడు మహిళా నేత కావడం, తక్కువ సమయంలో నియోజకవర్గంలో పట్టు సాధించడం, సీనియర్ నేత మర్రి రాజశేఖర్‌ని కలుపుకొనిపోవడం కూడా ఆమెకు కలిసివచ్చే అంశాలు.
అటు ఆర్థికంగానూ బలంగా ఉండడంతో 6 నెలల నుంచే ప్రజల్లో తిరుగుతున్నారు. ప్రతిపాటి పుల్లారావుకు రజని పోటీ ఇవ్వగలరా అని మొదట్లో చాలా మంది అనుమానాలు వ్యక్తంచేశారు. కానీ వారంతా తమ అభిప్రాయాన్ని మార్చుకున్నారు. ప్రత్తిపాటిని రజనీ ధీటుగా ఎదుర్కోగలరని చెబుతుండడం గమనార్హం. ఈ నేపథ్యంలో చిలకలూరిపేటలో మూడుసార్లు గెలిచిన ప్రతిపాటి పుల్లారావుకు ఈసారి వైసీపీతో టఫ్ ఫైట్ తప్పేలా లేదు. మరి పుల్లారావును రజని ఓడిస్తారా? లేదంటే నాలుగోసారి ఆయనే గెలుస్తారా? అనేది మే 23న తేలనుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.