ఏపీలో హింసాత్మక ఘటనల మధ్య ముగిసిన పోలింగ్..

ఏపీలో సార్వత్రిక ఎన్నికలు గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి హింసాత్మకంగా సాగాయి. గతంలో రాయలసీమలోని కొన్ని ఫ్యాక్షన్ గ్రామాలకే పరిమితమైన కక్షలు... ఈసారి మాత్రం నాలుగు జిల్లాల్లోనూ ప్రభావం చూపాయి.

news18-telugu
Updated: April 11, 2019, 10:54 PM IST
ఏపీలో హింసాత్మక ఘటనల మధ్య ముగిసిన పోలింగ్..
క్యూలో నిలబడిన ఓటర్లు
news18-telugu
Updated: April 11, 2019, 10:54 PM IST
ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ హింసాత్మక ఘటనల మధ్య ముగిసింది. టీడీపీ, వైసీపీ మధ్య హోరాహోరీ తప్పదన్న అంచనాలను నిజం అనిపించేలా పలుచోట్ల ఇరుపార్టీల కార్యకర్తలు పరస్పర దాడులకు దిగారు. ఓవైపు ఈవీఎంల మొరాయింపుతో ఆరంభంలో మందకొడిగా సాగిన పోలింగ్... ఈసీ రంగంలోకి దిగి యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టడంతో మధ్యాహ్నానికి వేగం పుంజుకుంది. తాజా అంచనాల ప్రకారం ఏపీలో దాదాపు 80 శాతం పోలింగ్ నమోదైనట్లు తెలుస్తోంది. గత ఎన్నికలతో పోలిస్తే పెరిగిన పోలింగ్ శాతం ప్రభుత్వ వ్యతిరేకతకు నిదర్శనమా కాదా అన్నది తేలాలంటే మే 23 వరకూ వేచి చూడక తప్పదు.

ఏపీలో సార్వత్రిక ఎన్నికలు గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి హింసాత్మకంగా సాగాయి. గతంలో రాయలసీమలోని కొన్ని ఫ్యాక్షన్ గ్రామాలకే పరిమితమైన కక్షలు... ఈసారి మాత్రం నాలుగు జిల్లాల్లోనూ ప్రభావం చూపాయి. ఆళ్లగడ్డ నియోజకవర్గం అహోబిలంలో మంత్రి అఖిలప్రియ, ఆమె ప్రత్యర్ధులకూ మధ్య దాడులు, అనంతపురం జిల్లా తాడిపత్రిలో జేసీ, కేతిరెడ్డి వర్గాల మధ్య దాడులు యుద్ధరంగాన్ని తలపించాయి.
గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో టీడీపీ అభ్యర్ధిగా ఉన్న స్పీకర్ కోడెల శివప్రసాద్ పై దాడి ఘటన, ఇదే జిల్లాలో మాచర్లలో టీడీపీ అభ్యర్ధిపై దాడి, చిలకలూరిపేటలో టీడీపీకి అనుకూలంగా రిగ్గింగ్ ఘటనలు చాలాకాలం తర్వాత ఎన్నికల్లో కనిపించాయని స్ధానికులు చెప్తున్నారు.

రాయలసీమతో పాటు కోస్తా జిల్లాల్లోనూ ఈసారి పార్టీల మధ్య ఘర్షణ వాతావరణం తప్పలేదు. దాదాపు రెండు దశాబ్దాలుగా కోస్తా జిల్లాల్లో చెప్పుకోదగిన హింసాత్మక ఘటనలు నమోదు కాలేదు. కానీ ఈసారి మాత్రం కోస్తా జిల్లాల్లోనూ పలుచోట్ల అభ్యర్ధులపై దాడులు, బూత్ ఆక్రమణలు, వాహనాలపై దాడులు కూడా చోటు చేసుకున్నాయి. టీడీపీ, వైసీపీ మధ్య హోరాహోరీ పోరే దీనికి కారణమని తెలుస్తోంది. ముఖ్యంగా చాలా నియోజకవర్గాల్లో వందల ఓట్లతోనే అభ్యర్ధుల గెలుపోటములు ఆధారపడి ఉండటమే ఇక్కడ కీలకమైంది.టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత గట్టిగా ఉందని పోలింగ్ సరళిని బట్టి తెలుస్తోంది. ముఖ్యంగా ఇసుక, మట్టి మాఫియా అక్రమాలు భారీగా చోటుచేసుకున్న నియోజకవర్గాల్లో ఈ ప్రభావం కనిపించింది. అదే సమయంలో మహిళా ఓటర్లు ప్రభుత్వం తాజాగా ఇచ్చిన సంక్షేమ పథకాల లబ్దికి సైతం కొంతమేర ప్రబావితం అయినట్లు తెలుస్తోంది. జనసేన ఓట్ల ప్రబావం అతికొద్ది నియోజకవర్గాలపైనే ఉన్నట్లు కూడా ఓటింగ్ సరళి స్పష్టం చేసింది. గోదావరి జిల్లాల్లో పలుచోట్ల జనసేన అభ్యర్ధులు టీడీపీ, వైసీపీ ఓట్లకు గండికొట్టినా వాటి ప్రభావం కొన్ని సీట్లపైనే ఉండబోతున్నట్లు సమాచారం.

పార్టీల ప్రభావం ఎలా ఉన్నా వాస్తవానికి క్షేత్రస్ధాయిలో సంక్షేమపథకాల జాతరకూ, మార్పుకూ మధ్య జరిగిన ఎన్నికలుగా రాయలసీమతో పాటు కోస్తాంధ్రలోనూ వీటిని అభివర్ణిస్తున్నారు. ఈ నేపథ్యంలో సంక్షేమపథకాల ప్రభావం కచ్చితంగా ఉండి తీరుతుందని అంచనా వేసిన టీడీపీ క్షేత్రస్ధాయిలో ప్రభుత్వ వ్యతిరేకతను పట్టించుకోలేదనే వాదన వినిపించింది. అన్నింటి కంటే ముఖ్యంగా ప్రభుత్వాధినేతగా ఉన్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అనుక్షణం ఈసీ నిర్ణయాలను వ్యతిరేకంగా నిరసనలకు దిగడం, పోలింగ్ ముగిశాక కూడా ఆయన తనయుడు లోకేష్ మంగళగిరిలో ధర్నాకు దిగడాన్ని బట్టి చూస్తే క్షేత్రస్ధాయిలో పరిస్ధితి అర్ధమవుతోందని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. భారీగా పెరిగిన ఓటింగ్ శాతాలు కూడా ప్రభుత్వ వ్యతిరేకతను తేటతెల్లం చేస్తున్నాయని వైసీపీ నేతలు చెప్తున్నారు. అదే సమయంలో వైసీపీ కంటే ఈసీనే ఎక్కువగా టార్గెట్ చేసేందుకు టీడీపీ ప్రయత్నించిందన్న వాదన వినిపించింది.

(సయ్యద్ అహ్మద్, న్యూస్ 18 విజయవాడ ప్రతినిధి)
First published: April 11, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...