ఏపీలో ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, వైసీపీ అధినేత వైఎస్ జగన్ రాష్ట్రమంతటా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఎన్నికలకు మరికొన్ని రోజులే సమయం ఉండడంతో ప్రచారాన్ని మరింత వేగవంతం చేశారు. ఈ క్రమంలో ఏపీలో ఎన్నికల ప్రచారానికి జాతీయ పార్టీల నేతలు రాబోతున్నారు. టీడీపీకి మద్దతుగా వాళ్లంతా ప్రచారంలో పాల్గొనబోతున్నారు.
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత దేవెగౌడ, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా, డీఎంకే ప్రెసిడెంట్ స్టాలిన్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌తో పాటు యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరి ఏపీకి రాబోతున్నారు. ఇప్పటికే వారి షెడ్యూల్ ఖరారైనట్లు తెలుస్తోంది.
మంగళవారం కడప, ఆళ్లగడ్డ, నంద్యాల, కర్నూలులో ఫరూక్ అబ్దుల్లా ప్రచారం చేయనున్నారు. ఈ నెల 28న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విజయవాడలో ప్రచారం చేయబోతున్నారు. ఈ నెల 31న విశాఖపట్టణంలో జరిగే టీడీపీ ర్యాలీలో మమతా బెనర్జీ పాల్గొంటారు. ఏప్రిల్ 2న ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ టీడీపీకి మద్దతుగా ప్రచారం నిర్వహిస్తారు. ఇక మాజీ ప్రధాని దేవెగౌడతో అనంతపురం, కర్నూలు ప్రచారం నిర్వహించే అవకాశముంది. చిత్తూరు జిల్లాలో స్టాలిన్ ప్రచారం చేస్తారని సమాచారం.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.