ప్రకాశం జిల్లాలో అంత్యంత కీలకమైన నియోజకవర్గాలలో మార్కాపురం ఒకటి. అభివృద్ధికి నోచుకోకుండా మూతపడిన పలకల పరిశ్రమ, వెలిగొండ ప్రాజెక్ట్ సమస్య ప్రతిపక్షాలకు అస్త్రంగా మారింది. ఈ నియోజకవర్గం నుంచి కమ్యూనిస్ట్ నాయకులు పూల సుబ్బయ్య, కందుల ఓబుల్ రెడ్డి, వెంగయ్య వంటి సీనియర్ నేతలు ప్రాతినిధ్యం వహించారు. ఇప్పుడు అదే స్థానం నుంచి టీడీపీ తరఫున కందుల నారాయణరెడ్డి, వైసీపీ తరఫున కేపీ నాగార్జున రెడ్డి బరిలో దిగారు. కందుల నారాయణరెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన అనుభవం ఉంటే.. కేపీ నారార్జున రెడ్డికి ఇవే మొదటి ఎన్నికలు. తండ్రి కేపీ కొండారెడ్డి, ఉడుములు శ్రీనివాసులు రెడ్డి మద్దతుతో రాజకీయ ఓనమాలు దిద్దుతూ.. గెలుపు భారం వారిపై మోపారు. గతంలో కేపీ కొండారెడ్డి మార్కాపురం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అనుభవం ఉండటం... ఆయనకు ఉడుములు శ్రీనివాసులరెడ్డి కుటుంబంతో బంధుత్వం ఉండటంతో.. సిట్టింగ్ ఎమ్మెల్యే జంకే వెంకటరెడ్డిని పక్కన పెట్టి వైసీపీ ఇక్కడ సీటు కేపీ నాగార్జునరెడ్డికి కేటాయించింది.
ఐదేళ్ల నుంచి నియోజకవర్గ ఇంఛార్జిగా ఉండటంతో టీడీపీ అభ్యర్థి కందుల నారాయణరెడ్డి నియోజకవర్గంలో విస్త్రతంగా పరిచయాలు ఏర్పరచుకున్నారు. మరోవైపు.. వైసీపీ అభ్యర్థి కేపీ నాగార్జున రెడ్డి కుటుంబ బలం, వైసీపీ ఓటు బ్యాంకుని నమ్ముకుని బరిలో దిగుతున్నారు. కానీ, ప్రజల్లో వివాద రహితుడుగా ఉన్న.. సిట్టింగ్ ఎమ్మెల్యేని వైసీపీ పక్కన పెట్టి.. కేపీ కుటుంబానికి టికెట్ ఇవ్వడం టీడీపీ అభ్యర్థికి కలసివచ్చే అంశాలు.
వెలిగొండ ప్రాజెక్టు పూర్చి చేయకపోవడం రైతుల్లో టీడీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంది. బలిజ సామాజికవర్గానికి చెందిన కాశీవిశ్వనాథ్ టీడీపీ నుంచి జనసేనలోకి వెళ్లి మార్కాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దిగారు. ఇది టీడీపీకి మైనస్ గా మారే అవకాశం ఉంది. మరోవైపు.. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే జంకే వెంకటరెడ్డికి టికెట్ నిరాకరించడంతో ఆయన వర్గం అసంతృప్తిగా ఉంది. వైసీపీ అభ్యర్థి నామినేషన్ కార్యక్రమానికి కూడా ఆయన హాజరకాకపోవడంతో జంకే వైసీపీకి పనిచేస్తారా? అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ, ప్రెస్ మీట్ పెట్టి ఆయన వైసీపీకి పనిచేస్తాను అని ప్రకటించారు.
2014లో వైసీపీలో గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారినా.., తాను పార్టీని వీడలేదని, అయినా టికెట్ దక్కలేదని జంకే ఆవేదనలో ఉన్నారు. దీనిని తమకు అనుకూలంగా మార్చుకోవడానికి టీడీపీ ప్రయత్నం చేస్తోంది.
తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో పాటు.. నియోజకవర్గాల్లో తాము చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు తెలియజేస్తూ కందుల నారాయణరెడ్డి ప్రజల్లోకి వెళుతుండగా.. వైసిపి మాత్రం ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజల్లోకి వెళుతుంది. దీంతో ఇరు పార్టీలు నువ్వా నేనా అన్న రీతిలో అనునిత్యం ప్రజల్లో వుంటున్నాయి. రాజకీయంగాను, సామాజికంగాను వైసీపీ అభ్యర్థి తండ్రి కేపీ కొండారెడ్డికి నియోజకవర్గంలో మంచి పట్టే వుంది. ప్రతి ఒక్కరితో కలివిడిగా వుంటూ అందరి వాడిలా వుండే కొండారెడ్డి... గత ఎన్నికల్లో వైఎస్ఆర్ సిపి టిక్కెట్టు ఆశించినా... జంకె వెంకటరెడ్డికి టికెట్ దక్కడంతో ఆయనకు మద్దతు ఇచ్చి గెలిపించారు. దానివల్లే.. ఈసారి పట్టుబట్టి తన కుమారుడుకి టికెట్ దక్కించుకున్నారు. కొండారెడ్డి అండతోనే ఇక్కడ వైసీపీ గెలిచింది అని చెప్పవచ్చు. పికే టీం నిర్వహించిన సర్వే కూడా కొండారెడ్డికి అనుకూలంగా రావడంతో ఆయన కుటుంబానికి జగన్ టికెట్ కేటాయించారు. దీంతో ఇప్పుడు ఇరుపార్టీలు గెలుపుకోసం సర్వశక్తులు ఒడ్డుతున్నాయి.
ఐదేళ్లుగేళ్లు అభివృద్ధి మంత్రం జపించినా... పార్టీలోని అంతర్గత కలహాలు టీడీపీ అభ్యర్థికి మైనస్ గా మారాయి. ప్రాణాధారమైన వెలిగొండ ప్రాజెక్టును టీడీపీ నిర్లక్ష్యం చేసిందని ప్రజల్లో బలంగా ఉంది. వైసీపీకి రెడ్డి, ఎస్సీ సామాజికవర్గాలు వెన్నుదన్నుగా ఉన్నాయి. మార్కాపురం లో పలకల పరిశ్రమ సంక్షోభంలో కూరుకు పోవడం, కరువుతో నియోజకవర్గంలోని సుమారు 20 వేల మంది కూలీలు వలసలు వెళ్లిపోయారు. వీరి ఓట్లు చాలా కీలకం. మేస్త్రీల ద్వారా ఇప్పటికే వీరి ఓట్ల కొనుగోలుకు ప్రధాన పార్టీలు ప్రయత్నాలు మొదలు పెట్టాయి. ఇవి ఎవరికి పోలవుతాయి అనేది కీలకం. టీడీపీ ఎంపీ అభ్యర్థి, మంత్రి శిద్దా రాఘవరావు వైశ్య సామాజికవర్గం కావడం.. వారి ఓట్లు అభ్యర్థుల గెలుపును ప్రభవితం చేసే స్థాయిలో ఉండటంతో.. శిద్దా కుటుంబం కూడా మార్కాపురం వైశ్య సామాజికవర్గం నేతలతో సమావేశాలు ఏర్పాటు చేసి మద్దతు కోరారు. ఇది టీడీపీకి అనుకూలించే అవకాశం ఉంది.
మరోవైపు జనసేన బరిలో ఉండటం, ఆ పార్టీ అభ్యర్థి బలిజ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి కావడంతో.. టౌన్ లో అధికంగా ఉండే ఆ వర్గం ఓట్లలో చీలిక తప్పకపోవచ్చు. ఇది ఎవరికి మైనస్ గా మారుతుందో చెప్పలేని పరిస్థితి. ఏది ఏమైనా కరవు, ఫ్లోరైడ్, వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేయలేకపోవడం ప్రభుత్వానికి మైనస్ గా మారుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ టీడీపీ విజయం సాధించడం నల్లేరుపై నడక మాత్రం కాదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. వైసీపీలో కూడా అంతర్గతంగా జంకే వర్గం అసంతృప్తితో ఉంది. పార్టీకి పని చేస్తామని ప్రకటించినా... చివరి నిమిషంలో వారు ఫ్యానుకు ఝలక్ ఇస్తే మాత్రం టీడీపీకి కలసి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం నియోజకవర్గంలో రాజకీయాలు వైసీపీకి అనుకూలంగా ఉన్నా, ఫలితం కచ్చితంగా చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
(డి.లక్ష్మీనారాయణ, కరస్పాండెంట్, ప్రకాశం జిల్లా, న్యూస్18)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh Assembly Election 2019, Andhra Pradesh Lok Sabha Elections 2019, Lok Sabha Election 2019, Ongole S01p16, Prakasham dist