హోమ్ /వార్తలు /రాజకీయం /

అనంతలో అంత ఖర్చుపెట్టినా జేసీ ఫ్యామిలీ గెలవదా..?

అనంతలో అంత ఖర్చుపెట్టినా జేసీ ఫ్యామిలీ గెలవదా..?

జేసీ దివాకర్ రెడ్డి(ఫైల్ ఫోటో)

జేసీ దివాకర్ రెడ్డి(ఫైల్ ఫోటో)

ఓవైపు డబ్బు ప్రభావం , మరోవైపు సొంత పార్టీలోని ప్రత్యర్ధులు... జేసీ కుటుంబానికి ఈసారి చుక్కలు చూపించినట్లు స్పష్టంగా తెలుస్తోంది. అనంతలో జేసీ కుటుంబం ఓటమిపాలైతే మాత్రం భవిష్యత్తులో జిల్లా టీడీపీ రాజకీయాలు సైతం పూర్తిగా మారడం ఖాయమన్న వాదన కూడా వినిపిస్తోంది.

ఇంకా చదవండి ...

  ఏపీలో అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. ఎన్నికల్లో అన్ని పార్టీలు భారీగా డబ్బులు వెదజల్లాయని..ఒక్కో అభ్యర్థి రూ.25 కోట్ల వరకు ఖర్చు చేశారని ఆరోపించారు. ఈ క్రమంలో తనకే రూ.50కోట్లు ఖర్చు అయ్యాయని నోరు జారారు జేసీ దివాకర్. అనంతపురంలో నిరక్షరాస్యులు కూడా ఓటుకు రూ.5 వేలు అడిగారన్న ఆయన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. కానీ తాము 2 వేలు ఇవ్వడం వల్లే ఓడిపోతున్నట్లు జేసీ చెప్పకనే చెప్పారని అనంతలో ప్రచారం జరుగుతోంది.


  అనంతపురం జిల్లాలో డబుల్ హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా, ఎంపీగా వరుస విజయాలు సాధించిన చరిత్ర జేసీ దివాకర్ రెడ్డిది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని వీడి టీడీపీలో చేరినా ఆయన విజయపరంపర కొనసాగింది. అనంతపురం ఎంపీగా సరైన అభ్యర్ధి దొరక్కపోవడంతో తప్పనిసరి పరిస్ధితుల్లో పోటీ చేసి విజయం సాధించారు జేసి. ఇక ఆయన సొంత నియోజకవర్గం తాడిపత్రిలో పోటీ చేసిన సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డి గెలుపొందారు. ఈసారి కూడా తమ కంచుకోట తాడిపత్రితో పాటు అనంతపురం ఎంపీ సీటులోనూ సత్తాచాటాలని భావించారు. కానీ ఈ ఎన్నికల్లో జేసీ సోదరులకు వైసీపీ చుక్కలు చూపించిందని జిల్లాలో ఓటింగ్ సరళి చూసిస వారికి అర్ధమవుతోంది.


  అనంతపురంలో జేసీ హవాకు అడ్డుకట్ట వేసేందుకు విపక్ష వైసీపీ నాలుగేళ్లుగా చేయని ప్రయత్నం లేదు. జేసీ సోదరులతో ఢీ అంటే ఢీ అనే నేత కోసం ఎదురుచూసిన వైసీపీకి కేతిరెడ్డి పెద్దారెడ్డి రూపంలో బలమైన నాయకుడు దొరికాడు. పెద్దారెడ్డి రాకతో తాడిపత్రి రాజకీయాలు నువ్వా? నేనా? అన్నట్లుగా మారాయి. ఓ నిరక్ష్య రాస్యుడిని తీసుకొచ్చి తాడిపత్రిలో వైసీపీ ఇన్‌ఛార్జ్‌గా పెట్టారని జేసీ పలుమార్లు బహిరంగానే జగన‌పై నిప్పులు చెరిగారు. అయినా పెద్దారెడ్డి ఎక్కడా వెనక్కి తగ్గలేదు. అదే వ్యూహం జేసీ సోదరులకు ఝలక్ ఇచ్చేలా ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈసారి ఎన్నికల్లో జేసీతో పాటు ఆయన సోదరుడు కూడా పోటీ నుంచి విరమించుకుని వారి వారసులకు టికెట్లు ఇప్పించుకున్నారు. అనంతపురం ఎంపీగా జేసీ దివాకర్ రెడ్డి కొడుకు పవన్ కుమార్ రెడ్డిని, తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి కుమారుడు అస్మిత్ రెడ్డిని బరిలోకి దింపారు.


  ఈసారి ఎలాగైనా అనంత ఎంపీ, తాడిపత్రి అసెంబ్లీ స్ధానాలను గెలవాలని భావించిన వైసీపీ.. వ్యూహాత్మకంగా జేసీ అనుచరులను ఒక్కొక్కరిగా తమవైపు తిప్పుకుంది. దీంతో సహజంగానే బలహీనపడిన జేసీ కుటుంబం... పోలింగ్ సమయంలో ఓట్ల కొనుగోలుకు చేసిన ప్రయత్నాలు సైతం ఫలించలేదని తెలుస్తోంది. ఓటుకు రూ. 2 వేలు ఇచ్చేందుకు తాము సిద్ధపడ్డామని..కానీ నిరక్షరాస్యులు సైతం 5 వేలు అడిగారంటూ జేసీ దివాకర్ రెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. దీంతో అనంతపురంలో వైసీపీతో డబ్బు పంపకాల్లో పోటీ పడలేక తాము ఓడిపోతున్నట్లు జేసీ పరోక్షంగా అంగీకరించినట్లయింది.


  అనంతపురంలో జేసీ కుటుంబానికి వైసీపీ ఒక్కటే ప్రత్యర్ధి కాదు. సొంత పార్టీ టీడీపీలోనూ చాలామంది ప్రత్యర్ధులు ఉన్నారు. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి, రాప్తాడు ఎమ్మల్యే, మంత్రి పరిటాల సునీత, కాల్వ శ్రీనివాసులు.. ఇలా చెప్పుకుంటూ పోతే అనంతలో జేసీ కుటుంబం పతనం కోసం ఎదురు చూస్తున్న వాళ్ల జాబితా చాంతాడంత ఉంటుంది. వీరంతా అనంతపురం ఎంపీ సీటులో క్రాస్ ఓటింగ్‌ను ప్రోత్సహించినట్లు వార్తలు వస్తున్నాయి. అదే నిజమైతే ఓవైపు డబ్బు ప్రభావం , మరోవైపు సొంత పార్టీలోని ప్రత్యర్ధులు... జేసీ కుటుంబానికి ఈసారి చుక్కలు చూపించినట్లు స్పష్టంగా తెలుస్తోంది. అనంతలో జేసీ కుటుంబం ఓటమిపాలైతే మాత్రం భవిష్యత్తులో జిల్లా టీడీపీ రాజకీయాలు సైతం పూర్తిగా మారడం ఖాయమన్న వాదన కూడా వినిపిస్తోంది.


  (సయ్యద్ అహ్మద్, సీనియర్ కరెస్పాండెంట్, న్యూస్ 18)

  First published:

  Tags: Anantapur S01p19, Andhra Pradesh, Andhra Pradesh Assembly Election 2019, Andhra Pradesh Lok Sabha Elections 2019, JC Diwakar Reddy, Lok Sabha Election 2019, Tdp

  ఉత్తమ కథలు