ఎన్నికల వేళ ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రుల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఏపీ ప్రత్యేక హోదాకు తెలంగాణ మద్దతిస్తుందన్న కేసీఆర్ వ్యాఖ్యలకు చంద్రబాబు నాయుడు కౌంటర్ ఇచ్చారు. ఏపీ హోదా పోరాటానికి గతంలో ఎందుకు మద్దతివ్వలేదని ప్రశ్నించారు. అసలు ఆంధ్రాపై నీ పెత్తనమేంటి? పోటుగాడివా అంటూ తీవ్ర పదజాలంతో విమర్శించారు చంద్రబాబు. ఇదంతా మోదీ, కేసీఆర్, జగన్ ఆడుతున్న నాటకమని మండిపడ్డారు. కృష్ణా జిల్లా పెడనలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ టార్గెట్‌గా విరుచుకుపడ్డారు.
కేసీఆర్ ప్రత్యేక హోదాపై మాట్లాడినందుకు సంతోషం. హోదాపై అవిశ్వాసతీర్మానం ప్రవేశపెడితే ఎందుకు మద్దతివ్వలేదు. సోనియా ప్రత్యేక హోదా ఇస్తామంటే కేసీఆర్ వ్యతిరేకించారు. ఏపీకి హోదా ఇస్తామంటే తెలంగాణకు ఇవ్వాలని కేసీఆర్ అడగలేదా..? ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్రానికి కేసీఆర్ లేఖ రాయాలి. పోలవరంపై సుప్రీంకోర్టులో కేసీఆర్ రిట్ పిటిషన్ వేశారు. పోలవరంపై పెట్టిన కేసులన్నీ వెనక్కితీసుకోవాలి. కేసీఆర్ చెబితే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తారా? ఇదంతా మోదీ, కేసీఆర్, జగన్ ఆడే నాటకం.
— చంద్రబాబు నాయుడు, ఏపీ సీఎం
వైఎస్ జగన్‌కు రూ.వెయ్యి కోట్లు ఇచ్చి ఏపీకి ఎందుకు పంపించారు? ఏపీకి రావాల్సిన 58శాతం వాటా ఎందుకివ్వరు? కేసీఆర్ అంటే జగన్‌కు భయం. కేసులున్నాయని భయపడతారు. రేపల్లె, గన్నవరం అభ్యర్థులపై కేసులు పెడతావా? మా వాళ్ల ఊసెత్తితే హైదరాబాద్ బ్రాండ్ పడగొడతా. రాజధానికి నేను వేల ఎకరాలు సేకరించా? కేసీఆర్ 50 ఎకరాలైనా సేకరించారా? నా తెలివితేటలకు కేసీఆర్ సర్టిఫికెట్ అవసరం లేదు. వారం రోజులు కేసీఆర్‌ని ఉతికి ఆరేశా? కేసీఆర్ నువ్వు మమ్మల్ని శాసిస్తావా? ఏపీపై నీ పెత్తనమేంటి? నువ్వు పోటుగాడివా..? నీ భాషలోనే నిన్ను కట్టడి చేస్తా.
— చంద్రబాబు నాయుడు, ఏపీ సీఎం
మోదీ వ్యతిరేకులపైనే ఐటీ, సీబీఐ దాడులు జరుగుతున్నాయని మండిపడ్డారు చంద్రబాబు. జగన్, కేసీఆర్‌పై ఎందుకు దాడులు జరగడం లేదని విమర్శించారు. కేసీఆర్‌ది మోదీ ఫ్రంటా..ఫెడరల్ ఫ్రంటా తేల్చుకోవాలని ధ్వజమెత్తారు ఏపీ సీఎం. ఆ రాముడు తమ వాడేనని..భద్రాచలం తమకే ఇవ్వాలని మరోసారి డిమాండ్ చేశారు.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.