వైసీపీలోకి ఉండవల్లి... రావడమే లేటు...

AP Assembly Election Results 2019 : ఏపీలో ఇకపై మనం చూడబోయేది సరికొత్త రాజకీయం. అందులో భాగంగా... ఉండవల్లి వైసీపీలోకి వస్తారనే అంశం మరోసారి తెరపైకి వచ్చింది.

Krishna Kumar N | news18-telugu
Updated: May 24, 2019, 6:02 AM IST
వైసీపీలోకి ఉండవల్లి... రావడమే లేటు...
ఉండవల్లి అరుణ్ కుమార్ (File)
  • Share this:
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి ఆప్తుడిలా, మిత్రుడిలా కొనసాగిన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్... ఇటీవల మళ్లీ రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారని మనకు తెలుసు. తాను రాజకీయాల్లోనే ఉన్నానని ఈమధ్య ఆయనే స్వయంగా చెప్పారు కూడా. కొన్ని రోజులుగా ఆయన వైసీపీవైపు మొగ్గుచూపుతున్నారనీ, త్వరలోనే ఆయన్ని వైసీపీ అధినేత, కాబోయే ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి... ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించి కీలక పదవి (అసెంబ్లీ వ్యవహారాల శాఖ) ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. అందుకు తగ్గట్టుగానే... మొదటి నుంచీ జగన్‌ను సపోర్ట్ చేస్తున్న ఉండవల్లి... గత టీడీపీ ప్రభుత్వంపై అప్పుడప్పుడూ నిప్పులు చెరుగుతూనే ఉన్నారు. ముఖ్యంగా ఆ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చెప్పుకున్న పోలవరం నిర్మాణం చాలా నెమ్మదిగా సాగుతోందనీ, అలాగైతే మరో పదేళ్లైనా అది పూర్తికాదని కామెంట్స్ చేశారు. అంతేకాదు జగన్‌పై ఉన్న కేసులేవీ కోర్టుల్లో నిలబడవని కూడా స్వయంగా అన్నారు. ఇలా వైసీపీకి పాజిటివ్‌గా ఉన్న ఆయన తమతో ఉంటే ఆల్రెడీ కొండంత బలంతో ఉన్న వైసీపీకి... మరింత బలం చేరినట్లవుతుందని పార్టీ అధినాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈనెల 30న ప్రమాణ స్వీకారం చేస్తానన్న జగన్... ఆ తర్వాత కేబినెట్ కూర్పుపై దృష్టి సాధించి... ఆ క్రమంలో ఉండవల్లితో సంప్రదింపులు జరుపుతారని తెలుస్తోంది.

ఉండవల్లి మనసులో మాటేంటి? : మే 23న వచ్చిన ఫలితాల్ని బట్టీ... ప్రస్తుతం ఏపీలోనే కాదు... ఏకంగా దేశంలోనే అత్యంత శక్తిమంతమైన పార్టీల్లో ఒకటిగా వైసీపీ మారిందని చెప్పుకోవచ్చు. ఇలాంటి సమయంలో ఆ పార్టీలోకి ఎవరు వెళ్లినా కలిసొచ్చే అవకాశాలే ఎక్కువ. అందువల్ల ఉండవల్లి లాంటి సూటిగా, సుత్తిలేకుండా మాట్లాడే నేతలు... వైసీపీలో చేరితే అది వైసీపీకీ, ఆయనకు కూడా మేలు చేసే అంశమే. ఐతే... ఉండవల్లి వైసీపీలో చేరతారా లేదా అన్న అంశంపై క్లారిటీ లేదు. ఈ విషయంలో ఆయన వైపు నుంచీ మిశ్రమ స్పందన కనిపిస్తోంది.

ఈమధ్య వైఎస్ఆర్‌తో ఉండవల్లి అనే పుస్తకాన్ని రిలీజ్ చేస్తూ... ఉండవల్లి తన మనసులో మాటను బయటపెట్టారు. గత టీడీపీ ప్రభుత్వం ఎన్నో రాజకీయాలు చేస్తోందని విమర్శించిన ఆయన... వచ్చే ప్రభుత్వంలోని తప్పుల్ని కూడా ఎత్తి చూపుతానని అన్నారు. ప్రజల తరపున మాట్లాడే పబ్లిక్ స్పోక్స్‌మన్‌గా ఉంటానన్నారు. తద్వారా తాను వైసీపీలోకి వెళ్లనన్న సంకేతాలిచ్చారు. అదే సమయంలో... వైఎస్ తనను బాగా నమ్మారనీ, ఎమ్మెల్యే సీటూ, ఎంపీ సీటూ ఇచ్చారని చెప్పారు. ఇలా వైసీపీకి అనుకూలంగా, తటస్థంగా మాట్లాడుతూ... స్పష్టమైన వైఖరి చెప్పకుండా దాటవేస్తున్నారు ఉండవల్లి. ఐతే... జగన్ కోరితే మాత్రం ఆయన వైసీపీలోకి వెళ్లడం లాంఛనమే అని తెలుస్తోంది.

వైసీపీలోకి ఉండవల్లి వెళ్తే..? : స్వతహాగా లాయరైన ఉండవల్లి వైసీపీలోకి వెళ్తే... అది ఆ పార్టీకి ప్లస్ పాయింట్ అవుతుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎమ్మెల్సీగా అడుగుపెట్టి... కేబినెట్ బెర్త్ సాధించి, మరింత క్రియాశీలంగా మారొచ్చంటున్నారు. లేదంటే... ఎవరైనా ఎమ్మెల్యేతో రాజీనామా చేయించి... తిరిగి ఆ స్థానంలో ఉండవల్లి గెలిచి... అసెంబ్లీలో అడుగుపెట్టి... కీలక పాత్ర పోషించే అవకాశాలు ఉన్నాయంటున్నారు. దీనిపై వైసీపీ ఇప్పటికైతే ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.
Published by: Krishna Kumar N
First published: May 24, 2019, 6:02 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading