Home /News /politics /

AP ASSEMBLY ELECTION RESULTS 2019 YCP DEFECTED MLAS DEFEATED IN AP THIS TIME NK

ఆ 23కి ఈ 23తో చెక్ పెట్టారా... మే 23న వైసీపీ ఇరగదీసిందిగా...

చంద్రబాబు, జగన్ (File)

చంద్రబాబు, జగన్ (File)

AP Assembly Election Results 2019 : ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు 23 సంఖ్య దుమ్మురేపుతోంది. ఇందుకు ప్రత్యేక కారణాలున్నాయి మరి.

(సయ్యద్ అహ్మద్ - సీనియర్ కరెస్పాండెంట్, న్యూస్18 తెలుగు)
ఏపీలో ఈసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ‌అఖండ విజయాన్ని అందుకున్న వైసీపీకి మరో బోనస్ లభించింది. ఇదివరకు తమ పార్టీ గుర్తుపై గెలిచి టీడీపీలో చేరిపోయిన 23 మంది ఎమ్మెల్యేలు తాము పోటీ చేసిన నియోజకవర్గాల్లో దారుణ పరాజయాలు చవిచూశారు. వీరిపై గత మూడేళ్లుగా వైసీపీ అలుపెరగని పోరాటం చేసినా... స్పీకర్ కోడెల నుంచి సహకారం అందలేదు. అందువల్ల వారిపై ఎలాంటి చర్యలూ తీసుకోకుండానే అసెంబ్లీ కాలం గడిచిపోయింది. చివరికి వారిని ప్రజలే ఇంటికి పంపడంతో వైసీపీ పంతం నెగ్గినట్లయింది. ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం సృష్టించడంతో ఇదివరకు ఆ పార్టీ గుర్తుపై గెలిచి టీడీపీలోకి జంపై... తర్వాత ఎ‌న్నికల్లో పోటీ చేసిన 23 మంది ఎమ్మెల్యేల గెలుపోటములు ఆసక్తి రేపాయి. అయితే ప్రజలు వీరిని గంపగుత్తగా తిరస్కరించారు. అభివృద్ధి పేరుతో టీడీపీలోకి పిరాయించిన వారిలో నంద్యాల మాజీ ఎమ్మెల్యే దివంగత భూమా నాగిరెడ్డిని మినహాయిస్తే మిగతా వారంతా ఈసారి టీడీపీ తరఫున పోటీ చేసి దారుణ పరాజయాలు చూశారు. జలీల్ ఖాన్ తనకు బదులుగా వారసురాలిగా కూతురు షబానాను విజయవాడ వెస్ట్ నియోజకవర్గం నుంచి బరిలోకి దించారు. ఆమె కూడా ఓడిపోయారు.

వీరు కాకుండా పామర్రులో ఉప్పులేటి కల్పన, పలమనేరులో మంత్రి అమర్నాథరెడ్డి, ఆళ్లగడ్డలో మంత్రి భూమా అఖిలప్రియ, పాడేరులో గిడ్డి ఈశ్వరి, రంపచోడవరంలో వంతల రాజేశ్వరీ దేవి, బొబ్బిలిలో మంత్రి సుజయ కృష్ణ రంగారావు, కడప ఎంపీ స్ధానంలో మంత్రి ఆదినారాయణరెడ్డి, జగ్గంపేటలో జ్యోతుల నెహ్రూ ఓటమిపాలయ్యారు. వైసీపీని కాదని తమ పార్టీలోకి వచ్చిన కోడుమూరులో మణిగాంధీకి, బద్వేలులో జయరాములు, యర్రగొండపాలెంలో డేవిడ్ రాజుకు టీడీపీ ఈసారి టికెట్లు కూడా ఇవ్వలేదు. అరకులో పార్టీ పిరాయించి తర్వాత మావోయిస్టుల చేతిలో చనిపోయిన కిడారి సర్వేశ్వరరావు కొడుకు మాజీ మంత్రి శ్రవణ్‌కు సైతం మే 23న ఓటమి తప్పలేదు.

గత ఎన్నికల్లో వైసీపీ తరఫున గెలిచి తర్పాత పార్టీ పిరాయించి మరోసారి పోటీకి దిగిన ఎమ్మెల్యేలను చిత్తుగా ఓడించడం ద్వారా ఓటర్లు తమ ఉద్దేశాన్ని స్పష్టం చేసినట్లయింది. తమ తీర్పును అవహేళన చేస్తూ ఎడాపెడా పార్టీలు పిరాయించే వారికి భవిష్యత్తులో ఇలాంటి ఎదురుదెబ్బలు తప్పవని ఓటర్లు తమ తీర్పులో స్పష్టం చేశారు. అందుకే వైసీపీ అధినేత జగన్ పిరాయింపుల విషయంలో ముందునుంచీ స్పష్టమైన అభిప్రాయంతోనే ఉన్నారు. తమ పార్టీలోకి వచ్చే ఇతర పార్టీల నేతలను ఆయా పార్టీల ద్వారా సంక్రమించిన పదవులను వదులుకుని రావాలని ఆయన సూచిస్తున్నారు. ఇదివరకు నంద్యాల ఉపఎన్నికల సందర్భంగా టీడీపీలో ఎమ్మెల్సీగా ఉన్న శిల్పా చక్రపాణిరెడ్డి సైతం తన పదవికి రాజీనామా చేశాకే వైసీపీలోకి జగన్ ఆయన్ను ఆహ్వానించారు. భవిష్యత్తులో టీడీపీ నుంచి ఎమ్మెల్యేలను చేర్చుకోవాల్సిన పరిస్థితి వచ్చినా తన వైఖరి ఇదేనని జగన్ స్పష్టం చేస్తున్నారు. దీంతో రాబోయే రోజుల్లో వైసీపీలోకి పిరాయించాలనుకునే ప్రజా ప్రతినిధులంతా రాజీనామాలు చేయక తప్పని పరిస్థితి ఉంది.

ఇలా టీడీపీ హయాంలో 23 మంది తమ పార్టీ ఎమ్మెల్యేలను కోల్పోయిన జగన్... ఇప్పుడు టీడీపీకి 23 మంది ఎమ్మెల్యేలను మాత్రమే మిగిల్చారనీ... అదే సమయంలో మే 23న ఫలితాలు రావడంతో... ఈ 23 నంబర్ టీడీపీకి శాపంగా మారిందంటున్నారు నెటిజన్లు. పొలిటికల్ ఈక్వేషన్ అదిరిందిగా...

 

ఇవి కూడా చదవండి :

కే ఏ పాల్‌కి 281 ఓట్లు... డిపాజిట్ కూడా రాలేదే...

 

యువతిపై రేప్... ఇల్లు అద్దెకు కావాలని వచ్చి...

చంద్రబాబుకు కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్... కేసీఆర్‌కి మోదీ రిటర్న్ గిఫ్ట్...

ఏపీ ప్రత్యేక హోదా అటకెక్కినట్లేనా... వైసీపీ వ్యూహమేంటి..?
First published:

Tags: Andhra Pradesh Assembly Election 2019, Andhra Pradesh Lok Sabha Elections 2019, Chandrababu naidu, Tdp, Ycp, Ys jagan mohan reddy, Ysrcp

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు