AP Assembly Election Results 2019 : ఎన్నికల ఫలితాలు వచ్చేయడంతో... రిటర్న్ గిఫ్టుల వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. ఐతే... టీఆర్ఎస్కి బీజేపీ రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం చర్చనీయాంశం.
ఏదైనా పంతం పడితే... అది సాధించుకునేవరకూ వదిలిపెట్టని నైజం టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వద్దన్నా వినిపించుకోకుండా... కాంగ్రెస్‌తో జట్టుకట్టి, ప్రజాకూటమిగా బరిలో దిగిన చంద్రబాబుపై కోపం తెచ్చుకున్న కేసీఆర్... చంద్రబాబుకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తామన్నారు. దాంతో అది ఎలా ఉండబోతోంది, ఎలాంటి గిఫ్ట్ ఇస్తారు, ఏపీలో వైసీపీ తరపున కేసీఆర్ ప్రచారం చేస్తారా, లేక ఏపీలో టీఆర్ఎస్ పోటీ చేస్తుందా వంటి చాలా ప్రశ్నలు తలెత్తాయి. ఐతే... ఏపీలో టీఆర్ఎస్ పోటీ చేసినా, వైసీపీ తరపున ప్రచారం చేసినా, అది టీడీపీకి కలిసొస్తుందనే విశ్లేషణలు తెరపైకి రావడంతో కేసీఆర్ సైలెంటయ్యారు. ఐతే, రిటర్న్ గిఫ్ట్ ఇచ్చే విషయంలో మాత్రం మాట వెనక్కి తీసుకోలేదు. ఫలితంగా ఆ హామీ అలాగే ఉండిపోయింది.
ఎన్నికల ఫలితాలు వచ్చాక కేసీఆర్ హామీ నిలబెట్టుకున్నట్లైంది. చంద్రబాబుకి అలాంటిలాంటి గిఫ్టు ఇవ్వలేదనీ, జీవితంలో మర్చిపోలేని గిఫ్టు ఇచ్చారని చెప్పుకుంటున్నారు చాలా మంది. ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్పై మాటల దాడి చేసిన చంద్రబాబుకి... ఏకంగా ఏపీలో పార్టీ పునాదులే కదిలిపోయేంత బలమైన గిఫ్టు ఇచ్చారని సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి.
కేసీఆర్‌కి మోదీ గిఫ్ట్ : ఇది టీఆర్ఎస్ నేతలు ఊహించని గిఫ్ట్. కారు, సారు, పదహారు, ఢిల్లీలో సర్కారు అంటూ లోక్ సభ ఎన్నికల ప్రచారం చేసిన టీఆర్ఎస్... బీజేపీ తెలంగాణలో 4 లోక్ సభ స్థానాలు సాధించి... కారు జోరుకు బ్రేకులు వేస్తుందని అస్సలు ఊహించలేకపోయింది. ఫెడరల్ ఫ్రంట్ పేరుతో జాతీయ రాజకీయాల్లో చక్రాలు తిప్పి... బీజేపీకి చెక్ పెట్టాలనుకున్న కేసీఆర్‌కి ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన గిఫ్టు అంటున్నారు బీజేపీ నేతలు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత 4 నెలలుగా కేసీఆర్ ఏమీ చెయ్యట్లేదు కాబట్టే... ఆగ్రహించిన ప్రజలు... బీజేపీవైపు మొగ్గు చూపారనీ, కేసీఆర్ ఇలాగే పాలిస్తే... నెక్ట్స్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఇంకా పెద్ద గిప్టు ఇస్తుందని అంటున్నారు.
మొత్తానికి కేసీఆర్ ఇచ్చిన గిఫ్టుతో... చంద్రబాబు తీవ్ర నిరాశలో కూరుకుపోయారనే వార్తలు వినిపిస్తుంటే... తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ పుంజుకోవడంతో... మోదీ ఇచ్చిన గిఫ్టుకి కేసీఆర్ కూడా జరుగుతున్న రాజకీయ పరిణామాలపై పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.