సరిగ్గా ఎన్నికల ఫలితాలు వచ్చే మూడు రోజుల ముందు నుంచీ భద్రతా పరంగా తీసుకునే జాగ్రత్తలు బాగా పెరిగాయి. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి జెడ్ కేటగిరీ సెక్యూరిటీ అమలు చెయ్యాలని కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంది. ఫలితంగా హోంశాఖ ఆదేశాలతో జగన్‌కి ఏపీ పోలీస్ శాఖ జెడ్ కేటగిరీ భద్రత కల్పిస్తోంది. అలాగే ఆయన ఇంటి దగ్గర భద్రతను మరింత పెంచింది. తిరిగి సీఎంగానే హైదరాబాద్‌లో అడుగుపెట్టాలనుకుంటున్న జగన్... ప్రస్తుతం గుంటూరు జిల్లాలోని తాడేపల్లిలో ఉన్న ఇంట్లో ఉంటున్నారు. ఒక్కసారిగా ఆ ఇంటికి వైసీపీ నేతల రాకపోకలు పెరిగాయి. రెండ్రోజులుగా అక్కడ పూర్తి బిజీ వాతావరణం కనిపిస్తోందిం. అందువల్ల పోలీస్ శాఖ కూడా అప్రమత్తమై అక్కడికి వచ్చే వీఐపీలకు అదనపు భద్రత కల్పిస్తోంది. ఇంటి చుట్టూ ప్రత్యేక సెక్యూరిటీ వలయంగా సిబ్బందిని నియమించింది.
జగన్‌కి బుల్లెట్ ప్రూఫ్ వాహనంతోపాటూ... జెడ్ కేటగిరీ భద్రత కల్పించాలని ఈ నెల 21న కేంద్ర హోంశాఖ ఈ ఆదేశాలు జారీ చేసింది. వెంటనే అవి అమలయ్యాయి. ఐతే, వాటిపై ఎక్కడా ప్రచారం చెయ్యకుండా పోలీస్ శాఖ సైలెంట్‌గా ఉంది. వైఎస్ జగన్‌కి ప్రత్యర్థులు ఎక్కువే. అందువల్ల ఎందుకైనా మంచిదని ఈ జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
జెడ్ కేటగిరీలో భాగంగా... జగన్... హైదరాబాద్ నుంచీ గన్నవరం ఎయిర్ పోర్ట్‌కి వెళ్లినప్పుడు... అక్కడి నుంచీ తాడేపల్లి వెళ్లేందుకు ఆయనకు బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కేటాయించారు పోలీసులు. విజయవాడ నగర పోలీస్ కమిషనర్, గుంటూరు అర్బన్, గుంటూరు రూరల్ ఎస్పీలు కూడా జగన్‌కి భద్రతపై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. జగన్ సీఎం అవుతారు కాబట్టే ఆయనకు జెడ్ కేటగిరీ భద్రత కల్పిస్తున్నారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh Assembly Election 2019, Andhra Pradesh Lok Sabha Elections 2019, Ycp, Ys jagan mohan reddy, Ysrcp