చంద్రబాబు మైండ్ బ్లాంక్... ఫలితాలపై తీవ్ర ఆవేదన... డ్రామాలు చాలన్న వైసీపీ...

చంద్రబాబునాయుడు

AP Assembly Election Result 2019 : ఇన్నాళ్లూ భ్రమల్లో బతికిన చంద్రబాబుకి ఇప్పుడు మబ్బులు వీడుతున్నాయంటున్నారు వైసీపీ నేతలు. ఓటమిపై ఎన్ని సమీక్షలు జరుపుకున్నా, ఇప్పట్లో ఆ పార్టీ కోలుకోవడం కష్టమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

  • Share this:
నిధుల కొరత టీడీపీ కొంపముంచిందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. ఎంతో చక్కగా పరిపాలించామని భావిస్తే... ప్రజలు ఇచ్చిన తీర్పు పూర్తి భిన్నంగా ఉందన్న చంద్రబాబు... అంత ఘోరంగా పరిపాలించామా అని పార్టీ ఎమ్మెల్యేల సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు. ఫలితాలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయనీ, ఏమాత్రం నమ్మశక్యంగా లేవని చంద్రబాబు అన్నట్లు తెలిసింది. చాలా రాష్ట్రాల కంటే మెరుగైన పరిపాలన అందించామనీ, అందువల్ల ఈ ఫలితాలను అధ్యయనం చేయాలని చంద్రబాబు గెలిచిన ఎమ్మెల్యేలు, ఓడిన పార్టీ నేతలను కోరినట్లు తెలిసింది. మెజార్టీ మార్కు 88కి ఓ పది, పదిహేను సీట్లు మాత్రమే తగ్గుతాయని భావిస్తే, అసలేమాత్రం అంచనాలకు అందని ఫలితాలు రావడంపై చంద్రబాబు తీవ్ర ఆక్రోశం వెళ్లగక్కారని సమాచారం.

జనసేన వల్లేనా? : ఓటమిపై టీడీపీ సొంత లెక్కలు వేసుకుంటోంది. పార్టీలో అంతర్మథనం, అంతర్ విశ్లేషణలు అన్నీ జరుగుతున్నాయి. జనసేన విడిగా పోటీ చేసి ప్రభుత్వ వ్యతిరేక ఓటును వైసీపీకి చేరనివ్వకుండా చీల్చుతుందని భావిస్తే, అలా జరగలేదని కోస్తాకు చెందిన ఓ నేత చంద్రబాబుకు వివరించినట్లు తెలిసింది. టీడీపీ, జనసేన మధ్య లాలూచీ ఉందనీ, ప్లాన్ ప్రకారమే జనసేన విడిగా పోటీ చేసి, ఎన్నికల తర్వాత తిరిగి టీడీపీతో కలుస్తుందనే అసత్య ప్రచారాన్ని నిజమని జనం నమ్మారని ఆ నేత విశ్లేషించినట్లు సమాచారం. నిజానికి జనసేన వల్ల... టీడీపీ ఓట్లు కూడా చీలిపోయి... స్వల్ప మెజార్టీతో చాలాచోట్ల వైసీపీ సీట్లు సంపాదించిందని మరో నేత చెప్పినట్లు తెలిసింది. దాదాపు 30 సీట్లలో బీజేపీ-కేసీఆర్ సాయంతో వైసీపీ ఎమ్మెల్యేలు భారీగా ఖర్చుపెట్టి గెలిచారన్నది మరో టీడీపీ నేత విశ్లేషణ.

కొంపముంచిన జన్మభూమి కమిటీలు : జన్మభూమి కమిటీల పేరుతో కొందరు పెత్తనం చెలాయించారనీ, ఫలితంగా పార్టీ ప్రజలకు దూరమైందన్నది టీడీపీలో ఇంకో విశ్లేషణ. పథకాలు, రుణాలు, ఇతరత్రా ప్రభుత్వ సాయాలకు కమీషన్లు తీసుకోవడం వల్ల పార్టీ మునిగిపోయిందని మరో నేత కుండ బద్ధలు కొట్టారు. ప్రభుత్వంలో కొందరిపై ఉన్న వ్యతిరేకత, అందరిపైనా ప్రభావం చూపిందని రాయల సీమకు చెందిన ఓ సీనియర్ నేత చంద్రబాబుకి చెప్పినట్లు తెలిసింది.

ఎన్నికలకు ముందు తెలియలేదా : ఓటమిపై చంద్రబాబుకి ఇన్ని విషయాలు చెప్పిన నేతలు... ఎన్నికలకు ముందు వీటిపై ఎందుకు మాట్లాడలేదన్నది చంద్రబాబు ఆలోచించాల్సిన అంశం. ఓవైపు ఆయన తన పాలన బ్రహ్మాండం అనీ, ఫోన్లు చేసి ప్రజల్ని అడుగుతుంటే, అంతా సంతృప్తి వ్యక్తం చేశారని చెప్పుకున్నారు. మరి ఆ సంతృప్తి ఏమైంది. క్షేత్రస్థాయి వాస్తవాల్ని చంద్రబాబుకి తెలియనివ్వకుండా నేతలంతా నేల విడిచి సాము చేశారా అన్నది చంద్రబాబు విశ్లేషించాల్సిన అంశం. ఏది ఏమైనా టీడీపీకి ఇది ఇప్పట్లో కోలుకోలేని దెబ్బే. ఇదివరకు ప్రతిపక్షంగా వైసీపీ 67 సీట్లైనా గెలుచుకోగలిగింది. ఇప్పుడు టీడీపీకి అందులో సగం కూడా రాలేదు. తిరిగి పుంజుకొని, ప్రజల్లో వైసీపీపై వ్యతిరేకత పెంచి, టీడీపీపై అభిమానాన్ని కలిగించాలంటే కష్టసాధ్యమే. వైసీపీ గనక ఇచ్చిన హామీల్లో 80 శాతం పక్కాగా అమలు చెయ్యగలిగితే... ఇక లైఫ్‌లో టీడీపీ కోలుకోవడం కష్టమంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
First published: