మంగళగిరిలో లోకేష్‌ ఓటమి..హోరాహోరీ పోరులో ఆర్కే విజయం

నారా లోకేశ్(File)

Nara Lokesh lost in mangalagiri | చివరి నిమిషం వరకు సస్పెన్స్ కొనసాగించి అఖరికి మంగళగిరి నుంచి బరిలోకి దిగాలని నిర్ణయించుకున్న నారా లోకేశ్... గెలుపు కోసం విస్తృతంగా ప్రచారం చేశారు. అయినా ఆయనకు ఓటమి తప్పలేదు.

  • Share this:
    తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగిన ఏపీ మంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తనయుడు నారా లోకేశ్ ఓటమిని చవి చూశారు. ఆయనపై వైఎస్సార్సీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణ గెలుపొందారు. 5వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. చివరి నిమిషం వరకు సస్పెన్స్ కొనసాగించి అఖరికి మంగళగిరి నుంచి బరిలోకి దిగాలని నిర్ణయించుకున్న నారా లోకేశ్... గెలుపు కోసం విస్తృతంగా ప్రచారం చేశారు. అయితే మంగళగిరిలో వైసీపీ అభ్యర్థి అయిన సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా బలమైన ప్రత్యర్థి కావడంతో నారా లోకేశ్‌కు ఓటమి తప్పలేదు. మొదట్లో ఆళ్లకు గట్టి పోటీ ఇచ్చినట్టు కనిపించిన లోకేశ్... ఆ తరువాత ఆధిక్యం విషయంలో వెనుకబడుతూ వచ్చారు.

    ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ మళ్లీ గెలుస్తుందా లేదా అనే అంశంపై ఏ స్థాయిలో ఆసక్తి నెలకొందో... మంగళగిరిలో ఏపీ మంత్రి నారా లోకేశ్ గెలుస్తారా లేదా అనే అంశంపై కూడా అదే ఉత్కంఠ నెలకొంది. ఇరువురు అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం చేయడంతో పాటు టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగిన మంత్రి నారా లోకేశ్ గెలుపు కోసం భారీ ఎత్తున డబ్బు ఖర్చు చేశారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈ స్థానంలో గెలుపు ఎవరికి దక్కుతుందనే అంశంపై గత 40 రోజులుగా సస్పెన్స్ కొనసాగింది. ఏపీలో లోకేశ్ విజయావకాశాలపై కోట్ల రూపాయల్లో బెట్టింగ్ జరిగిందనే వార్తలు కూడా వినిపించాయి.

    గెలుపు కోసం చివరి వరకు తీవ్రంగా శ్రమించిన నారా లోకేశ్... ఎన్నికల రోజు నియోజకవర్గంలో వైసీపీ అక్రమాలకు పాల్పడుతోందని హంగామా సృష్టించారు. అయితే తన గెలుపు ఖాయమని ఆ తరువాత ఆయన ధీమా వ్యక్తం చేశారు. కానీ చివరకు ఈ స్థానంలో వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి విజయం సాధించారు. ఆర్కేను గెలిపిస్తే ఆయనను మంత్రిని చేస్తానని మంగళగిరి ఎన్నికల ప్రచార సభలో జగన్ హామీ ఇవ్వడంతో... ఇక ఆయన వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా ప్రమాణం చేయడం ఖాయమే అనే టాక్ వినిపిస్తోంది.
    First published: