AP ASSEMBLY ELECTION 2019 GROUND REPORT IN SATTENAPALLI OF GUNTUR DISTRICT AK
#GroundReport: సత్తెనపల్లిలో సత్తా చాటేదెవరు ? ఆ ఇద్దరికీ కీలకమే
ప్రతీకాత్మక చిత్రం
2014లో ఓడిన అంబటి రాంబాబుకు ఈ సారి గెలవక తప్పని పరిస్థితి, ఎంతో మందికి టికెట్లు ఇప్పించి ఇప్పుడు తన సీటులోనే తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న కోడెలకు సైతం గెలుపు రాజకీయంగా జీవన్మరణ సమస్యే.
గుంటూరు జిల్లా సత్తెనపల్లి అసెంబ్లీ నియోజకవర్గం రాజకీయపరంగా విలక్షణమైన నియోజకవర్గం అనే చెప్పాలి. దశాబ్దాల చరిత్రలో ఇక్కడి నుండి పోటీపడినవాళ్ళలో స్థానికేతరులే ఎక్కువమంది అని చెప్పుకోవాలి. అటువంటి సత్తెనపల్లి నియోజకవర్గంలో 2014ఎన్నికల్లో చావుతప్పి కన్నులొట్టబోయిన చందంగా గెలుపొందిన కోడెల శివప్రసాదరావు గెలుపొందారు. అనేక నాటకీయ పరిణామాల మధ్య ఈ సారి కూడా టీడీపీ తరపున టికెట్ సాధించి మళ్లీ పోటీకి సిద్ధమయ్యారు కోడెల. తన రాజకీయచతురతతో సత్తెనపల్లి టికెట్ ఖాయం చేసుకోవడమే కాకుండా అసమ్మతిని కూడా దారికి తెచ్చుకునే పనిలో ఉన్నారు.
కోడెల శివప్రసాద రావు (ఫేస్బుక్ ఫోటో)
ఇక 2014 ఎన్నికలలో కోడెల శివప్రసాదరావు చేతిలో ఓటమిపాలైన వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్ధి అంబటి రాంబాబు మరోసారి ఇక్కడి నుండి పోటీకి సిద్ధమయ్యారు. 2014 లో పోటీచేసిన అంబటి రాంబాబు అహంకార ధోరణితో అందరినీ కలుపుకోకపోవటంతో ఓటమిని చవిచూశారనే విమర్శలు ఉన్నాయి. ఇప్పటికీ కొన్ని మండలాల్లో ఆయనపై ఆ వ్యతిరేకత అలానే ఉందనే చెప్పాలి. ఇప్పటికైనా అందరినీ కలుపుకొని ముందుకు సాగకపోతే అంబటి అంత సులువుకాదనే వాదనలు ఉన్నాయి. మరోవైపు జనసేన అభ్యర్థి అటు అంబటికి ఇటు కోడెలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.
అంబటి రాంబాబు (File)
సత్తెనపల్లి జనసేన అభ్యర్ధిగా మాజీ శాసనసభ్యులు యర్రం వెంకటేశ్వరరెడ్డి రంగంలోకి దిగడంతో ప్రత్యర్ధుల గొంతులో పచ్చివెలగపండు పడినట్టయ్యింది. సౌమ్యుడు,అనుభవఙుడు, బలమైన సామాజకవర్గానికి చెందిన యర్రం వెంకటేశ్వరరెడ్డి జనసేన తరఫున అభ్యర్ధిగా రంగంలోకి దిగడంతో సత్తెనపల్లి నియోజకవర్గంలో పోటీ రసవత్తరంగా మారిందనే చెప్పాలి.తన అనుభవం అంతా ఉపయోగించి సరైన ప్రణాళికలతో ముందుకు సాగితే... ఆయన సత్తెనపల్లిలో జనసేన జెండా ఎగరేసినా ఆశ్చర్యపోనవసరం లేదనే వాదనలు వినిపిస్తోంది.
2014లో ఓడిన అంబటి రాంబాబుకు ఈ సారి గెలవక తప్పని పరిస్థితి, ఎంతో మందికి టికెట్లు ఇప్పించి ఇప్పుడు తన సీటులోనే తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న కోడెలకు సైతం గెలుపు రాజకీయంగా జీవన్మరణ సమస్యే. ఈ సారి గెలవకపోతే యర్రం వెంకటేశ్వరరెడ్డి రాజకీయ జీవితం ముగిసినట్టే అనే ప్రచారం జరుగుతోంది. అభ్యర్ధులందరికీ జీవన్మరణ సమస్యలాగా మారిన 2019 ఎన్నికల్లో సత్తెనపల్లి ప్రజలు ఎవరికి జై కొడతారో చూడాలి.
(రఘు అన్నా, న్యూస్18, గుంటూరు జిల్లా కరెస్పాండెంట్)
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.