news18-telugu
Updated: June 16, 2020, 4:37 PM IST
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో సీఎం జగన్
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను రెండ్రోజుల పాటు మాత్రమే నిర్వహించాలని బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఎక్కువ రోజులు నిర్వహించలేమన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఐతే వర్చువల్ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని టీడీపీ ఎమ్మెల్యే రామానాయుడు డిమాండ్ చేశారు. టీడీపీ డిమాండ్‌పై స్పందించి సీఎం జగన్.. 40 రోజులు కాదు, యాభై రోజులు అయినా అసెంబ్లీ నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఏడాది పరిపాలనలో జరిగిన సంక్షేమంపై అసెంబ్లీ వేదికగా ప్రజలకు చెప్పుకునేందుకు మంచి అవకాశమని.. 3.98 కోట్ల మందికి రూ.42వేల కోట్ల నగదును వివిధ పథకాల ద్వారా నేరుగా బదిలీ చేశామని చెప్పారు. తాము చేసిన సంక్షేమ కార్యక్రమాలు చెప్పుకోవాల్సిన అవసరం ఉందని.. కాకపోతే బయట పరిస్థితులు అందరికీ తెలుసని ఆయన అన్నారు.
కరోనా విజృంభిస్తున్న ఈ పరిస్థితుల్లో కూడా అసెంబ్లీ నడపాలని టీడీపీ కోరితే తమకు అభ్యంతరం లేదని సీఎం జగన్ తెలిపారు. ఎన్నిరోజులు నడపాలో టీడీపీ చెప్పాలని.. కాకపోతే వర్చువల్ అసెంబ్లీ మాత్రం సాధ్యంకాదని స్పష్టం చేశారు. దీనిపై పార్లమెంటే ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. మీరు ఎన్ని రోజులు కావాలంటే .. అన్ని రోజులు సమావేశాలు నిర్వహిస్తామన్న జగన్.. చెప్పండి ఎన్ని రోజులు పెడదామని ప్రతిపక్షాన్ని అడిగారు. సీఎం జగన్ స్పష్టీకరణతో టీడీపీ నేతలు మౌనం దాల్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సమావేశాలను 2 రోజులకు కుదిస్తూ బీఏసీలో నిర్ణయం తీసుకున్నారు.
Published by:
Shiva Kumar Addula
First published:
June 16, 2020, 4:34 PM IST