GroundReport : మంగళగిరిలో ఆర్కే Vs లోకేశ్.. ఇద్దరిలో గెలుపెవరిది?

నారా లోకేశ్, ఆళ్ల రామకృష్ణారెడ్డి(Images: Facebook)

Andhrapradesh Assembly Elections 2019 : ఐదేళ్లుగా సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆర్కేకు సామాజిక సమీకరణాలు పూర్తిగా కలిసి రాకపోయినా రాజధాని రైతుల తరఫున చేసిన పోరాటం, నియోజకవర్గంలో స్ధానికంగా ఉంటూ సమస్యలపై పనిచేస్తారన్న అంచనాలున్నాయి.

 • Share this:
  ఏపీ రాజధాని పరిధిలోని మంగళగిరి నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు తనయుడు లోకేష్‌కు, సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి మధ్య హోరాహోరీ పోరు తప్పేలా లేదు. ముఖ్యమంత్రి తనయుడు కావడం, గెలిపిస్తే అభివృద్ధి జరుగుతుందన్న అంచనాలు లోకేష్‌కు సానుకూలం అవుతుండగా.. ఐదేళ్లుగా నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండటం ఆర్కేకు ప్లస్ కానుంది.

  గుంటూరు జిల్లా మంగళగిరి అసెంబ్లీ స్ధానంలో ఈసారి జరుగుతున్న ఎన్నికలు టీడీపీ, వైసీపీ మధ్య ఆధిపత్య పోరుగా మారిపోయాయి. కోర్ క్యాపిటల్ పరిధిలో ఉన్న నాలుగు నియోజకవర్గాల్లో మంగళగిరి మినహాయించి మిగతా చోట్ల టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలే ఉన్నారు. వీరిలో పెదకూరపాడు నుంచి కొమ్మాలపాటి శ్రీధర్, సత్తెనపల్లి నుంచి స్పీకర్ కోడెల శివప్రసాద రావు, తాడికొండ నుంచి తెనాలి శ్రవణ్ కుమార్ మరోసారి టీడీపీ అభ్యర్ధులుగా రంగంలో ఉన్నారు. కేవలం మంగళగిరిలో మాత్రమే టీడీపీ తరుపున పోటీ చేసిన గంజి చిరంజీవి 12 ఓట్ల స్వల్ప తేడాతో ఓటమిపాలయ్యారు. దీంతో ఈసారి గంజి చిరంజీవికి బదులుగా రాష్ట్రమంత్రి, సీఎం చంద్రబాబు కుమారుడు లోకేష్‌ను టీడీపీ బరిలోకి దింపింది. ఆయన వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆళ్ల రామకృష్ణారెడ్డితో హోరాహోరీ తలపడుతున్నారు. ఈ నేపథ్యంలో న్యూస్ 18మంగళగిరి ఓటర్ల మనోగతాన్ని తెలుసుకునే ప్రయత్నం చేసింది.


  (ఎన్నికల ప్రచారంలో నారా లోకేశ్.. Image : Facebook)

  మంగళగిరిలో ఐదేళ్లుగా ప్రజలకు అందుబాటులో ఉండటం సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్కేకు కలిసి రానుంది. ప్రతిపక్షంలో ఉండటం వల్ల ఐదేళ్లుగా ప్రజలతో కలిసి రాజధాని భూసమీకరణకు వ్యతిరేకంగా చేసిన పోరాటంతో పాటు నియోజకవర్గంలో ప్రభుత్వం ఐదు రూపాయల భోజనం అందిస్తున్న అన్న క్యాంటీన్ల కంటే ముందుగానే స్ధానికంగా నాలుగు రూపాయలకే భోజనం అందించే రాజన్న క్యాంటీన్ ప్రారంభించడం ఆర్కేకు మరో సానుకూలాంశం. ప్రతిపక్షంలో ఉండటం వల్ల అనుకున్న స్ధాయిలో అభివృద్ధి చేయలేకపోయినట్లు ఆర్కే తన ప్రచారంలో సైతం అంగీకరిస్తున్నారు.

  ఐదేళ్లుగా ఆర్కే నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉన్నాడు. రాజధాని భూములతో పాటు పలు ప్రజా సమస్యలపై పోరాటాలు చేశాడు. నాలుగు రూపాయలకే భోజనం పెట్టే రాజన్న క్యాంటీన్ ను కూడా అందుబాటులోకి తెచ్చాడు. ఆయనకు మరోసారి అవకాశమిస్తే బావుంటుందని అనుకుంటున్నాం.
  హుస్సేన్, పండ్ల వ్యాపారి
  (ఎన్నికల ప్రచారంలో నారా లోకేశ్.. Image : Facebook)

  మరోవైపు రాష్ట్రమంత్రిగా ఉన్న సీఎం చంద్రబాబు తనయుడు లోకేష్ మంగళగిరి నియోజకవర్గానికి కొత్తే అయినా స్ధానికంగా టీడీపీకి ఉన్న బలమైన క్యాడర్ ఆయనకు కలిసి వస్తోంది. నియోజకవర్గంలో ఇప్పటికే ఆయన విస్తృతంగా ప్రచారం సాగిస్తున్నారు. ప్రజల్లో కూడా సీఎం కుమారుడిగా ఆయనకు సానుకూల స్పందనే వస్తోంది. టీడీపీలో స్ధానికంగా టికెట్లు లభించని వారు, వర్గపోరును అధిగమిస్తే లోకేష్‌కు మెరుగైన అవకాశాలు ఉంటాయనే చెప్పవచ్చు.

  లోకేష్ తొలిసారి ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. సీఎం కుమారుడు కావడం, ఆయనకు ఓటేస్తే మంగళగిరి రాజధానితో పాటు సమానంగా అభివృద్ధి చెందుతుందున్న అంచనాలు ఉన్నాయి. అందుకే ఓసారి ఆయనకు అవకాశమివ్వాలని అనుకుంటున్నాం. పోలింగ్‌కు ఇంకా సమయం ఉంది కాబట్టి అప్పటికల్లా నియోజకవర్గ అభివృద్ధిపై ఎలాంటి హామీలు ఇస్తారో చూడాల్సి ఉంది.
  సాయిబాబా, కూల్ డ్రింక్స్ అమ్మే వ్యక్
  తి


  ఐదేళ్లుగా సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆర్కేకు సామాజిక సమీకరణాలు పూర్తిగా కలిసి రాకపోయినా రాజధాని రైతుల తరఫున చేసిన పోరాటం, నియోజకవర్గంలో స్ధానికంగా ఉంటూ సమస్యలపై పనిచేస్తారన్న అంచనాలున్నాయి. వీటిని అభివృద్ధి అజెండాతో బ్రేక్ చేయడం పైనే లోకేష్ విజయావకాశాలు ఆధారపడి ఉంటాయని చెప్పవచ్చు. నియోజకవర్గంలో భారీగా ఉన్న చేనేతల ఓట్లు కూడా కీలకం కానున్నాయి.

  (సయ్యద్ అహ్మద్... న్యూస్18 ప్రతినిధి, విజయవాడ)
  First published: