#GroundReport : ఒంగోలు అసెంబ్లీ బరిలో హోరాహోరీ పోరు..

Andhrapradesh Assembly Election 2019 : ఒంగోలు నియోజకవర్గంలో 28వేల కాపుల ఓట్లు ఉన్నాయి. ఇప్పడు ఇవి వైసీపీ, టీడీపీలకు పెనుముప్పుగా మారాయి. ఒంగోలు మండలంలో మొదటి నుంచి టీడీపీదే ఆధిపత్యం. ఇప్పుడు ఆ మండలంలో టీడీపీకి మద్దతుగా కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలు.. గ్రూపు తగాదాలతో వైసీపీలో చేరారు. గత ఎన్నికల్లో వైసీపీకి మద్దతుగా ఉంటే కొత్తపట్నం మండలంలో టీడీపీ మెజార్టీ సాధించింది. ఇప్పుడు అక్కడ వైసీపీకి మద్దతు పెరిగింది. ఒంగోలు ఎంపీగా వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాగుంట శ్రీనివాసులు రెడ్డి వర్గం కూడా టీడీపీకి వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఇది కూడా టీడీపీకి మైనస్‌గా మారే అవకాశం ఉంది.

news18-telugu
Updated: March 30, 2019, 5:52 PM IST
#GroundReport : ఒంగోలు అసెంబ్లీ బరిలో హోరాహోరీ పోరు..
బాలినేని శ్రీనివాస్ రెడ్డి, దామచర్ల జనార్థన్ రావు
  • Share this:
ఒంగోలు గిత్తల్లా ఢీకొనే రాజకీయ నాయకులకు కేరాఫ్ అడ్రస్ ప్రకాశం. జిల్లాలో ఇప్పుడు ఒంగోలు అసెంబ్లీ స్థానంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక్కడి నుంచి వైసీపీ, టీడీపీ పార్టీల జిల్లా అధ్యక్షులు బరిలో ఉండటంతో.. విజయం కోసం రెండు పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. టీడీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి దామచర్ల ఆంజనేయులు మనవడు, సిట్టింగ్ ఎమ్మెల్యే దామచర్ల జనార్థన్ రావు... వైఎస్ కుటుంబ సభ్యుడు, మూడు సార్లు ఒంగోలు ఎమ్మెల్యేగా గెలిచి.. మంత్రిగా పనిచేసిన బాలినేని శ్రీనివాస్ రెడ్డితో ఢీ అంటే ఢీ అంటున్నారు.రెండు పార్టీల్లోని ద్వితియ శ్రేణి నాయుకులు జంపింగ్ జంపాంగ్ ఫీట్లు చేస్తూ.. ఓటర్లను తికమకపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు.

నియోజకవర్గంలోని గత ఫలితాల సరళని గమనిస్తే.. 1999 నుంచి 2009 వరకూ ఇక్కడ వరసగా 3 సార్లు బాలినేని విజయం సాధించి తన ఖిల్లాగా మార్చుకున్నారు. కానీ, రాష్ట్ర విభజన తర్వాత జనసేన మద్దతుతో బరిలో దిగిన దామచర్ల జనార్థన్ రావు 12, 428 ఓట్ల మెజార్టీతో విజయం సాధించి ఒకవిధంగా వైసీపీకి షాక్ ఇచ్చారు. అంతర్గత కుమ్ములాటలు ఉన్నా... టీడీపీ అభ్యర్థి ఇక్కడ జనసేన మద్దతు ఉండటంతో విజయం సాధించారు.



(ఎన్నికల ప్రచారంలో ఒంగోలు వైసీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాస రెడ్డి.. Image : Facebook)



2004లో 24,171 ఓట్ల మెజార్టీ, 2009లో పీఆర్పీ అభ్యర్థి బరిలో నిలిచి 33,716 ఓట్ల సాధించినా కూడా.. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా బాలినేని శ్రీనివాస్ రెడ్డి 22,986 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అయినప్పటికీ 2014 ఎన్నికల్లో జనసేన-టీడీపీ కలసి పోటీచేయడం, కాపు సామాజికవర్గం ఓట్లు ఏకపక్షంగా టీడీపీకి పోలవడంతో పాటు.. వైవీ సుబ్బారెడ్డి వర్గంతో ఉన్న వర్గవిభేదాలతో ఓటమి పాలయ్యారు.మొదటిసారి వైసీపీ తరఫున పోటీచేసిన వైవీ సుబ్బారెడ్డి ఎంపీగా విజయం సాధించి.. సుమారు ఇరవై వేల మెజార్టీతో గెలిచే బాలినేని ఓడిపోవడం చూస్తేనే భారీగా క్రాస్ ఓటింగ్ జరిగిందని అర్థమవుతుంది.

 

Loading...
(ఒంగోలు టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్థన్ రావు.. Image : Facebook)

టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్థన్ రావు బలాన్ని పరిశీలిస్తే.. రూ.2,500 కోట్లతో ఒంగోలు నియోజకవర్గంలో మౌలిక సదుపాయాలు, రోడ్లు, రహదారులు విస్తృతంగా నిర్మించడం... గుండ్లకమ్మ ప్రాజెక్టు నుంచి ఒంగోలు నగరానికి మంచినీటి పైప్ లైన్ నిర్మాణం, పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం, ఒంగోలులో ప్రకాశం పంతులు విశ్వవిద్యాలయం ఏర్పాటుచేయడంతో విద్యావంతుల్లో సానుకూల వాతవారణం ఏర్పడింది. కాపు సామాజికవర్గం ఓట్లు అధికంగా ఉన్న ఒంగోలులో మాజీ మున్సిపల్ ఛైర్మన్ మంత్రి శ్రీనివాస్ టీడీపీలో చేరడం ఆ పార్టీకి బూస్టింగ్ ఇచ్చిందని చెప్పవచ్చు.రాష్ట్ర విభజనకు ముందు తీవ్రనిర్లక్ష్యానికి గురైన ఒంగోలును సుందరనగరంగా తీర్చిదిద్దారని ప్రతిపక్షాల నేతలు అంతర్గతంగా ఒప్పుకుంటున్నారు. టీడీపీ తరఫున ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా వైశ్య సామాజిక వర్గానికి చెందిన మంత్రి శిద్ధా రాఘవరావు పోటీచేస్తుండంతో సుమారు 16,000 వేలు ఉన్న ఆ వర్గం ఓట్లు టీడీపీకి పోలయ్యే అవకాశం ఉంది. కానీ, ఇక్కడ జనసేన అభ్యర్థిని నిలపడం టీడీపీకి పెనుసవాలుగా మారింది.

ఒంగోలు నియోజకవర్గంలో 28వేల కాపుల ఓట్లు ఉన్నాయి. ఇప్పడు ఇవి వైసీపీ, టీడీపీలకు పెనుముప్పుగా మారాయి. ఒంగోలు మండలంలో మొదటి నుంచి టీడీపీదే ఆధిపత్యం. ఇప్పుడు ఆ మండలంలో టీడీపీకి మద్దతుగా కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలు.. గ్రూపు తగాదాలతో వైసీపీలో చేరారు. గత ఎన్నికల్లో వైసీపీకి మద్దతుగా ఉంటే కొత్తపట్నం మండలంలో టీడీపీ మెజార్టీ సాధించింది. ఇప్పుడు అక్కడ వైసీపీకి మద్దతు పెరిగింది. ఒంగోలు ఎంపీగా వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాగుంట శ్రీనివాసులు రెడ్డి వర్గం కూడా టీడీపీకి వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఇది కూడా టీడీపీకి మైనస్‌గా మారే అవకాశం ఉంది.

వైసీపీ అభ్యర్థి బలాన్ని పరిశీలిస్తే... వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటంబంతో బంధుత్వం. మూడుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా ఒంగోలులో ఉండటంతో.. నియోజకవర్గంలో విస్తృత స్థాయిలో సంబంధాలు ఉన్నాయి. ఎస్సీ సామాజికవర్గం ఓట్లు వైసీపీకి ఏకపక్షంగా పడే అవకాశం కనిపిస్తోంది. కాపు సామాజివర్గానికి చెందిన నేతలు కూడా ఆ పార్టీలో కీలకపాత్ర పోషిస్తున్నారు. వ్యక్తిగతంగా ఎంతోమందికి సహాయం చేశారనే పేరు ఆయనకు కలసివస్తోంది. కానీ, ఒంగోలు మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, బాలినేని మద్య ఎప్పటి నుంచో ఉన్న విభేదాలు... వైవీకి ఎంపీ టికెట్ రాకపోవడంతో తీవ్రమయ్యాయి. సుబ్బారెడ్డికి టికెట్ రాకపోవడానికి బాలినేని కారణమని ఆయన వర్గం తీవ్రఆగ్రహంతో ఉంది. ఎన్నికలు పూర్తయ్యే వరకూ జిల్లాలో అడుగుపెట్టను అని సుబ్బారెడ్డి ఇప్పటికే ప్రకటించారు. ఇది వైసీపీ ఎంపీ అభ్యర్థికి కూడా తలనొప్పి తెచ్చిపెట్టింది. మంత్రిగా ఉండి కూడా నియోజకవర్గంలో అభివృద్ధిని పట్టించుకోలేదు అనేది వైసీపీ అభ్యర్థిపై ప్రజల్లో బలంగా ఉన్న మైనస్ పాయింట్.

ఒంగోలు నియోజవర్గంలో 28,000 కాపుల ఓట్లు ఉన్నాయి. ఇక్కడ దశాబ్దాలుగా తమకు అభిమానిగా ఉన్న ముస్లిం అభ్యర్థి రియాజ్‌ని పవన్ కల్యాణ్ నిలబెట్టారు. అతనికి మద్దతుగా ప్రచారం చేసి.. టీడీపీ కంటే వైసీపీ పార్టీ పైనే ఎక్కువ విమర్శలు చేశారు. సహజంగానే కాపులు పవన్, చిరంజీవి అభిమానులు వారు జనసేన వైపు మరలితే టీడీపీ, వైసీపీలకు కష్టాలు తప్పవు. దీనికి తోడు కాంగ్రెస్ పార్టీ ఈద సుధాకర్ రెడ్డి అనే అభ్యర్థిని ఒంగోలు నుంచి బరిలో నిలిపింది. దీంతో వైసీపీకి మద్దతుగా ఉండే రెడ్డి సామాజికవర్గంలోనూ ఓట్ల చీలిక తప్పకపోవచ్చు. వైవీ వర్గం కాంగ్రెస్ అభ్యర్థికి ఓట్లు వేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని రాజకీయవిశ్లేషకులు అంటున్నారు.

ఒంగోలు నియోజకవర్గం బరిలో ఉన్న అభ్యర్థులు, వారి కుల సమీకరణలను గమనిస్తే.. జనసేన, కాంగ్రెస్ అంతర్గతంగా టీడీపీకి సహకరిస్తున్న పరిస్థితి కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి తోడు నివురుగప్పిన నిప్పులా రెండు పార్టీలలోనూ అసంతృప్తులు ఉన్నారు. వారు అభ్యర్థులకు సహకరిస్తారో లేక పార్టీలో ఉంటూ క్రాస్ ఓటింగ్ పాల్పడి ప్రత్యర్థి పార్టీకి మేలు చేస్తారో అనేది కూడా కీలకమైన అంశం. పోలింగ్ దగ్గరపడే కొద్దీ ఇరు పార్టీల్లోనూ అసంతృప్తి నేతలకు గాలం వేసేందుకు అభ్యర్థులు అంతర్గత ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవి కూడా టీడీపీ, వైసీపీ అభ్యర్థుల గెలుపు ఓటములను ప్రభావితం చేస్తాయి.

కచ్చితంగా ఒంగోలులో టీడీపీ, వైసీపీలలో ఎవరు గెలుస్తారు అంటే.. సంక్లిష్ట కుల రాజకీయలు నెలకొన్న నేపథ్యంలో హోరా హోరీ పోరు సాగుతుందని స్పష్టంగా కనిపిస్తోంది. కాపు సామాజికవర్గం ఓట్లు ఏ పార్టీకి పడతాయి, కమ్మ సామాజికవర్గం ఓట్లలో వైసీపీ చీలిక తీసుకువస్తుందా? బలమైన యాదవ, వైశ్య సామాజికవర్గం ఎవరికి మద్దతు పలుకుతుంది అనేది అభ్యర్థులు భవిష్యత్తును నిర్ణయిస్తుంది అని మాత్రం స్పష్టంగా చెప్పక తప్పదు.

డి. లక్ష్మీనారాయణ, న్యూస్ 18
కరస్పాండెంట్,
ప్రకాశం జిల్లా.

ఇది కూడా చదవండి : #Groundreport : ఒంగోలులో వైసీపీ పట్టు నిలుపుకుంటుందా...టీడీపీ పాగా వేస్తుందా...
First published: March 30, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...
Listen to the latest songs, only on JioSaavn.com