HOME »NEWS »POLITICS »andhra pradesh ys jagan mohan reddy meets home minister amit shah in delhi sk

YS Jagan-Amit shah: హోంమంత్రి అమిత్ షాతో సీఎం జగన్ భేటీ.. ఏం చర్చించారంటే..

YS Jagan-Amit shah: హోంమంత్రి అమిత్ షాతో సీఎం జగన్ భేటీ.. ఏం చర్చించారంటే..
అమిత్ షాతో జగన్ భేటీ

ఏపీలో ఆలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసంపై రాజకీయ దుమారం రేగుతోంది. దీనిపై ఇప్పటికే దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో ఏపీలో నెలకొన్న పరిస్థితులపై హోంమంత్రి అమిత్ షాకు జగన్ వివరించినట్లు తెలుస్తోంది.

  • Share this:
    ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి (YS Jaganmohan reddy) కేంద్ర హోమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు.  మంగళవారం రాత్రి  ఢిల్లీలోని ఆయన నివాసానికి వెళ్లి సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ఇరువురు చర్చించారు. సుమారు గంటన్నర పాటు చర్చలు జరపారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పోలవరం ప్రాజెక్టు అంశం, రాష్ట్ర పునర్విభజన చట్టంలోని అంశాలను సీఎం జగన్‌.. అమిత్‌ షా దృష్టికి తీసుకువచ్చారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని మరోసారి కోరారు సీఎం జగన్.  సమావేశం సమయంలో సీఎం జగన్‌ మోహన్ రెడ్డి వెంట ఎంపీలు విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, మిథున్‌రెడ్డి, అవినాష్‌రెడ్డి ఉ‍న్నారు.





    అమిత్ షాకు జగన్ చేసిన విజ్ఞప్తులు:

    రాజధాని కార్యకలాపాల వికేంద్రీకరణ,కర్నూలు హైకోర్టు ఏర్పాటుకు రీ నోటిఫికేషన్‌‌కు ఆమోదం తెలిపాలని సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు. ప్రాంతాల వారీగా అభివృద్ధిలో సమతుల్యతను సాధించడంలో భాగంగా అధికార వికేంద్రీకరణకు ఏపీ ప్రభుత్వం కట్టుబడి ఉంది. దీంట్లో భాగంగా రాజధాని కార్యకలాపాలను వికేంద్రీకరించాలని, విశాఖపట్నంలో కార్యనిర్వాహక రాజధానిని, అమరావతిలో శాసన రాజధానిని, కర్నూలులో న్యాయ రాజధానిని ఏర్పాటు చేయాలని ప్రణాళిక వేసింది.

    ఆగస్టులో దీనికి సంబంధించిన ఏపీ అన్ని ప్రాంతాల వికేంద్రీకరణ, సమగ్రాభివృద్ధి చట్టం–2020 చేసింది. కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు రీ నోటిఫికేషన్‌ జారీచేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు అంశాన్ని 2019 ఎన్నికల్లో బీజేపీ తన మేనిఫెస్టోలో పేర్కొంది.

    విజయనగరం జిల్లా సాలూరులో ట్రైబల్‌ యూనివర్శిటీ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం 250 ఎకరాలను గుర్తించింది. ఈ ప్రాంతం సబ్‌ప్లాన్‌ ఏరియాలో ఉంది. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని ట్రైబల్‌ యూనివర్శిటీ ఏర్పాటుకు తగిన చర్యలను సంబంధితశాఖ తీసుకునేలా చూడాలని కోరుతున్నాను.

    ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతున్నా. ఆర్థికంగా సవాళ్లు ఎదుర్కొంటున్న రాష్ట్రానికి ఇది చాలా అవసరం. ప్రత్యేక రాష్ట్రానికి ప్రత్యేక హోదా కారణంగా కేంద్రం నుంచి గ్రాంట్లు లభిస్తాయి. దీనివల్ల ఆర్థిక భారం క్రమంగా తగ్గుతుంది. కొత్త పరిశ్రమలు వస్తాయి, ఉద్యోగావకాశాలు లభిస్తాయి.

    2014–15 నాటికి రెవిన్యూ లోటు రూ. 22, 948.76 కోట్లు అని రాష్ట్ర ప్రభుత్వం నివేదించింది. కాని రూ. 4,117.89 కోట్లు మాత్రమే కేంద్రం గుర్తించింది. ఇందులోకూడా రూ. 3,979.5 కోట్లు మాత్రమే విడుదలచేసింది. ఇందులో మిగిలిన బకాయిలతోపాటు, రాష్ట్రం పేర్కొన్న విధంగా మిగిలిన రూ. 18830.87 కోట్లు విడుదలచేయాలని కోరుతున్నాను.

    కోవిడ్‌ వ్యాక్సినేషన్, మెడికల్‌ కాలేజీలకు అనుమతులు ఇవ్వండి. జనవరి 16 నుంచి 332 కేంద్రాల్లో వాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభమైందని సీఎం జగన్ వెల్లడించారు. వచ్చే 10 రోజుల్లో ఆరోగ్య సిబ్బంది అందరికీ వాక్సినేషన్‌ పూర్తిచేసేదిశగా రాష్ట్రం చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రంలో ప్రజారోగ్య రంగాన్ని పటిష్టం చేసేదిశగా చర్యలు తీసుకుంటున్నాం. నాణ్యమైన వైద్య సేవలకోసం వైద్యులు, నర్సుల సిబ్బంది సంఖ్యను పెంచాల్సి ఉంది. దీనికోసం కొత్తగా 13 మెడికల్‌ కాలేజీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. వీటితోపాటు ఇదివరకే ఉన్న మెడికల్‌ కాలేజీల్లో అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నాం. ఇప్పటికే మూడు కాలేజీలను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. మిగిలిన 13 కాలేజీలను, వాటికి అనుబంధంగా నర్సింగ్‌ కాలేజీలను మంజూరుచేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తిచేస్తున్నాం.

    ధాన్యం కొనుగోలు బకాయిలను చెల్లించాలని సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు. ఏపీ స్టేట్‌ సివిల్‌ సప్లైస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌కు చెల్లించాల్సిన రూ.4282 కోట్ల బకాయిలను కేంద్రం చెల్లించాల్సి ఉంది. ఈ బకాయిలను వెంటనే విడుదలచేయాలని కోరుతున్నా. రైతులకు కనీస మద్దతు ధరలను చెల్లింపునకు ఇది దోహదపడుతుంది. సహకార సంస్థలకు, మహిళా స్వయంసహాయక సంఘాలకు ధాన్య సేకరణ బకాయిలను చెల్లింపునకు అది సహాయపడుతుంది.

    లాక్‌డౌన్‌ తదనంతర పరిణామాల్లో భాగంగా చాలామంది తిరిగి గ్రామీణ ప్రాంతాలకు వచ్చారు. ఈ నేపథ్యంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థను తిరిగి బలోపేతం చేయాల్సి ఉంది. ఉపాధిహామీ కింద ప్రస్తుతం ఉన్న పనిదినాలు 100 రోజుల నుంచి 150 రోజులకు పెంచాలి. అలాగే అంగన్‌వాడీ భవన నిర్మాణానికి సంబంధించి ప్రాజెక్టు వ్యయాన్ని రూ.5 లక్షలనుంచి రూ.15లక్షలకు పెంచాలని విజ్ఞప్తిచేస్తున్నాను. ఉపాథి హామీ కార్యక్రమాలకోసం పెండింగులో ఉన్న రూ.3,707.77 కోట్ల రూపాయలను విడుదలచేయాలని కోరుతున్నా.

    14వ ఆర్థిక సంఘం నిర్దేశించిన మేరకు స్థానిక సంస్థలకు విడుదలచేయాల్సిన రూ. 529.95 కోట్ల రూపాయలను విడుదల చేయాలి.
    అలాగే 15 వ ఆర్థిక సంఘం నిర్దేశించిన మేరకు రెండో విడత కింద రూరల్‌ లోకల్‌ బాడీస్‌కు విడుదల చేయాల్సిన రూ.1,312.5 కోట్లను వెంటనే విడుదలచేయాలని కోరుతున్నా. కోవిడ్‌ నివారణా చర్యలను గ్రామీణ ప్రాంతాల్లో విస్తృతంగా చేపట్టడానికి ఈ నిధులు ఎంతో అవసరం అవుతాయి.

    నివర్‌ తుపాను బాధిత ప్రాంతాల్లో చర్యలకు సహాయం చేయండి. జాతీయ విపత్తు నిధికింద నివర్‌ సైక్లోన్‌ బాధిత ప్రాంతాల్లో చర్యలకు ఆర్థిక సహాయం చేయాలని కోరుతున్నాను. గత ఏడాది ఆగస్టు నుంచి నవంబర్‌ వరకూ భారీగా వర్షాలు కురిసాయి. నవంబర్‌ నెలలో నివర్‌ సైక్లోన్‌ వచ్చింది. కేంద్ర బృందం కూడా క్షేత్రస్థాయిలో పరిశీలన చేసింది. ఎన్టీఆర్‌ఎఫ్‌ నిబంధనల ప్రకారం బాధిత ప్రాంతాల్లో ఇన్‌పుట్‌ సబ్సిడీ మరియు తాత్కాలిక పునరుద్ధరణ పనులకోసం రూ.2,255.7 కోట్లను విడుదలచేయాలని ఇదివరకే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. ఈ మొత్తాన్ని వెంటనే విడుదలచేయాలని కోరుతున్నాను.

    ఏపీ విద్యుత్‌రంగం పునరుత్తేజానికి తగిన సహాయం అందించండి. డిస్కంల ఆర్థిక పరిస్థితి బాగోలేదు. విద్యుత్‌ రంగంలో తీసుకుంటున్న విప్లవాత్మక మార్పులు, సంస్కరణలకు కేంద్ర ప్రభుత్వం తగిన విధంగా సహాయ సహకారాలు అందించాలి. కుడిగి, వల్లూరు థర్మల్‌ విద్యుత్‌ ప్లాంట్లతో డిస్కంలు 2040 వరకూ ఒప్పందాలు చేసుకున్నాయి.ఇతర విద్యుత్‌ ప్లాంట్లతో పోలిస్తే... ఈ ప్లాంట్ల రేట్లు చాలా అధికంగా ఉన్నాయి.
    డిస్కంల ఆర్థిక పరిస్థితులకు తోడు, కోవిడ్‌ పర్యవసానాలుకూడా తోడయ్యాయి. ఈనేపథ్యంలో ఇంత రేట్లు చెల్లించే స్థితిలో ఏపీ డిస్కంలు లేవు. ఈ రెండు ప్లాంట్ల నుంచి విద్యుత్‌ను సరెండర్‌ చేయడానికి అంగీకరించాలని కోరుతున్నాను. దీనివల్ల ప్రతి ఏటా రూ. 325 కోట్ల ఫిక్స్‌డ్‌ ఛార్జీలు చెల్లింపులు భారం డిస్కంలకు తప్పుతుంది.

    రాష్ట్ర విభజన తర్వాత రూ. 5,541.78 కోట్లను విద్యుత్‌ కొనుగోలు రూపంలో ఏపీ జెన్‌కోకు తెలంగాణ డిస్కంలు చెల్లించాల్సి ఉంది.
    ఆత్మనిర్భర్‌ కార్యక్రమంలో భాగంగా షరతులతోకూడిన రుణాలను తెలంగాణ డిస్కంలకు ఇవ్వడం ద్వారా ఏపీ జెన్‌కోకు ఆ చెల్లింపులు జరిగేలా చూడాలని కోరుతున్నాను. అప్పర్‌ సీలేరులో చేపడుతున్న 1350 మెగావాట్ల రివర్స్‌ పంప్డ్‌ స్టోరేజీ విద్యుత్‌ ప్రాజెక్టుకు సుమారు రూ.8,000 కోట్లు ఖర్చు అవుతుందని, దీనికి కేంద్రం ఆర్థిక సహాయం అందించాలని కోరుతున్నా. అలాగే అటవీ, పర్యావరణ అనుమతులు త్వరగా మంజూరు చేయాలని విజ్ఞప్తిచేస్తున్నా.

    దిశ బిల్లు, ఏపీ ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టానికి అనుమతి ఇవ్వండి. దిశ బిల్లుకు, ప్రత్యేక కోర్టుల ఏర్పాటు బిల్లుకు ఆమోదం తెలిపేలా తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తిచేస్తున్నా. అలాగే ఏపీ ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టానికి రాష్ట్రపతి ఆమోదం పొందేలా తగిన చర్యలు తీసుకోవాలని కూడా కోరుతున్నాను:

    రాయలసీమ ఎత్తిపోతల పథకానికి అనుమతుల ఇవ్వాలని అమిత్ షాను జగన్ కోరారు. రాయలసీమలోని నాలుగు జిల్లాలు దుర్భిక్ష ప్రాంతాలు. వర్షాలు, కృష్ణా నీల్లే వీటికి ఆధారం. వర్షాలు తగ్గినప్పుడు, కృష్ణాలో నీళ్లు లేనప్పుడు తాగునీరు, సాగునీరుకు తీవ్ర కొరత ఏర్పడి ప్రజలు వలసల దారిపడుతున్నారు. దీనికోసం రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. దీనివల్ల ఆయకట్టు పెరగడం కానీ, కేటాయించిన దానికన్నా ఎక్కువ నీటిని వాడుకోవడం జరగదు. వణ్యప్రాణి అభయారణ్యాలకు భంగంకాని, ఇతర పర్యావరణ ఇబ్బందులు కాని తలెత్తవు. రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టుకు ఎలాంటి పర్యావరణ అనుమతులు అవసరం లేదన్న విషయాన్ని చెన్నై ఎన్జీటీ ఏర్పాటు చేసిన కమిటీ సిఫార్సు చేసిన విషయాన్ని మీకు నివేదిస్తున్నాను. ప్రాజెక్టును ప్రారంభించడానికి అవసరమైన అనుమతులు ఇవ్వాల్సిందిగా సంబంధిత శాఖను ఆదేశించాలని కోరుతున్నా.

    ఇక ఏపీలో ఆలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసంపై రాజకీయ దుమారం రేగుతోంది. దీనిపై ఇప్పటికే దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో ఏపీలో నెలకొన్న పరిస్థితులపై హోంమంత్రి అమిత్ షాకు జగన్ వివరించినట్లు తెలుస్తోంది. విగ్రహాల ధ్వంసం వెనక రాజకీయ కుట్ర ఉందని నివేదిక ఇచ్చినట్లు సమాచారం.
    Published by:Shiva Kumar Addula
    First published:January 19, 2021, 22:55 IST

    टॉप स्टोरीज