Kala Venkat Rao: ఏపీ టీడీపీ మాజీ అధ్యక్షుడు కళా వెంకట్రావు అరెస్టు

కళా వెంకట్రావు(ఫైల్ ఫోటో)

ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి కళా వెంకట్రావును పోలీసులు అరెస్టు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఎంపీ వి.విజయసాయిరెడ్డి కాన్వాయ్ మీద చెప్పులు విసిరిన కేసులో కళా వెంకట్రావును అరెస్టు చేశారు.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి కళా వెంకట్రావును పోలీసులు అరెస్టు చేశారు. రామతీర్థంలో విగ్రహాల ధ్వంసం ఘటన సమయంలో ఆలయ పర్యటనకు వచ్చిన అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఎంపీ వి.విజయసాయిరెడ్డి కాన్వాయ్ మీద చెప్పులు విసిరిన కేసులో కళా వెంకట్రావును అరెస్టు చేశారు. శ్రీకాకుళం జిల్లా రాజాంలో కళా వెంకట్రావును పట్టుకున్నారు. రాజాంలోని ఆయన క్యాంప్ ఆఫీసు వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి చీపురుపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. విజయనగరం జిల్లాలోని రామతీర్థంలో రామతీర్థం ఆలయంలో విగ్రహాలను ధ్వంసం ఘటనకు సంబంధించి అన్ని పార్టీలు ఒకేసారి పర్యటన చేపట్టాయి. అధికార వైసీపీ నుంచి విజయసాయిరెడ్డి, ప్రతిపక్షం నుంచి చంద్రబాబు కూడా ఒకే రోజు వెళ్లారు. అక్కడ రెండు పార్టీల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ముందు చంద్రబాబు తన పర్యటనను ఖరారు చేస్తే దాన్ని రాజకీయం చేసేందుకు విజయసాయిరెడ్డి వచ్చారంటూ టీడీపీ నేతలు ఆరోపించారు. ఈక్రమంలో విజయసాయిరెడ్డి వాహనంపై దాడి జరిగింది. విజయసాయి రెడ్డి కొండదిగి వచ్చిన తర్వాత ఆయన వాహనంలోకి వెళ్లకుండా టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈక్రమంలో వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య స్వల్ప తోపులాట జరిగింది. ఇదే సమయంలో టీడీపీ కార్యకర్తలు విజయసాయి రెడ్డి వాహనంపై రాళ్లు, చెప్పులతో కూడా దాడికి పాల్పడ్డారు.

    మరోవైపు రామతీర్థం ఘటనలో దారుణానికి ఒడిగట్టిన వారిని పట్టుకోలేని చేతగాని ప్రభుత్వం అత్యంత సౌమ్యుడైన టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కళా వెంకట్రావును అరెస్టు చేశారంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు.



    వైసీపీ ప్రభుత్వం కావాలనే తెలుగుదేశం పార్టీ బీసీ నేతలను టార్గెట్ చేస్తోందని, కావాలని కేసులు పెడుతోందంటూ నారా లోకేష్ మండిపడ్డారు.



    తీవ్రంగా మండిపడిన చంద్రబాబు
    టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి కళా వెంకట్రావును అరెస్ట్ చేయడంపై తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. వివాద రహితుడు, సౌమ్యుడు, అజాతశత్రువు కళా వెంకట్రావుపై తప్పుడు కేసులు పెట్టి అక్రమ నిర్బంధం ఆటవిక చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాత్రి 9 గంటలకు 65ఏళ్లు పైబడిన నాయకుడిని అరెస్ట్ చేయడం రాక్షస చర్య అని నిప్పులు చెరిగారు. ‘ఏ నేరం చేశారని మాజీ మంత్రి కళా వెంకట్రావును అరెస్ట్ చేశారు? రామతీర్థంలో రాముడి విగ్రహం ధ్వంసం చేస్తే, చూడటానికి వెళ్లడమే నేరమా..? దేవాలయాలపై దాడులు, దేవుళ్ల విగ్రహాల విధ్వంసాన్ని ఖండించడం ఆయన చేసిన తప్పా?. కళా వెంకట్రావు అరెస్ట్, వైసీపీ కక్ష సాధింపునకు పరాకాష్ట. జగన్ రెడ్డి ఉన్మాదం పరాకాష్టకు చేరింది. పోగాలం దాపురించింది కాబట్టే ఇలాంటి సైకో చేష్టలకు, కిరాతక చర్యలకు జగన్ రెడ్డి పాల్పడుతున్నారు.’ అని చంద్రబాబు మండిపడ్డారు.

    మరోవైపు టీడీపీలో బీసీ నేతలను టార్గెట్ చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. ‘మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేసి 83రోజులు జైల్లో పెట్టారు. మరో మాజీ మంత్రి కొల్లు రవీంద్రను అరెస్ట్ చేసి 54రోజులు జైల్లో పెట్టారు. యనమల రామకృష్ణుడిపై తప్పుడు కేసు పెట్టారు. అయ్యన్నపాత్రుడిపై తప్పుడు కేసు పెట్టారు. రాష్ట్రంలో బీసీ నాయకత్వాన్ని లేకుండా చేయాలనే కుట్రలు చేస్తున్నారు.’ అని చంద్రబాబు ఆరోపించారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published: