ANDHRA PRADESH STATE ELECTION COMMISSIONER NIMMAGADDA RAMESH KUMAR CONDUCTED VIDEO CONFERENCE WITH HIGHER OFFICIALS ON PANCHAYAT ELECTIONS PRN
AP Panchayat Elections: ప్రభుత్వ జీవోతో అలర్ట్ అయిన నిమ్మగడ్డ.., అధికారులకు స్పష్టమైన టార్గెట్... వాలంటీర్లకు షాక్
ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ (ఫైల్)
Panchayat Elections: గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ (Biswabhushan Harichandan) తో సమావేశమై ఎన్నికల ప్రక్రియ గురించి వివరించిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ (Nimmagadda Ramesh Kumar).., రాజ్ భవన్ నుంచి నేరుగా తన కార్యాలయానికి వెళ్లి.., ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికల హడావిడి జోరుగా సాగుతోంది. నాటకీయ పరిణామాల మధ్య సుప్రీం కోర్టు ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తన పని మొదలుపెట్టారు. ఈ క్రమంలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో సమావేశమై ఎన్నికల ప్రక్రియ గురించి వివరించిన నిమ్మగడ్డ రమేష్ కుమార్.., రాజ్ భవన్ నుంచి నేరుగా తన కార్యాలయానికి వెళ్లి.., ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశానికి సీఎస్ ఆదిత్యానాథ్ దాస్, డీజీపీ గౌతమ్ సవాంగ్ తో పాటు పంచాయతీ రాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేదీ, కమీషనర్ గిరిజా శంకర్ కూడా హాజరైనట్లు తెలుస్తోంది. వీరిపై ఎస్ఈసీ చర్యలు తీసుకున్నా.., ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాకపోవడంతో సమావేశానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఆయా శాఖల ఉన్నతాధికారుతో పాటు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులు ఎస్ఈసీ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కీలక ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పంచాయతీల్లో బలవంతపు ఏకగ్రీవాలపై దృష్టి పెట్టాలన్నారు. అభ్యర్థులపై బెదిరింపులు, దాడులను అడ్డుకోవడం పాటు వారికి రక్షణ కల్పించాలని పోలీసులకు ఆదేశించారు. గతేడాది మార్చిలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల సమయంలో చిత్తూరు, పల్నాడు ప్రాంతాల్లో చోటు చేసుకున్న ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని స్పష్టం చేశారు. ప్రజలు స్వచ్ఛందంగా ఏకగ్రీవాలను కోరుకుంటే స్వాగతించాలన్న నిమ్మగడ్డ.., తమ మొదటి ప్రాధాన్యత ఎన్నికలేనని స్పష్టం చేశారు. ఏకగ్రీవాలకు ప్రభుత్వం భారీ ప్రోత్సాహకాలు ప్రకటించిన నేపథ్యంలో ఎస్ఈసీ ఆదేశాలు జారీ చేయడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది.
వాలంటీర్లకు షాక్..
ఇక ఎన్నికల కోడ్ అమలులో ఉన్నంత కాలం గ్రామ వాలంటీర్లను విధులకు దూరంగా ఉంచాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశించినట్లు తెలుస్తోంది. వారి వద్ద ఉన్న ఫోన్లు, ఐడీ కార్డులు స్వాధీనం చేసుకోవాలని.., వారు ఎలాంటి ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా చూడాలని స్పష్టం చేశారు. అలాగే గ్రామసచివాలయాలకు కూడా సీఎస్ కీలక ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.
రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్, ఎన్నికల ప్రక్రియ ఒకే సమయంలో నిర్వహించడంపైనా సమావేశంలో ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే కేంద్రానికి లేఖ రాసినట్లు సీఎస్ ఆదిత్యానాథ్ దాస్.., ఎస్ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. అలాగే ఉద్యోగుల అభ్యంతారలను పరిగణలోకి తీసుకోవాలని కోరారు. ఇక 50ఏళ్లు దాటిన వారికి, అనారోగ్య సమస్యలున్నవారికి ఎన్నికల విధుల నుంచి మినహాయింపునివ్వాలని కోరారు. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన డీజీపీ గౌతమ్ సవాంగ్.. సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతా సిబ్బంది కేటాయింపుపై చర్చించినట్లు తెలిపారు. కోడ్ ఉల్లంఘనలు, ఫిర్యాదులు రాకుండా చూడాలని ఎస్ఈసీ సూచించినట్లు చెప్పారు. వ్యాక్సినేషన్ ప్రక్రియకు ఇబ్బంది రాకుండా ముందుకెళ్లాలని చెప్పినట్లు డీజీపీ వెల్లడించారు.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.