'రాజధాని తరలింపు'పై హైకోర్టుకెక్కిన సచివాలయ ఉద్యోగులు

అమరావతిలో రాజధానికి సంబంధించి 70 శాతం పనులు పూర్తయ్యాయని చెప్పడం పూర్తిగా అవాస్తవమని పిటిషన్‌లో పేర్కొన్నారు. అమరావతి పరిరక్షణ సమితి పేరుతో కొందరి రాజకీయ, రియల్ ఎస్టేట్ ప్రయోజనాలను కాపాడటం కోసమే ఈ పిటిషన్ వేశారు తప్ప.. ఇందులో ఇలాంటి ప్రజా ప్రయోజనాలు లేవని స్పష్టం చేశారు.

news18-telugu
Updated: July 28, 2020, 7:21 PM IST
'రాజధాని తరలింపు'పై హైకోర్టుకెక్కిన సచివాలయ ఉద్యోగులు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఏపీలో 3 రాజధానులపై ఇప్పటికే రచ్చ జరుగుతోంది. సీఆర్డీఏ రద్దు, రాజధాని వికేంద్రీకరణ బిల్లులు గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించారు. రాజధాని తరలింపు కేసులో ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం తరపున ఆ సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి ఇంప్లీడ్ పిటిషన్ వేశారు. రాజధాని తరలింపు ప్రక్రియను ఏ ఉద్యోగ సంఘం కూడా వ్యతిరేకించలేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. అంతేకాదు రాజధాని తరలింపుపై అమరావతి పరిరక్షణ సమితి వేసిన పిటిషన్‌ను ఆయన తీవ్రంగా తప్పుపట్టారు.

రాజధాని తరలింపు కేసులో పిటిషనర్ అయిన రాజధాని పరిరక్షణ సమితి తమపై హైకోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చిందని అన్నారు. రాజధాని తరలింపు కోసం ఉద్యోగులకు ఇంటి రుణ సౌకర్యం, మెడికల్ సబ్సీడి వంటి నజరానాలు ఇస్తుందని తాను మీటింగ్‌లో చెప్పినట్లుగా పిటిషనర్ హై కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చారని పేర్కొన్నారు. రాజధాని అనేది భూములు ఇచ్చిన రైతుల సొంత వ్యవహారం కాదని.. అది రాష్ట్ర ప్రజలందరి హక్కు అని స్పష్టం చేశారు వెంకట్రామిరెడ్డి.

టీడీపీ హయంలో 114 సార్లు భూ కేటాయింపులు జరిగితే స్పందించని అమరావతి పరిరక్షణ సమితి.. ఇప్పుడు పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే ఎందుకు అడ్డు పడుతుందని ప్రశ్నించారు. అమరావతిలో రాజధానికి సంబంధించి 70 శాతం పనులు పూర్తయ్యాయని చెప్పడం పూర్తిగా అవాస్తవమని పిటిషన్‌లో పేర్కొన్నారు. అమరావతి పరిరక్షణ సమితి పేరుతో కొందరి రాజకీయ, రియల్ ఎస్టేట్ ప్రయోజనాలను కాపాడటం కోసమే ఈ పిటిషన్ వేశారు తప్ప.. ఇందులో ఇలాంటి ప్రజా ప్రయోజనాలు లేవని స్పష్టం చేశారు.

రాజధాని తరలింపునకు ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందనడం కూడా అవాస్తవమన్నారు సచివాలయ ఉద్యోగులు. రాజధాని తరలింపునకు కేవలం రూ.70 కోట్లు మాత్రమే ఖర్చవుతుందని స్పష్టం చేశారు. పిటిషనర్ కోర్టుకు తప్పుడు సమాచారం ఇవ్వడమే కాక.. కోర్టు విలువైన సమయాన్ని వృథా చేశారని సచివాలయ ఉద్యోగులు తమ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అమరావతి పరిరక్షణ సమితి వేసిన పిటిషన్‌ను కొట్టివేయడమే కాకుండా, భవిష్యత్తులో ఇలాంటి నిరాధార పిటిషన్లు వేయకుండా నివారించడానికి పిటిషనర్‌కు భారీ జరిమాన విధించాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు.
Published by: Shiva Kumar Addula
First published: July 28, 2020, 7:19 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading