ANDHRA PRADESH SEC NIMMAGADDA RAMESH KUMAR WARNS DISTRICT COLLECTORS ON COMPLAINT DURING PANCHAYAT ELECTIONS PRN
AP Panchayat Elections: అలా చేస్తే ఎన్నికలు రద్దు చేస్తా... కలెక్టర్లకు నిమ్మగడ్డ స్ట్రాంగ్ వార్నింగ్
నిమ్మగడ్డ రమేష్ కుమార్ (ఫైల్)
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో పంచాయతీ ఎన్నికల (AP Panchayat Elections) విషయంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ (SEC Nimmagadda Ramesh kumar) దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో అధికారులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికల విషయంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే జిల్లాల పర్యటనలతో అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ వారికి స్పష్టమైన ఆదేశాలిస్తున్న నిమ్మగడ్డ.. తాజాగా ఫిర్యాదుల కోసం యాప్ ను ఆవిష్కరించారు. ఎన్నికల నిర్వహణ కోసం E-Watch యాప్ ను ఆవిష్కరించిన నిమ్మగడ్డ.. అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. యాప్ ద్వారా వచ్చిన ఫిర్యాదులను అరగంటలో పరిష్కరించాలంటూ డెడ్ లైన్ విధించారు. తీవ్రమైన ఫిర్యాదులకు అరగంటలో పరిష్కారం చూపి కేటగిరీ-2లోకి మార్చాలని.. అలా చేయకుంటే సీరియస్ యాక్షన్ తీసుకుంటామన్నారు. ముఖ్యంగా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు నిత్యం అప్రమత్తంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. ఎక్కడైనా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుంటే అక్కడ ఎన్నికలను రద్దు చేస్తామని హెచ్చరించారు.
అక్రమాలకు తావులేకుండా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఫిర్యాదులపై తీసుకున్న చర్యలను కాల్ సెంటర్ ద్వారా పర్యవేక్షిస్తామన్నారు. ఇక ప్రభుత్వం అనుమతి లేకుండా యాప్ రూపొందింస్తున్నారన్న వచ్చిన ఆరోపణలను నిమ్మగడ్డ కొట్టిపారేశారు. అన్ని భద్రతా ప్రమాణాలను పరిగణలోకి తీసుకొనే యాప్ ను అందుబాటులోకి తెచ్చామన్నారు. అలాగే రిలయన్స్ జియో సహకారంతో కాల్ సెంటర్ నడిపిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ -వాచ్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చని, అక్రమాలు, ప్రలోభాలపై నేరుగా సమాచారం అందించవచ్చని తెలిపారు. ఫిర్యాదులు చేసిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ఫిర్యాదులను పరిష్కరించిన అనంతరం ఆ వివరాలను ఫిర్యాదుదారులకు చెబుతామని పేర్కొన్నారు.
ఇక ఏకగ్రీవాలకు ఎన్నికల కమిషనర్ వ్యతిరేకం కాదని మరోసారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్పష్టం చేశారు. కానీ బలవంతంగా, బెదిరింపులకు గురిచేస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఏకగ్రీవాల సంఖ్య భారీగా పెరుగుతుండటమే తాము దృష్టి పెట్టడానికి ప్రధాన కారణమని ఎస్ఈసీ స్పష్టం చేశారు. ఎన్నికలు సజావుగా జరిగే వాతావరణాన్ని సృష్టిస్తున్నామని...ప్రజాస్వామ్యంలో ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.
ఎన్నికల నిర్వహణ కోసం ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆవిష్కరించిన E-వాచ్ యాప్ పై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు వెళ్లింది. యాప్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ప్రభుత్వం... యాప్ ను నిలిపేయాలంటూ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. యాప్ వినియోగంపై స్టే ఇవ్వాలని పిటిషన్లో పేర్కొంది. ఈ పిటిషన్ గురువారం విచారణకు రానుంది. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం, పంచాయతీ రాజ్ శాఖకు సంబంధించిన యాప్ లు ఉండటే ప్రత్యేకంగా యాప్ ను డిజైన్ చేయాల్సిన అవసమేంటని రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నిస్తోంది. ప్రభుత్వంతో సంప్రదించకుండా రూపొందించిన యాప్ పై తమకు అభ్యంతరాలున్నాయని పేర్కొంది.
భద్రతాపరమైన అనుమతులు లేకుండా యాప్ను రహస్యంగా తయారు చేశారని పిటిషన్లో ప్రభుత్వం పేర్కొంది. ప్రభుత్వ వ్యవస్థలో యాప్లు, సాఫ్ట్వేర్లు ఉపయోగించాలంటే అనుమతి తప్పనిసరిగా ఉండాలని తెలిపింది. సెక్యూరిటీ సమస్యలు, హ్యాక్ అయ్యే అవకాశం ఉందని ఏపీ ప్రభుత్వం వెల్లడించింది.
Published by:Purna Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.