Nimmagadda Ramesh Kumar: టీడీపీకి నిమ్మగడ్డ షాక్.. నోటీసులు ఇచ్చిన ఎస్ఈసీ.. ఫిబ్రవరి 2 డెడ్ లైన్..

ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ (ఫైల్)

పంచాయతీ ఎన్నికలకు టీడీపీ రిలీజ్ చేసిన మేనిఫెస్టోపై వివరణ ఇవ్వాలంటూ నోటీసులు జారీ చేసింది. ఫిబ్రవరి 2వ తేదీ లోపు ఎన్నికల సంఘానికి దీనిపై వివరణ ఇవ్వాలని ఆ నోటీసుల్లో పేర్కొంది. ఒకవేళ వివరణ ఇవ్వని పక్షంలో తాము చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి షాక్ ఇచ్చారు. ఆయన చంద్రబాబు చెప్పినట్టు నడుస్తున్నారన్న వైసీపీ ఆరోపణల నేపథ్యంలో టీడీపీకి నిమ్మగడ్డ నోటీసులు జారీ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. పార్టీలకు అతీతంగా జరిగే పంచాయతీ ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో రిలీజ్ చేయడాన్ని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పుపట్టింది. అది ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందంటూ వైసీపీ నేతలు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును పరిశీలించిన ఎస్ఈసీ.. దీనిపై వివరణ ఇవ్వాలంటూ టీడీపీకి నోటీసులు జారీ చేసింది. ఫిబ్రవరి 2వ తేదీ లోపు ఎన్నికల సంఘానికి దీనిపై వివరణ ఇవ్వాలని ఆ నోటీసుల్లో పేర్కొంది. ఒకవేళ వివరణ ఇవ్వని పక్షంలో తాము చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది.

    మరోవైపు ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించేందుకు కడపలో పర్యటించిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనూహ్యంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మీద పొగడ్తల వర్షం కురిపించారు. రాజ్యంగానికి వైఎస్ఆర్ ఎంతో గౌరవమిచ్చేవారని చెప్పారు. నిజాలను నిర్భయంగా చెప్పే ధైర్యం ఆయన ఇచ్చిందేనని వ్యాఖ్యానించారు. తన గుండెల్లో వైఎస్ఆర్‌కు ప్రత్యేక స్థానం ఉందని చెప్పారు. వైఎస్ జగన్‌కు సంబంధించిన సీబీఐ కేసుల గురించి కూడా ఆయన పరోక్షంగా స్పందించారు. తాను ఆ కేసుల్లో సాక్షిగా ఉన్నానని చెప్పారు. ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్నా కూడా తాను ఎప్పుడూ ఇబ్బందులకు గురి కాలేదన్నారు. రాజ్యాంగం ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. రాజ్యాంగాన్ని, సుప్రీం కోర్టును, వ్యవస్థలను గౌరవించాలని అన్నారు. పంచాయతీ ఎన్నికలను ఏ శక్తి అడ్డుకోలేదని అన్నారు.

    మరోవైపు అసాధారణంగా ఏకగ్రీవాలు మంచిది కాదని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ అన్నారు. ఏకగ్రీవాలపై షాడో బృందాలు కచ్చితంగా దృష్టిపెడతాయని ఎస్​ఈసీ స్పష్టం చేశారు. రాజ్యాంగం ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తున్నామన్నారు. అందరికీ సమాన న్యాయం కల్పించాలనేదే లక్ష్యమని స్పష్టం చేశారు. ఏకగ్రీవాలన్నీ తప్పుకాదని, అసాధారణంగా జరిగితేనే పరిశీలిస్తామన్నారు. పనిచేసే వారిపైనే ఎప్పుడూ విమర్శలు వస్తాయని స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణకు అంతా కృషి చేయాలని నిమ్మగడ్డ పిలుపునిచ్చారు.

    ఏపీలో అధికార వైసీపీ, ఎస్ఈసీ నిమ్మగడ్డ మధ్య పెద్ద ఎత్తున వైరం జరుగుతోంది. ప్రభుత్వంలోని పెద్దలు నిమ్మగడ్డ మీద విరుచుకుపడుతుంటే.. ఆయన జగన్‌కు దగ్గరగా ఉండే అధికారులను టార్గెట్ చేస్తున్నారు. ఇప్పటికే పలువురు అధికారుల మీద చర్యలు తీసుకున్న ఆయన ఏకంగా సీఎంఓ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్‌ను కూడా బదిలీ చేయాలంటూ చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్‌కు ఆదేశాలు ఇచ్చారు. దీనిపై ప్రవీణ్ ప్రకాష్ సీఎస్‌ను కలిసి వివరణ ఇచ్చారు. కానీ, ఇంతవరకు ప్రవీణ్ ప్రకాష్ మీద చర్యలు ఎందుకు తీసుకోలేదో చెప్పాలంటూ సీఎస్‌కు మరోసారి ఘాటు లేఖ రాశారు నిమ్మగడ్డ.
    Published by:Ashok Kumar Bonepalli
    First published: