టీడీపీ, వైసీపీలకు ‘సత్తెనపల్లి’ తలనొప్పి... కారణం ఇదే

గుంటూరు జిల్లా సత్తెనపల్లి అసెంబ్లీ సీటు వ్యవహారం టీడీపీ, వైసీపీలకు తలనొప్పిగా మారింది. వైసీపీ తరపున బరిలో ఉండాలనుకుంటున్న అంబటి రాంబాబుకు, టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే, సీనియర్ నేత కోడెల శివప్రసాదరావుకు అసమ్మతి సెగలు తగులుతున్నాయి.

news18-telugu
Updated: March 14, 2019, 11:50 AM IST
టీడీపీ, వైసీపీలకు ‘సత్తెనపల్లి’ తలనొప్పి... కారణం ఇదే
చంద్రబాబు, జగన్ (ఫైల్ ఫోటో)
  • Share this:
ఆ నియోజకవర్గంలోని ప్రధాన రాజకీయ పార్టీల నేతలిద్దరూ హేమాహేమీలు. ఇద్దరూ తమ పార్టీ అధినేతలకు సన్నిహితులే. గత ఎన్నికల్లో ఒకరు విజయం సాధించి కీలక పదవి దక్కించుకోగా... ఈ ఎన్నికల్లో మరో పార్టీకి చెందిన ముఖ్యనేత గెలుపు కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ సారి ఆ ఇద్దరికీ సొంత పార్టీలోనూ అసమ్మతి సెగలు మొదలయ్యాయి. టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు, వైసీపీ ముఖ్యనేత అంబటి రాంబాబు సవాళ్లు ఎదుర్కొంటున్న సత్తెనపల్లి అసెంబ్లీ సీటు... ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

వైసీపీ తరపున సత్తెనపల్లి అసెంబ్లీ టికెట్ అంబటి రాంబాబుకు ఇవ్వొద్దని వైసీపీలోని ఆయన వ్యతిరేకవర్గం ఎప్పటి నుంచో పార్టీ అధినాయకత్వానికి చెబుతూ వస్తోంది. అంబటి రాంబాబుకు టికెట్ ఇస్తే సత్తెనపల్లిలో వైసీపీ ఓటమి ఖాయమంటూ పార్టీ నేతలు వాదిస్తున్నారు. అయితే ఎన్నికల సమయంలోనే దీనిపై నిర్ణయం తీసుకుంటామంటూ పార్టీ ముఖ్యనేతలు స్పష్టం చేశారు. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ తుది దశకు చేరుకోవడంతో అంబటి వ్యతిరేకవర్గం మరోసారి దీనిపై అభ్యంతరాలు లేవనెత్తుతోంది. బత్తుల బ్రహ్మానందరెడ్డి నేతృత్వంలోని కొందరు నేతలు ఈ అంశాన్ని పార్టీ అధినేత జగన్ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో సత్తెనపల్లి విషయంలో వైసీపీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది ? అంబటి రాంబాబుకు టికెట్ దక్కుతుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.

ఇక సత్తెనపల్లి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావుకు సైతం అసమ్మతి తప్పడం లేదు. చంద్రబాబుతో పోరాడి మరోసారి సత్తెనపల్లి టికెట్ దక్కించుకున్న కోడెల అభ్యర్థిత్వాన్ని లోకల్ టీడీపీ నేతలు వ్యతిరేకిస్తున్నారు. కోడెల వద్దు చంద్రబాబు ముద్దు అంటూ స్థానికంగా ఆందోళనలు చేపడుతున్నారు. అయితే ఈ విషయంలో కోడెల మాత్రం వెనక్కి తగ్గడం లేదు. మొత్తానికి టీడీపీ, వైసీపీలకు తలనొప్పిగా మారిన సత్తెనపల్లి సీటు వ్యవహారం ఎన్ని మలుపులు తిరుగుతుంది.. ఈ అసమ్మతి సెగలు ఏ పార్టీకి కలిసొస్తాయన్నది ఆసక్తికరంగా మారింది.First published: March 14, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు