Mystery Disease: వింత వ్యాధిపై రాజకీయ వివాదం.., ప్రభుత్వానికి పవన్ కౌంటర్..

పశ్చిమ గోదావరి జిల్లాలో వింత వ్యాధిపై రాజకీయ దుమారం

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో రాజకీయాలు ఎప్పుడు ఎలాంటి మలుపు తీసుకుంటాయో చెప్పడం కష్టం. హిందూ ఆలయాలపై దాడులు (Temple vandalism) రేగిన రాజకీయ దుమారం చల్లారకముందే.., పశ్చిమ గోదావరి జిల్లాలో వింత వ్యాధిపై (Mystery Illness) వివాదం రేగుతోంది.

 • Share this:
  ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు ఎప్పుడు ఎలాంటి మలుపు తీసుకుంటాయో చెప్పడం కష్టం. రాష్ట్రంలో ఎక్కడైనా వివాదాస్పద అంశం వెలుగులోకి వచ్చినా., సంచలన విషయాలు బయటపడినా అది కచ్చితంగా పొలిటికల్ టర్న్ తీసుకుంటుంది. ఇప్పటికే హిందూ ఆలయాలపై దాడుల విషయంలో రాజకీయాలు వేడెక్కాయి. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జోరుగా సాగుతోంది. ఇప్పుడు పశ్చిమగోదావరి జిల్లాలో వ్యాపిస్తున్న వింత వ్యాధిపైనా రాజకీయ వివాదం మొదలైంది. వింత వ్యాధి వెనుక కుట్రకోణం దాగి ఉందన్న డిప్యూటీ సీఎం ఆళ్లనాని కామెంట్స్ ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి. రామతీర్థం విషయంలో జరిగిన రగడ మరవకుముందే మరో వివాదానికి తెరలేవడంతో ఇప్పుడు ఏలూరు సెంట్రిక్ గా పొలిటికల్ ఫైటింగ్ జరగడం ఖాయమని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. దీనిపై ప్రతిపక్షాలు కూడా గట్టిగానే స్పందిస్తున్నాయి.

  పవన్ పంచ్
  ఏలూరులో వింత వ్యాధికి జనసేన కుట్ర ఉందన్న ఆళ్లనాని కామెంట్స్ పై ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కౌంటర్ వేశారు. ఒకే ఒక్క మాటతో ఆళ్ల నాని విమర్శలను తిప్పి కొట్టారు. “ఒట్టిగొడ్డుకి అరుపులెక్కువని” అని పవన్ పంచ్ డైలాగ్ వేశారు. సమస్యను పరిష్కరించలేక కావాలనే తమపై ఆరోపణలు చేస్తున్నారని సింగిల్ డైలాగ్ లో తిప్పికొట్టారు పవన్ కల్యాణ్. అటు జనసేన నేతలు కూడా ప్రజారోగ్యాన్ని కాపాడలేని ప్రభుత్వం తమపై నిందలు వేస్తోందని మండిపడ్డారు.  ప్రజలు చెప్పినా వినరా..?: చంద్రబాబు
  అటు టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా వింత వ్యాధి వ్యవహారంపై స్పందించారు. వింత వ్యాధి జాతీయస్థాయిలో సంచలనం అయ్యేసరికి నాలుగురోజులు హడావిడి చేసి.., తర్వాత వదిలేశారని విమర్శించారు. అదిప్పుడు జిల్లాలోని దెందులూరు మండలం కొమిరేపల్లికి పాకిందని., . కుట్ర రాజకీయాలు, వ్యవస్థలను నాశనం చేసేవాటి మీద పెట్టే శ్రద్ధ, పాలకులు ప్రజారోగ్యం మీద పెట్టాలని చంద్రబాబు డిమాండ్ చేసారు. అలాగే కొమిరేపల్లి గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ అధ్వాన్నంగా ఉందని ప్రజలు అంటున్నారని.., ప్రభుత్వం ప్రజలకు సురక్షితమైన తాగునీరు కూడా ఇవ్వలేకపోతోందని విమర్శించారు. పాలన అంటే ప్రజల జీవితాలను మార్చగలగాలని.., కానీ వైసీపీ పాలనలో ప్రజలు తాము ప్రాణాలతో ఉంటే చాలు అనుకునే పరిస్థితిలో ఉన్నారని చంద్రబాబు ఎద్దేవా చేశారు.

  మంత్రి ఏమన్నారంటే..!
  అంతుచిక్కని వ్యాధివెనుక కుట్రకోణం ఉందేమోనని అనుమానంగా ఉందని ఆళ్లనాని అన్నారు. జనసేన, తెలుగుదేశం పార్టీల వైఖరి చూస్తే అలాగే ఉందన్నారు. ఆలయాలపై దాడులు చేసిన మాదిరిగానే ప్రతిపక్షాలు ప్రజారోగ్యంతో ఆటలాడుతున్నాయని ఆళ్లనాని ఆరోపించారు. బాధితులను ఆస్పత్రికి తరలిస్తున్న అంబులెన్సులను జనసేన నేతలు అడ్డుకుంటున్నారంటూ తీవ్రవ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు జరిపించాల్సిన అవసరముందన్నని ఆళ్లనాని వ్యాఖ్యానించారు. రాజకీయాల కోసం ప్రజల ఆరోగ్యంతో ఆటలు ఆడొద్దని ఆయన హెచ్చరించారు. బాధితుల పట్ల జనసేన నేతలు దారుణంగా ప్రవర్తిస్తున్నారని ఆళ్లనాని ఆరోపించారు. దేవుడితో ఆటలాడిన వారు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే ఎరూ క్షమించరన్నారు. మొత్తానికి ఆలయాలపై దాడుల తర్వాత వింత వ్యాధి వ్యవహారం రాజకీయ రంగు పులుముకోవడం ఆసక్తికరంగా మారింది.
  Published by:Purna Chandra
  First published: