అమరావతి: ఏపీలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ రాజకీయంగా సెగలు రేపుతోంది. ఓ వైపు ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చకచకా ఏర్పాట్లను పూర్తి చేస్తోంటే, మరో వైపు ఆయన చర్యలను వ్యతిరేకిస్తూ వైసీపీ తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. ఏపీఎన్జీవోలు కూడా పంచాయతీ ఎన్నికల విధుల్లో తాము పాల్గొనబోమని ఇప్పటికే స్పష్టం చేశారు. ఉద్యోగుల భద్రతను ఎన్నికల సంఘం పట్టించుకోదా.? అంటూ నిలదీశారు. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారుల సంఘం కూడా ఈ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టు ఓ పత్రికా ప్రకటనను విడుదల చేసింది. తమ ప్రాణాలను, ప్రజల ప్రాణాలను ఫణంగా పెట్టలేమని తేల్చిచెప్పింది. ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే కరోనా విజృంభించి మళ్లీ కథ మొదటికి వచ్చే ప్రమాదముందని హెచ్చరించింది.
’అకస్మాత్తుగా విడుదల చేసిన స్థానిక ఎన్నికల షెడ్యూల్ పోలీసు సిబ్బందిని ఆందోళనకు గురిచేసింది. కరోనా బారిన పడి ఇప్పటికే రాష్ట్రంలో 109 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 14 వేల మంది పోలీసు సిబ్బంది కరోనా బారిన పడ్డారు. ఇప్పటికీ చికిత్స తీసుకుంటున్నారు. కరోనా వేక్సిన్ అవగాహన ప్రక్రియలో పోలీసు సిబ్బంది బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంది. పోలీసు సిబ్బంది కూడా వేక్సిన్ వేయించుకోవాల్సి ఉంది. ఈ ప్రక్రియ అంతా పూర్తికాకముందే పంచాయతీ ఎన్నికల విధుల్లో పాల్గొంటే మొదటికే మోసం వస్తుంది. కరోనా బారిన పడి ప్రాణాలను ఫణంగా పెట్టాల్సి వస్తుంది. ఈ ఎన్నికల విధులను నిర్వర్తించి మా ప్రాణాలను, మా కుటుంబ సభ్యుల ప్రాణాలను ఫణంగా పెట్టలేము. అందుకే ఈ పంచాయతీ ఎన్నికల విధులను బహిష్కరిస్తున్నాం‘ అని పోలీసు అధికారుల సంఘం విడుదల చేసిన ఆ ప్రకటనలో స్పష్టంగా ఉంది.
ఇదిలా ఉండగా, అధికార పార్టీతోపాటు ఉద్యోగ సంఘాల నేతలు, పోలీసు అధికారులు ఎన్నికల నిర్వహణను వ్యతిరేకిస్తున్నా, ఎన్నికల కమిషన్ మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలన్న లక్ష్యంతో ఉంది. ఈ మేరకు ప్రభుత్వానికి ఓ లేఖను కూడా ఎన్నికల కమిషనర్ రాశారు. ఎన్నికల నియమావళిని గురించి ఆ లేఖలో ప్రస్తావించారు. పల్లెలకే ఎన్నికల కోడ్ ఉంటుందనీ, పట్టణాల్లో ఉండదని చెప్పారు. కాగా, ఎన్నికల ప్రక్రియను నిలిపివేయాలంటూ ఇప్పటికే ఏపీ సర్కారు కోర్టు మెట్లెక్కిన సంగతి తెలిసిందే. కరోనా టీకా విధుల్లో ప్రభుత్వ సిబ్బంది పాల్గొనాల్సి ఉంటుందనీ, కొవిడ్ కేసుల రీత్యా ఈ పరిస్థితుల్లో ఎన్నికల నిర్వహణ ప్రమాదమని ఏపీ సర్కారు వాదిస్తోంది. మరి కోర్టు తీర్పు ఎలా ఉంటుందో తెలయాల్సి ఉంది.
Published by:Hasaan Kandula
First published:January 09, 2021, 17:26 IST