ఈ క్రమంలో పెద్దిరెడ్డి మీద డీజీపీ చర్యలు తీసుకోకపోతే తర్వాత ఏం జరుగుతుందనే వాదన తెరపైకి వచ్చింది. ఎస్ఈసీ చెప్పినట్టు చేస్తే.. రేపు ఏకంగా సీఎం జగన్‌ను కూడా బయటకు రావొద్దని ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికలు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్, అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మధ్య ప్రచ్ఛన్న యుద్ధంలా మారాయి. ఒకరిపై మరొకరు ఆధిపత్యం చూపించుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టుగా మారాయి. తాజాగా, ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సంచలన ఆదేశాలు జారీ చేశారు. ఏపీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఫిబ్రవరి 21వ తేదీ వరకు ఇంట్లోనే ఉంచాలని, ఆయన మీడియాతో కూడా మాట్లాడనివ్వద్దని రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు లేఖ రాశారు. చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో ఏకగ్రీవాలను వెంటనే అనుమతించొద్దని, వాటిని పక్కన పెట్టాలని ఎస్ఈసీ నిమ్మగడ్డ శుక్రవారం రోజు ఆయా జిల్లాల అధికారులను ఆదేశించారు. దీనిపై మంత్రి పెద్ది రెడ్డి స్పందించారు. ఎస్ఈసీ చెప్పారని అక్రమంగా ఏకగ్రీవాలను ఆపితే వారి సంగతి చెబుతామని హెచ్చరించారు. మార్చి తర్వాత తామే అధికారంలో ఉంటామని, ఇప్పుడు ఏకగ్రీవాలను ఆపిన అధికారులను అప్పుడు బ్లాక్ లిస్టులో పెడతామని హెచ్చరించారు. దీంతో అటు ఎస్ఈసీ, ఇటు ప్రభుత్వం మధ్య అధికారులు నలిగిపోతున్నారు.
పెద్దిరెడ్డి వ్యాఖ్యల తర్వాత ఎస్ఈసీ ఏకంగా ఆయన మీదే చర్యలు తీసుకోవడం సంచలనం రేపింది. మంత్రి పెద్దిరెడ్డిపై ఆంక్షలు విధిస్తూ ఎస్ఈసీ ఇచ్చిన ఆదేశాలపై హైకోర్టుకు వెళ్లాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇవాళ, రేపు కోర్టుకు సెలవులు కావడంతో హౌస్ మోషన్ కు వెళ్లనుంది ప్రభుత్వం. అయితే, ఎన్నికల అధికారులు భయపడవద్దని ఎస్ఈసీ నిమ్మగడ్డ భరోసా ఇస్తున్నారు. ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులకు రాజ్యాంగం ప్రకారం పూర్తి రక్షణ లభిస్తుందని స్పష్టం చేశారు. వారికి ఈసీ అండగా ఉంటుందన్నారు.
ఈ క్రమంలో పెద్దిరెడ్డి మీద డీజీపీ చర్యలు తీసుకోకపోతే తర్వాత ఏం జరుగుతుందనే వాదన తెరపైకి వచ్చింది. ఎస్ఈసీ చెప్పినట్టు చేస్తే.. రేపు ఏకంగా సీఎం జగన్‌ను కూడా బయటకు రావొద్దని ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. దీంతో ముందే ఢీ కొట్టాలని వైసీపీ నిర్ణయించింది. ఒకవేళ మంత్రి విషయంలో డీజీపీ చర్యలు తీసుకోకపోతే ఏం జరుగుతుందనేది పరిశీలిస్తే గతంలో చేసినట్టే ఎస్ఈసీ మరోసారి ఈ అంశంపై డీజీపీకి లేఖ రాసే అవకాశం ఉంది. అప్పటికీ స్పందన లేకపోతే ఆయన గవర్నర్ వద్దకు వెళ్లే అవకాశం ఉంది. ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులను బెదిరించిన వారి మీద చర్యలు తీసుకోవాలని తాను కోరినా డీజీపీ స్పందించలేదు కాబట్టి మీరే రంగంలోకి దిగాలని సాక్షాత్తూ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దృష్టికి తీసుకుని వెళ్లే అవకాశం ఉంది. గతంలో కూడా ఎస్ఈసీ కొందరు మంత్రులు లక్ష్మణ రేఖ దాటొద్దని హెచ్చరించారు. వారి మీద చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ను కోరారు. ఇప్పుడు మరో సారి గవర్నర్ వద్దకు పంచాయతీ చేరే అవకాశం ఉంటుంది. మరోవైపు ఈ అంశంపై కోర్టుకు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించడంతో అక్కడ ఏం జరుగుతుందనేది కూడా ఆసక్తిగా మారింది. ఇప్పటికే ఎన్నికల విషయంలో కోర్టుల ద్వారా పనులు జరుగుతున్నాయి. దీనిపై కూడా కోర్టు ఏం చెబుతుందో చూడాలి.
Published by:Ashok Kumar Bonepalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.