ANDHRA PRADESH PANCHAYAT ELECTIONS TURNED INTO AUCTIONS AT VILLAGE LEVELS HERE ARE THE DETAILS PRN
AP Panchayat Elections: ‘పంచాయతీ’ల్లో వేలం పాటలు.., భలే మంచి పొలిటికల్ బేరము..
ప్రతీకాత్మక చిత్రం
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో గ్రామపంచాయతీ ఎన్నికల్లో (Panchayat Elections)కొత్త ట్రెండ్ నడుస్తోంది. ఏ పార్టీ ఏముందిలే... ఊళ్లో మనం మనం చూసుకుందాం అనే చందానే ఏకగ్రీవానికి సెటిల్ మెంట్లు సాగుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికల రాజకీయం కొత్త పుంతలు తొక్కుతోంది. రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను బరిలో దించి గెలిపించుకునేందుకు వ్యూహచలను చేస్తున్నాయి. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం మెజారిటీ పంచాయతీలను ఏకగ్రీవాల ద్వారానే సొంతం చేసుకోవాలని భావిస్తోంది. దీంతో అధికార పార్టీ నేతలు గ్రామాల్లో శిబిరాలు నిర్వహించిన మరీ ప్రత్యర్థి పార్టీలు బలపరిచే అభ్యర్థులతో చర్చలు జరుపుతున్నారు. కొన్నిచోట్ల బెదిరింపులకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు కూడా వస్తున్నాయి. పార్టీలేమైనా ఊళ్లో మనం మనం చూసుకుందాం అనే చందానే ఏకగ్రీవానికి సెటిల్ మెంట్లు సాగుతున్నట్లు తెలుస్తోంది. కొన్ని చోట్ల మాత్రం గ్రామపంచాయతీల బహిరంగ వేలాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. డబ్బున్న మారాజులు ఏకగ్రీవాలను వేలం పాటలో సొంతం చేసుకుంటున్నారు.
తాజాగా తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మండలం దుర్గాడ పంచాయతీ సర్పంచ్ పదవి గ్రామస్తులు వేలంపాట నిర్వించారు. గ్రామ సర్పంచ్ పదవిని ఓ వ్యక్తి రికార్డు స్థాయిలో రూ.33లక్షలకు సొంతం చేసుకున్నాడు. దుర్గాడ సర్పంచ్ స్థానం రిజర్వేషన్లలో బీసీలకు కేటాయంచారు. ఈ ఎన్నికల కోసం నిర్వహించిన వేలంలో నలుగురు వ్యక్తులు పోటీపడ్డారు. వేలంలో పోటిపడ్డ అభ్యర్థులు కాకుండా., ఇతర వ్యక్తి ఎన్నికల్లో పోటీ చేస్తే.., ఎవరైతే ఎక్కువ ధరకు పాడుకుంటారో వారికే వేలం కట్టబెట్టడంతో పాటు.., ఎన్నికలు జరిగితే అతడ్నే గెలిపించాలని తీర్మానించారు. ఎవరూ పోటీలో నిలవకుంటే సర్పంచ్ తో పాటు వార్డు మెంబర్లను కూడా ఏకగ్రీవం చేయాలని తీర్మానించారు. ఐతే వేలంలో వచ్చిన సొమ్మును గ్రామస్తులకు పంచుతారనుకుంటే అది మీ పొరబాటే.., ఆ సొమ్మంతా ఊళ్లోని శివాలయ మండప నిర్మాణ పనులకు వినియోగించాలని నిర్ణయించారు.
గ్రామ పంచాయతీల్లో ఇలాంటి వేలంపాటలు కొత్తేంకాదు. చాలా చోట్ల పంచాయతీ ఎన్నికలు జరిగినప్పుడు ఊళ్లో డబ్బున్న వ్యక్తులు, ఆస్తిపరులు సర్పంచ్ పదవి కోరుకుంటారు. సర్పంచ్ పదవికి పోటీ పెరిగితే గ్రామపెద్దలు చర్చించుకొని వేలం పాటలు నిర్వహిస్తుంటారు. ఆ సొమ్ముతో గ్రామంలో అభివృద్ధి పనులు చేపడుతుంటారు. లేదా గ్రామంలో మౌలిక సదుపాయల కల్పనకు ఖర్చు చేస్తుంటారు.
ప్రలోభాల పర్వం
పంచాయతీలను ఏకగ్రీవం చేసే క్రమంలో ప్రలోభాల పర్వాలకు కొందరు తెరలేపుతారు. ఐతే ఇలాంటివి నామినేషన్ల సందర్భంగా చోటు చేసుకుంటాయి. ప్రధాన పార్టీలకు పోటీ లేకుండా చేసేందుకు చిన్నచిన్న పార్టీల అభ్యర్థులను డబ్బులతో లొంగదీసుకోవడం రాజకీయాల్లో కామన్. ఏ స్థాయిలో ఎన్నికలు జరిగినా ఎదుటి అభ్యర్థులకు డబ్బులు, ఇళ్లు, స్థలాలు ఎరవేసిన సందర్భాలు గతంలో చాలాసార్లు చోటు చేసుకున్నాయి. కొన్నిసార్లు ప్రలోభాలకు లొంగకుంటే బెదిరింపులు, దాడులు జరిగిన ఘటనలు కూడా ఉండటం గమనార్హం.
Published by:Purna Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.