Janasena-BJP: జనసేన-బీజేపీలకు షాక్... మిత్రుల జోరుకు బ్రేక్ పడింది అక్కడేనా..? నెక్స్ట్ ఏంటీ..?

బీజేపీ-జనసేన రథయాత్రకు బ్రేక్ వేసిన పంచాయతీ ఎన్నికలు

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో పంచాయతీ ఎన్నికలకు (Panchayat Elections) సుప్రీం కోర్టు (Supreme Court) గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రాష్ట్రంలోని రాజకీయ పార్టీల వ్యూహాలన్నీ ఒక్కసారిగా మారిపోయాయి.

 • Share this:
  ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికలకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రాష్ట్రంలోని రాజకీయ పార్టీల వ్యూహాలన్నీ ఒక్కసారిగా మారిపోయాయి. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా ప్రజల మద్దతు కూడగట్టేందుకు వేసిన ప్రణాళికలకు ఫుల్ స్టాప్ పడింది. ముఖ్యంగా రాష్ట్రంలో బలపడాలని చూస్తున్న బీజేపీకి రథయాత్రకు పంచాయతీ ఎన్నికల వల్ల బ్రేక్ పడింది. ఫిబ్రవరి 4వ తేదీ నుంచి జనసేనతో కలిసి తిరుపతిలోని కపిలతీర్థం నుంచి విజయనగరం జిల్లాలోని రామతీర్థం వరకు రథయాత్ర చేపట్టాలని బీజేపీ నిర్ణయించింది. రాష్ట్రంలో ఇటీవల దాడులకు గురైన హిందూ దేవాలయాలను కలుపుతూ యాత్ర నిర్వహించేందుకు రూట్ మ్యాప్ సిద్ధం చేసుకుంది. ఐతే ఎన్నికల నోటిఫికేషన్ తో కమలనాథుల ప్రణాళికలన్నీ అర్ధాంతరంగా నిలిచిపోయాయి. దీంతో బీజేపీ-జనసేన పార్టీలు పంచాయతీ ఎన్నికలవైపు టర్న్ తీసుకోవాల్సి వచ్చింది.

  అదే వ్యూహం
  రామతీర్థం వెళ్లేందుకు బీజేపీ, జనసేన పార్టీలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. రెండుసార్లు చలో రామతీర్థం కార్యక్రమానికి పిలుపునిచ్చినా పోలీసులు భగ్నం చేశారు. అలాగే డీజీపీ గౌతమ్ సవాంగ్ చేసిన ఆరోపణలపై వివరణ కోరినా సరైన స్పందన రాకపోవడంతో రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి సిద్ధమైంది. ఈ నిరసన యాత్రకు తిరుపతిలోనే శ్రీకారం చుట్టాలని భావించింది. త్వరలో తిరుపతి పార్లమెంట్ స్థానానికి ఉప ఎన్నిక జరిగే అవకాశముండటంతో ప్రచారానికి కూడా ఈ యాత్ర పనికొస్తుందని భావించింది. ఇంతలోనే పంచాయతీ ఎన్నికలు రావడంతో రథయాత్రను వాయిదా వేస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించారు. పంచాయతీ ఎన్నికలు పూర్తైన తర్వాత యాత్ర చేపడతామని తెలిపారు.

  మరి అప్పుడు మైలేజ్ వస్తుందా..?
  రాష్ట్రంలో హిందూ ఆలయాలపై జరుగుతున్న దాడులకు నిరసనగా బీజేపీ-జనసేన ఈ యాత్రను చేపట్టాలని నిర్ణయించాయి. పనిలో పనిగా ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు ఇతర పార్టీల నేతలను పార్టీలో చేర్చుకొని ఒకింత బలపడేందుకు బీజేపీ ప్లాన్ వేసింది. కానీ పంచాయతీ ఎన్నికలు ఆ వ్యూహాన్ని గట్టిగానే దెబ్బకొట్టాయి. నిన్నటి వరకు రాష్ట్రంలో దేవాలయాలపై దాడుల అంశమే హాట్ టాపిక్. ఇప్పుడు ఆ స్థానాన్ని పంచాయతీ ఎన్నికలు భర్తీ చేశాయి. ఎన్నికలు ముగిసినా అందరి దృష్టి ఫలితాలపైనే ఉంటుంది. వేడి చల్లారిన తర్వాత ర్యాలీ చేపట్టినా బీజేపీకి పెద్దగా వచ్చే ప్రయోజనం ఉండదు.

  పంచాయతీ ఎన్నికలపై వ్యూహమేంటో..?
  ఇక పంచాయతీ ఎన్నికల విషయంలో బీజేపీ, జనసేన ఏ రకమైన విధానంతో ముందుకు సాగుతాయన్నది ఇంకా తేలలేదు. ఇంకా చెప్పాలంటే తిరుపతి ఉప ఎన్నికపై ఫోకస్ చేసిన ఈ రెండు పార్టీలకు.. అకస్మాత్తుగా వచ్చినట్టు ఈ పంచాయతీ ఎన్నికలు కొత్త తలనొప్పిని తెచ్చిపెట్టాయనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. మరోవైపు తమ పార్టీకి క్యాడర్, బలం ఉందని భావిస్తున్న పలు ప్రాంతాల్లో ఇప్పటికే జనసేన నేతలు, కార్యకర్తలు పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. బీజేపీతో సంబంధం లేకుండానే కొన్ని చోట్ల జనసేన నేతలు సొంతంగా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జనసేన ముఖ్యనేత నాదెండ్ల మనోహర్ తో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు భేటీ అయ్యారు.

  అయితే ఈ ఎన్నికల్లో బీజేపీ, జనసేన అభ్యర్థులు ఏ మేరకు ఫలితాలు సాధిస్తారనే అంశం.. తిరుపతి ఉప ఎన్నికల్లో తమపై ప్రభావం పడుతుందేమో అనే టెన్షన్ బీజేపీ, జనసేనలో ఉందనే ప్రచారం సాగుతోంది. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీకి ఎక్కువగా అనుకూల ఫలితాలు వస్తాయని.. ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోవద్దని ఇరు పార్టీలకు చెందిన నేతలు భావిస్తున్నారు. మొత్తానికి తిరుపతి ఉప ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించి టీడీపీని రెండో స్థానం నుంచి మూడో స్థానానికి దించాలని భావిస్తున్న బీజేపీ, జనసేన కూటమి.. పంచాయతీ ఎన్నికల్లోనూ అలాంటి వ్యూహాలు రచిస్తుందా అన్నది చూడాలి.
  Published by:Purna Chandra
  First published: