ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికలపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇప్పటికే ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నోటిఫికేషన్ విడుదల చేయడంతో నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఐతే రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ప్రభుత్వ ఉద్యోగులు సుప్రీం కోర్టుకు వెళ్లిన నేపథ్యంలో నామినేషన్లు స్వీకరిస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఉదయం 10గంటల నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైనా.. చాలా చోట్ల నామినేషన్ల స్వీకరణ జరగడం లేదు. దీంతో పంచాయతీ కార్యాలయాలకు వెళ్తున్న అభ్యర్థులు వెనుదిగుతుండగా.., కొన్ని చోట్ల ప్రభుత్వ తీరుకు భిన్నంగా నామినేషన్లు అధికారులు తీసుకుంటున్నారు. జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులు సిబ్బందికి ఎన్నికల విధులు కేటాయించలేదు. అసలు నామినేషన్లకు సంబంధించిన వివరాలను కూడా పంచాయతీ కార్యాలయాల ఎదుట ప్రదర్శించలేదు.
గుంటూరు జిల్లాలలో నామినషన్ల స్వీకరణ ప్రారంభమైంది. నామినేషన్ పత్రాలు పంచాయతీ కార్యాలయాలకు చేరుకోవడంతో సిబ్బందికి ఎన్నికల విధులు కేటాయించారు. పెదకాకాని మండలం, తక్కెళ్లపాడులో టీడీపీ అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించారు. అటు ప్రత్తిపాడు మండలంలోనూ నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ప్రత్తిపాడు మండలంలో స్టేజ్-1 ఆఫీసర్లకు ఓటర్లు జాబితా ఇచ్చి.. నామినేషన్లు తీసుకోవాలని MPDO విజయలక్ష్మి ఆదేశాలు జారీ చేశారు. అనంతపురం జిల్లా హిందూపురం మండలం తూముకుంట ఎంపీడీవో కార్యాలయంలో షమీన్ తాజ్ అనే అభ్యర్థిని అధికారులు వెనక్కి పంపారు. నామినేషన్ పత్రాలు లేవని తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా 90శాతం గ్రామ పంచాయతీల్లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాలేదు. ఇక తూర్పుగోదావరి జిల్లాలో పరిస్థితి నిన్న ఒకలా.., ఈ రోజు మరోలా ఉంది. నామినేషన్ల ప్రక్రియ కోసం ఏర్పాటు చేసిన అధికారులు తెల్లారేసరికి నిలిపేశారు. తొలుత రాజకీయ నేతల విగ్రహాలకు ముసుగులు వేసి, ప్రభుత్వ పథకాలకు సంబంధించిన పోస్టర్లు తొలగించిన అధికారులు.., ఉదయానికి రివర్స్ అయ్యారు. విగ్రహాలపై ముసుగులు తొలగించడమే కాకుండా.. ఎన్నికలకు సంబంధించిన ఎలాంటి సమాచారం ఇవ్వకుండా సైలెంట్ గా ఉండిపోయారు.
అధికారులు, ఇతర సిబ్బంది మాత్రం ఉన్నతాధికారుల నుంచి ఆధేశాలు రాలేదని.. వస్తే కచ్చితంగా ప్రక్రియ ప్రారంభిస్తామని స్పష్టం చేస్తున్నారు. సుప్రీం కోర్టు నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాతే తదుపరి చర్యలు తీసుకుంటామని మరికొందరు స్పష్టం చేస్తున్నారు.
Published by:Purna Chandra
First published:January 25, 2021, 14:11 IST