ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికల వ్యవహారం కీలకదశకు చేరింది. ఓవైపు ఎస్ఈసీ నోటిఫికేషన్.., మరోవైపు సుప్రీంలో ప్రభుత్వ పిటిషన్ దీంతో ఎవ్నికల ప్రక్రియ ఎలాంటి మలుపు తీసుకుంటోందనేది ఉత్కంఠగా మారింది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ నోటీఫికేషన్ జారీ చేయడంతో రేపటి (జనవరి 25) నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. మరోవైపు ఎన్నికలు నిలిపేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ సుప్రీం కోర్టులో సోమవారమే విచారణకు రానుంది. దీంతో పంచాయతీ ఎన్నికల ఎపిసోడ్ ఎలాంటి మలుపు తీసుకుంటుందో అనేది ఆసక్తికరంగా మారింది. సుప్రీం కోర్టు ఇచ్చే తీర్పుపైనే ఎన్నికల ప్రక్రియ ముందుకెళ్లేదీ లేనిదీ ఆధారపడి ఉంది. ప్రస్తుతం గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఏపీ పంచాయతీ ఎన్నిక వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.
హై కోర్టు డివిజినల్ బెంచ్ ఇచ్చిన తీర్పుతో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నోటిఫికేషన్ జారీ చేశారు. నోటిఫికేషన్ అమలుపై చర్చించేందుకు ఉన్నతాధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఐతే సమావేశానికి ఒక్కరు కూడా హాజరుకాకపోవడంతో కలకలం రేగింది. జిల్లాల నుంచి కలెక్టర్లు, ఎస్పీలు కూడా వీడియో కాన్ఫరెన్స్ కు రాకపోవడం వివాదం మరింత ముదిరింది. అటు సీఎస్ ఆదిత్యానాథ్ దాస్ కూడా ఎస్ఈసీతో భేటీకి రాకుండా లేఖతో సరిపెట్టారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎస్ఈసీ కావాలనే ఇదంతా చేస్తున్నారని మండిపడ్డారు. మరోవైపు ఉద్యోగులు కూడా ఎన్నికలకు ససేమిరా అంటున్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొనేది లేదని స్పష్టం చేస్తున్నారు.
సుప్రీం నిర్ణయంపై ఉత్కంఠ
కరోనా సమయంలోనే బీహార్ తో పాటు జీహెచ్ఎంసీ ఎన్నికలతో పాటు పలుచోట్ల స్థానిక సంస్థల ఎన్నికలు, ఉపఎన్నికలు జరగడంతో సుప్రీం తీర్పుపై అందరి దృష్టి పడింది. ఐతే రాష్ట్ర ప్రభుత్వం, ఉద్యోగులు, పోలీసులు వ్యతిరేకిస్తున్నందున సుప్రీం కోర్టు వారి అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుంటుందా లేదా అనేది ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇదిలా ఉంటే ఎన్నికలకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ల విచారణలో బెంచ్ ను మార్చడంతో వ్యవహారం మరో మలుపు తిరిగింది. తొలుత జస్టిస్ లావు నాగేశ్వరావు ధర్మాసనం జాబితాలో ఈ పిటిషన్ ఉంచారు. అయితే తాజాగా ఈ పిటిషన్ విచారణను జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ రిషికేశ్ రాయ్ బెంచ్‌కు సుప్రీం కోర్టు రిజిస్ట్రీ మార్చింది.
అధికారులేం చేస్తారో..?
ఇక మొదటి విడత నోటిఫికేషన్ విడుదల చేయడంతో.., జిల్లాల్లో కలెక్టర్లు, రిటర్నింగ్ అధికారులు గ్రామపంచాయతీల ఓటర్ల జాబితాతో ఉదయం 10 గంటలకు నోటిఫికేషన్ విడుదల చేయాల్సి ఉంది. అయితే నిన్న వీడియో కాన్ఫరెన్స్ కు హాజరుకాని అధికారులు.. నోటిఫికేషన్ విడుదల ఇస్తారా? లేదా? అన్న సందేహం నెలకొంది. ఎన్నికలకు సిద్ధంగా లేమని అధికారులు, ఉద్యోగులు ఇప్పటికే ప్రకటించారు. రాష్ట్రప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ లో ఇంప్లీడ్ అయ్యారు. వ్యాక్సిన్ వేసే వరకు ఎన్నికలు వద్దని ఉద్యోగ సంఘాలంటున్నాయి. ఎన్నికల విధులకు హాజరయ్యే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తున్నాయి.
ఐతే కొన్నిచోట్ల అధికారులు ఎన్నికలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం డివిజన్లో పంచాయతీ కార్యాలయాల వద్ద ఉన్న ప్రభుత్వ పథకాల పోస్టర్లను తొలగించిన అధికారులు., రాజకీయ నాయకుల విగ్రహాలకు ముసుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. కొన్ని పార్టీల అభ్యర్థులు నామినేషన్లకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. పార్టీల నేతలు అభ్యర్థులతో రహస్య మంతనాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.