నారాయణ అంటే అందరికీ తెలిసింది సీపీఐ నారాయణగానే.. అలాంటిది ఆయన పార్టీ మారడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా..? కానీ ఎంపీ విజయసారెడ్డి ట్వీట్ చూస్తే అర్థమవుతుంది ఏంటి మ్యాటర్ అన్నది..
సీపీఐ జాతీయ కార్యదర్శి నారయణ ఏం చేసినా సంచలనమే? ఎన్నికలు ఉన్నా లేకున్నా.. పార్టీ ఉనికిలో ఉన్నా లేకున్నా.. సీపీఐ నారాయణ మాత్రం ఎప్పుడూ వార్తల్లోనే ఉంటూ ఉంటారు. తాజాగా ఆయన విశాఖలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. జీవీఎంసీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థి తరఫున 97వ వార్డులో ఆయన పర్యటిస్తుండగా శారదా పీఠాన్ని చూసి లోపలకు వెళ్లారు. పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి అనుకోని అతిథిని పలకరించారు. ఇద్దరూ పలు అంశాలపై మాట్లాడుకున్నారు కూడా. సీపీఐ అభ్యర్థిని యశోదను స్వామికి పరిచయం చేశారు. ఆమె గెలుపొందేలా ఆశీర్వదించాలని నారయణ కోరారు. నారాయణ, స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి మధ్య కాసేపు ఆసక్తికర సంభాషణ జరగడంతో సోషల్ మీడియాలో ఈ పోటోలు, వీడియో వైరల్ గా మారాయి.
దీనిపై నారాయణ క్లారిటీ కూడా ఇచ్చారు. తరువాత రోజు గుంటూరులో 8వ వార్డు అభ్యర్థి జంగాల రమాదేవికి మద్దతుగా టీడీపీ నేత నసీర్ అహ్మద్, మేయర్ అభ్యర్థి నానితో కలిసి నారాయణ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల్లో వైసీపీ చేస్తున్న అరాచకాలపై మండిపడ్డారు. నిర్బంధ ఏకగ్రీవాలు సరైనవి కావన్నారు. రాష్ట్రంలో ఇంత అధికార దుర్వినియోగం గతంలో ఎప్పుడూ చూడలేదన్నారు. విశాఖ ఉక్కును అమ్మేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఎన్నికల్లో టీడీపీతో స్నేహపూర్వక పొత్తుతో వెళ్తున్నామని స్పష్టం చేశారు. భవిష్యత్తులోనూ ఉమ్మడిగా కొనసాగే అవకాశముందన్నారు.
అయితే రాజకీయాల్లో శాశ్వత శత్రువులు...శాశ్వత మిత్రులు ఉండరని ఆయన వ్యాఖ్యానించారు. అలాగే సీఎం జగన్ మెచ్చిన.. స్వరూపానంద స్వామిని యాదృచ్ఛికంగానే కలిశానని, ఒకరి అభిప్రాయాన్ని మరొకరితో పంచుకున్నామని అందులో తప్పేముంది అని నిలదీశారు. తామేమీ నాస్తికులం కాదన్నారు. దేవుడనే భావనకు వ్యతిరేకం కాదని వివరణ ఇచ్చారు. సాధరణంగా కమ్యూనిస్టులు ఇలాంటి వాటికి చాలా దూరంగా ఉంటారు. ఆలయాలు, స్వామీజల వైపు చూడరు.. కానీ నారాయణకు ఇలాంటి విషయాల్లో మినహాయింపు ఇవ్వాల్సిందే.
అయినా ఆయన శారద పీఠం వెళ్లి స్వరూపానంద్రేంద్ర స్వామిని కలిసిన విషయంపై చర్చ ఆగడం లేదు. తాజాగ ఎంపీ విజయసాయిరెడ్డి నారాయణ - స్వరూపానందేంద్ర స్వామి కలిసిన ఫోటోను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. దీనికి ఓ క్యాప్షన్ కూడా ఇచ్చారు. ఆయన మాటల్లోనే చెప్పాలి అంటే.. ‘తుప్పూ అండ్ పప్పూ...! మీ థియరీ ప్రకారం.. ఇంతకీ నారాయణ సీపీఐలో ఉన్నట్టా...! లేక వైయస్ఆర్సీపీలో చేరినట్టా...! అంటూ ప్రశ్నించారు. ప్రస్తుతం ఆ ట్వీట్ వైరల్ గా మారుతోంది. నెటిజన్లు ట్రోల్ చేస్తూ.. నారాయణను కూడా వైసీపీలో చేర్చేసుకొండి అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Published by:Nagesh Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.