SEC vs Kodali Nani: నిమ్మగడ్డకు కౌంటర్ ఇచ్చే పనిలో కొడాలి నాని.. ఆ మంత్రుల బాటలోనే

మంత్రి కొడాలి నాని (ఫైల్)

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ (State Election Commissioner Nimmagadda Ramesh Kumar).. ప్రభుత్వానికి మధ్య వైరం ఇంకా కొనసాగుతోంది. పంచాయతీ ఎన్నికల్లో (AP Panchayat Elections) రెండు విడతల పోలింగ్ ముగిసినా వివాదం మాత్రం చల్లారలేదు.

 • Share this:
  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్.. ప్రభుత్వానికి మధ్య వైరం ఇంకా కొనసాగుతోంది. పంచాయతీ ఎన్నికల్లో రెండు విడతల పోలింగ్ ముగిసినా వివాదం మాత్రం చల్లారలేదు. ఎన్నికల ప్రారంభంనాటికి కాస్త చల్లారిన వేడి మంత్రి కొడాలి నాని కామెంట్స్ తో మళ్లీ రాజుకుంది. మీడియా సమావేశంలో కొడాలి నాని అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఎస్ఈసీ షోకాజ్ నోటీసులివ్వడం.. దానిపై మంత్రి వివరణ ఇవ్వడం కూడా జరిగాయి. ఐతే కొడాలి నాని ఇచ్చిన వివరణపై సంతృప్తి చెందని ఎస్ఈసీ ఆయన మీడియాతో మాట్లాడకుండా నిషేధం విధించడమే కాకుండా.. ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో నిమ్మగడ్డకు కౌంటర్ ఇచ్చేందుకు కొడాలి నాని సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

  నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇచ్చిన ఆదేశాలపై అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేసేందుకు కొడాలి నాని సిద్ధపడినట్లు సమాచారం. మంత్రి, శాసనసభ్యుడిగా తన హక్కులకు భంగం కలిగించేలా నిమ్మగడ్డ ఆదేశాలిచ్చారని ఆయనపై చర్యలకు సిఫార్సు చేయాలని కొడాలి నాని అసెంబ్లీ స్పీకర్ ను కోరనున్నారు. ఈ విషయంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ బాటలోనే కొడాలి నాని నడుస్తున్నారు.

  ఇది చదవండి: పోలింగ్ కేంద్రంలోనే పురుటి నొప్పులు.. సర్పంచ్ అభ్యర్థిని వరించిన అదృష్టం


  ఎన్నికల కమిషనర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు కొడాలి నానిపై కేసు నమోదు చేయాలని కృష్ణా జిల్లా ఎస్పీకి శనివారం ఉదయం నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశాలిచ్చారు. ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించినందుకు ఐపీసీ 504, 505(1)(C), 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ నిబంధనల్లోని క్లాజ్‌-1, క్లాజ్‌-4 కింద కేసు నమోదు చేయాలని ఎస్ఈసీ తన ఆదేశాల్లో పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణ, కమిషనర్ పై అభ్యంతర వ్యాఖ్యలు చేసినందున చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

  ఇది చదవండి: పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు చేసే పనికి సెల్యూట్ చేయాల్సిందే..


  రేషన్ సరుకుల డోర్ డెలివరీ అంశంపై శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించిన మంత్రి కొడాలి నాని.. ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై విమర్శలు చేశారు. చంద్రబాబు చెప్పినట్లు ఎస్ఈసీ నడుస్తున్నారని.. జగన్నాథ రథచక్రాల కింద నలిగిపోవడం ఖాయమని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా చంద్రబాబును, నిమ్మగడ్డను పిచ్చాసుపత్రికి పంపాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై సీరియస్ అయిన ఎన్నికల కమిషనర్.. మంత్రి ప్రెస్ మీట్ ముగిసిన గంటలోనే ఆయనకు షోకాజ్ నోటీసులు పంపి వివరణ కోరింది.

  ఇది చదవండి: వైసీపీ ఎంపీకి హై కోర్టు షాక్.. సీబీఐ దర్యాప్తుకు ఓకే  ఎస్ఈసీ ఇచ్చిన షోకాజ్ నోటీసుకు వివరణ ఇచ్చిన మంత్రి కొడాలి నాని.. తాను వ్యక్తిగతంగా ఎన్నికల కమిషన్ ను గానీ, నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను గానీ దూషించలేదని పేర్కొన్నారు. మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ ఒకటి రెండు మాటలు అని ఉండొచ్చని క్లారిటీ ఇచ్చారు. పంచాయతీ ఎన్నికల విషయంలో ఎస్ఈసీ తీరుపై ప్రజల్లో జరుగుతున్న ప్రచారాన్ని ప్రస్తావించానే తప్ప.. వ్యక్తగతంగా దూషిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేయలేదని నాని స్పష్టం చేశారు. కావున తాను చేసిన వ్యాఖ్యలు మరోసారి పరిశీలించి షోకాజ్ నోటీసులు వెనక్కితీసుకోవాలని వివరణ లేఖలో ఎస్ఈసీకి విజ్ఞప్తి చేశారు.

  ఇది చదవండి: కానిస్టేబుల్ భార్య అనుమానాస్పద మృతి.. సూసైడ్ నోట్ లో వింత కారణం  కొడాలి నాని ఇచ్చిన వివరణపై సంతృప్తి చెందని ఎన్నికల కమిషన్ ఆయనపై ఆంక్షలు విధించింది. ఈ నెల 21 వరకూ ఎలాంటి మీడియా సమావేశాలు నిర్వహించకూడదని శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. ప్రెస్‌మీట్‌లతో పాటు ఎలాంటి మీటింగ్‌లలో పాల్గొనకూడదని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఆయనపై కేసులు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించడం సంచలనంగా మారింది. ఇప్పుడు నాని కూడా ఎస్ఈసీపై అస్త్రం ప్రయోగించేందుకు సిద్ధమవడంతో ఈ వ్యవహారం ఎలాంటి మలుపు తిరుగుతుందో వేచి చూడాలి.

  ఇక మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ చేసిన ఫిర్యాదుపై ఇప్పటికే అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ సమావేశమైంది. ఎస్ఈసీపై చర్యలు తీసుకోవాలని సూత్రప్రాయంగా నిర్ణయించిన కమిటీ మరోసారి సమావేమై చర్చించాలని నిర్ణయించింది.
  Published by:Purna Chandra
  First published: