చంద్రబాబు, నారా లోకేష్ పేర్లు వింటే చాలు పూనకం వచ్చేస్తుంది మంత్రి కొడాలి నానికి. అసలు మైక్ అందుకుని టీడీపీ నేతల గురించి మాట్లాడడం మొదలెట్టారంటే ఎక్కడ నుంచి ఎక్కడికి వెళ్తారో కూడా తెలీదు. తాజాగా మరోసారి ఇద్దరి తీరుపై నిప్పులు చెరిగారు మంత్రి కొడాలి నాని. ఆయన మాటల్లో చెప్పాలి అంటే పప్పు.. తుప్పు ఇద్దరూ ఇంటికే పరిమితమయ్యారన్నారు. తండ్రి కోడుకులిద్దరూ ఇంట్లో కూర్చుని జూమ్‌లో కాలక్షేపం చేస్తున్నారని, చంద్రబాబు పెట్టిన బకాయిలు తమ ప్రభుత్వం చెల్లించిందని మండిపడ్డారు. రైతులకు బాబు పెట్టిన 4వేల కోట్లు బకాయిలు చెల్లించామని, రైతులకు పంగనామాలు పెట్టి పారిపోయిన వ్యక్తి చంద్రబాబు అని దుయ్యబట్టారు. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రైతు బాంధవుడని కొడాలి కొనియాడారు. 21 రోజుల్లోపు ధాన్యం డబ్బులు చెల్లిస్తున్నామని తెలిపారు. కేంద్రం నుంచి నిధులు రాకపోయినా రైతులకు చెల్లిస్తున్నామని తెలిపారు.
నారా లోకేష్ కు తిండి పెంటినా దండుగ అని చంద్రబాబు దంపతులు భావించినట్టు ఉన్నారని అందుకే ఆయన్ను రోడ్డుపైకి వదిలేశారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు మంత్రి కొడాలి నాని. లోకేష్‌ను అచ్చోసిన ఆంబోతులా వదిలారని, చంద్రబాబు, లోకేష్ నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. కేంద్రానికి లేఖ రాయాలంటే చంద్రబాబుకు భయమని మంత్రి కొడాలి నాని ఎద్దేవా చేశారు. ఊక, ధాన్యానికి తేడా తెలియని వ్యక్తి చంద్రబాబు అని ధ్వజమెత్తారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచింది చంద్రబాబేనని, రాష్ట్రంలోకి సీబీఐ రాకూడదని చట్టం తెచ్చిన వ్యక్తి బాబు అని ఫైర్ అయ్యారు.
ఇటు మంత్రి కొడాలి వ్యాఖ్యలు అదే స్థాయిలో కౌంటర్లు ఇస్తున్నారు టీడీపీ నేతలు. కొడాలి నానీ మాట తీరు, ప్రవర్తన, నడవడిక చూసిన వారంతా ఆయనకు పిచ్చిపట్టిందేమోనని అనుకుంటున్నారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి దివ్యవాణి అన్నారు. నారా లోకేశ్ మాటతీరు, శరీర తీరు, చూశాక ఆయనకు మతిపోయినట్టుందని ఎద్దేవా చేశారు. ఏపీ ప్రజలైతే సరికొత్త లోకేశ్‌ను చూసి, స్వర్గీయ ఎన్టీఆర్‌లా ఉన్నాడంటున్నారని ఆమె పేర్కొన్నారు. తండ్రి వయసున్న చంద్రబాబుని, లోకేశ్‌ని విమర్శిస్తే, బూతులు తిడుతున్న నానీ, ముందు తానేం తింటున్నాడో తెలుసుకోవాలని నానీకి దివ్యవాణి హితవు పలికారు. హూ కిల్డ్ బాబాయి అనే ప్రశ్నకు, కోడికత్తి ఘటనకు సమాధానం చెప్పగల ధైర్యం కొడాలికి ఉందా అని ఆమె ప్రశ్నించారు. వివేకా హత్యకేసు విచారణ వేగవంతమైన తరుణంలోనే, కేసుతో సంబంధమున్నవారంతా ఆసుపత్రుల్లో ఎందుకు చేరుతున్నారో నానీ చెప్పాలని దివ్యవాణి డిమాండ్ చేశారు.
వివేకానందరెడ్డి కుమార్తె సునీత ఈ రాష్ట్రంలో తనకు రక్షణ లేదన్న వ్యాఖ్యలపై నానీ ఏం చెబుతాడని ఆమె నిలదీశారు. గతంలో చంద్రబాబునాయుడు 6లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డాడని మొరిగిన వారంతా ఇప్పుడెందుకు నోరెత్తడం లేదో నానీకి తెలుసా అని ఆమె సూటిగా ప్రశ్నించారు. పోలవరంలో అవినీతి, అమరావతి భూముల్లో ఇన్‌సైడ్ ట్రేడింగ్ అన్నగొంతులు ఇప్పుడెందుకు మూగబోయాయో నానీయే చెప్పాలని దివ్యవాణి డిమాండ్ చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, AP Politics, Kodali Nani, Nara Lokesh