AP Politics: కేంద్రం పేరు చెబితే భయపడతామా..? ఏం చేస్తారో.., చేసుకోండి.., టీడీపీ,బీజేపీలకు మంత్రి సవాల్

మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్(ఫైల్ పొటో)

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఆలయాలపై దాడుల విషయంలో డీజీపీ గౌతమ్ సవాంగ్ (DGP Gowtham Sawang) చేసిన ప్రకటనపై దుమారం రేగుతూనే ఉంది.

 • Share this:
  ఆంధ్రప్రదేశ్ లో ఆలయాలపై దాడుల విషయంలో డీజీపీ గౌతమ్ సవాంగ్ చేసిన ప్రకటనపై దుమారం రేగుతూనే ఉంది. డీజీపీ కామెంట్స్ పై తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతాపార్టీ నేతలు మండిపడుతున్నారు. డీజీపీ గౌతమ్ సవాంగ్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సవాంగ్ వైసీపీ నేతలా మాట్లాడుతున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తోంది. ఆయనపై పరువు నష్టం దావా వేస్తామని.,. అసలు సవాంగ్ డీజీపీ పదవికి పనికిరారంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో టీడీపీ, బీజేపీ నేతల ఆరోపణలకు దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు. దర్యాప్తులో తేలిన అంశాలను మాత్రమే డీజీపీ చెప్పారని.. తమ తప్పులేకుంటే టీడీపీ, బీజేపీ నేతలకు ఎందుకంత భయమన్నారు. ఆలయాలపై దాడులతో సంబంధం లేకుంటే నిరూపించాలన్నారు.

  దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని.., పథకాలపై ప్రజల దృష్టి మరల్చేందుకే టీడీపీ, బీజేపీలు ఆలయాలపై దాడులు చేయించాయని వెల్లంపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు దేవుడంటే భయం భక్తి లేదని.., ప్రభుత్వాన్ని ఏమీ చేయలేక నటరాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. టీడీపీ హయాంలో కూల్చిన గుళ్లను తాము కట్టిస్తుంటే ఎందుకంత కడుపు మంటని ఆయన ప్రశ్నించారు.

  అప్పుడేం చేశారు..?
  చంద్రబాబు హయాంలో సుమారు 40 దేవాలయాలు కూల్చినప్పుడు సోము వీర్రాజు, విష్ణు వర్ధన్ ఎక్కడికి వెళ్ళారని.., ఎందుకు నోరు మెదపలేదని  వెల్లంపల్లి ప్రశ్నించారు. బీజేపీ నేతలు రాష్ట్ర ప్రభుత్వంపై ఫిర్యాదు చేయడం కాదని., అంతర్వేది ఘటనను సీబీఐకి అప్పగిస్తే ఎందుకు పట్టించుకోలేదు..? కేంద్రంపై ఎందుకు ఒత్తిడి తీసుకురావాలని ప్రశ్నించారు. సోము వీర్రాజు అసలు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే మంచిదని వెల్లంపల్లి హితవు పలికారు. ఆలయాలపై జరిగిన దాడులపై 16 మంది సీనియర్ అధికారులతో సిట్ ఏర్పాటు చేసి కేసులను దర్యాప్తు చేయిస్తున్నామన్నారు. సీఎం జగన్ మతం మానవత్వమని ఆయన దృష్టిలో ఎన్ని మతాలు, కులాలు సమానమేనని వెల్లంపల్లి స్పష్టం చేశారు.

  తిరుపతిలో గెలుపు మాదే..
  తిరుపతి ఉపఎన్నికలో భాగంగానే బీజేపీ మతరాజకీయాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తోందని వెల్లంపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. తిరుపతిలో గెలుపు వైసీపీదేననడంలో ఎలాంటి సందేహం లేదని ఆయన అన్నారు. అలాగే తిరుపతిలో ఓడిన తర్వాత చంద్రబాబు రాజకీయ సన్యాసం తీసుకోవడం ఖాయమన్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలకు చెందిన వారికి కూడా కూడా రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయని గుర్తు చేశారు.

  ఇక అంతకుముందు విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు.., వైసీపీ, డీజీపీపై మండిపడ్డారు. ఆలయాల్లో విధ్వంసాలు జరిగితే స్పందించని పోలీసులు.., బీజేపీపై కేసులు పెట్టినట్లు ఏకంగా డీజీపీనే చెప్పడం వెనుక కారణాలేంటని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంటనే స్పందించి గౌతమ్‌ సవాంగ్‌ను డీజీపీ పదవి నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు. ఇక డీజీపీ గౌతమ్ సవాంగ్ కు క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోందో తెలుసా..? తెలియదా..? అంటూ సోము వీర్రాజు నిలదీశారు. ఈ నేపథ్యంలో సోము వ్యాఖ్యలకు వెల్లంపల్లి కౌంటర్ ఇచ్చారు.
  Published by:Purna Chandra
  First published: