news18-telugu
Updated: March 27, 2019, 2:37 PM IST
ఏపీ మాజీ మంత్రి నారాయణ(ఫైల్ ఫోటో)
ఎన్నికలకు మరికొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో... ప్రచారంలో అభ్యర్థులు ఫుల్ బిజీగా ఉన్నారు. తొలిసారి ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులైతే... ఎలాగైనా గెలిచేందుకు ఎంతగానో శ్రమిస్తున్నారు. టీడీపీ ప్రభుత్వంలో కీలక మంత్రిగా వ్యవహరిస్తూ... నెల్లూరు అర్బన్ నియోజకవర్గం నుంచి బరిలో దిగిన మంత్రి నారాయణ సైతం గెలుపు కోసం కష్టపడుతున్నారు. కొంతకాలంగా నియోజకవర్గంలోనే ఉంటూ ప్రచారాన్ని ఉధృతం చేస్తున్నారు. అయితే మంత్రి నారాయణకు ఆయన సమీప బంధువు రామ్మోహన్ ఊహించని షాక్ ఇచ్చారు. నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు.
ఈరోజు జరిగిన ఓ కార్యక్రమంలో వైసీపీ నేతలు ఆదాల ప్రభాకర్‌రెడ్డి, అనిల్ కుమార్ల సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. టీడీపీ ప్రభుత్వ పాలన నచ్చకే తాను వైసీపీలో చేరానని వివరించారు. నెల్లూరు జిల్లాను రూ.5,000 కోట్లతో అభివృద్ధి చేశామని మంత్రి నారాయణ చెప్పడాన్ని రామ్మోహన్ తప్పుబట్టారు. నిజంగానే నెల్లూరును రూ.5 వేల కోట్లతో అభివృద్ధి చేస్తే ఇప్పుడు డబ్బులు పెట్టి ఓట్లను ఎందుకు కొంటున్నారని ప్రశ్నించారు. రామ్మోహన్ వైసీపీలో చేరడం తమ పార్టీకి లాభిస్తుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.
First published:
March 27, 2019, 2:37 PM IST