M.బాలకృష్ణ, హైదరాబాద్ ప్రతినిధి, న్యూస్18
AP Politics: రాజకీయాల్లో కొందరు నేతలకు సపరేట్ స్టైల్ ఉంటుంది. అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా.. విమర్శలు వచ్చినా రాకున్నా.. వాళ్లు అనుకున్నది మాత్రం చేసుకుపోతూనే ఉంటారు. తమకు నచ్చిన పని చేస్తూ మొండిగా ముందుకెళ్తుంటారు. విలాసవంతమైన భవనాల నుంచి ఫారిన్ కార్లవరకూ పరిదాంట్లోనూ వారి మార్క్ స్టైల్ చూపిస్తుంటారు. ఇదే సమయంలో కొందరు చేసే పనులు వారి పొలిటికల్ కెరీర్ కు బ్రేక్ వేసినా వేయొచ్చు. ఈ సంగతి కాస్త పక్కనబెడితే. ఆంధ్రప్రదేశ్ మంత్రి ఒకరి ఫేస్ బుక్ పోస్ట్ ఇప్పుడు పెద్ద చర్చనీయాంశమైంది. మంత్రి అయినా మీడియాలో పెద్దగా కనిపించని ఆయన సడన్ గా ఫారిన్ టూర్ కి వెళ్లారు. ఏ మంత్రైనా టూర్ కి వెళ్తున్నారంటే ముందుగానే తెలిసిపోతుంటుంది. కానీ ఆయన పర్యటనపై ఆయనే సోషల్ మీడియాలో ప్రకటిస్తేగానీ బయటకురాలేదు.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) విధ్యుత్, అటవీ శాఖా మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి (AP Minister Balineni Srinivas Reddy) ప్రస్తుతం రష్యాటూర్ (Russia Tour) లో ఉన్నారు. ఆయన తరచూ విదేశాలకు వెళ్తూ ఉంటారు. రష్యాకు వెళ్తున్న సమయంలో బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఫేస్ బుక్ పెట్టిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. విలాసవంతమైన ప్రైవేట్ జెట్ లో ఆయన రష్యా వెళ్లారు. జెట్ లో కూర్చున్న ఫోటోలను స్వయంగా ఆయనే తన ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ చేయటం విశేషం. ఫోటో పెట్టడమే ఆ ఫోటో క్రింద క్యాప్సన్ అదిరిపోయేలా పెట్టేశారు. “సాకులు వెతుక్కోకుండా జీవించండి...హాయిగా పర్యటించండి” అంటూ పేర్కొన్నారు. అయన ఎవరిని ఉద్దేశించి ఆ పోస్ట్ పెట్టారో కానీ... ఆ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఐతే ఈ ఫోటో చూసిన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు మాత్రం సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారట. పర్యటనలతో ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారని కొందరు అంటే.., ప్రజల కష్టాలు పట్టించుకోని ప్రభుత్వం అంటూ మరి కొందరు సెటైర్ వేస్తున్నారు. ఇలాగైనా మా మంత్రికి ఫ్రీ పబ్లిసిటీ ఇస్తున్నారంటూ వైసీపీ కార్యకర్తలు రివర్స్ కౌంటర్ ఇస్తున్నారు.
అయితే అధికారంలో ఉండి పదవులు పొందినా.., ప్రతిపక్షంలో ఉండగా ప్రభుత్వంపై పోరాడినా... జీవితాన్ని ఎంజాయ్ చేయడంలో బాలినేని శ్రీనివాసరెడ్డి అనంతరమే తర్వాతే ఎవరైనా అని కూడా పొలిటికల్ సర్కిల్స్ లో చర్చించుకుంటున్నారు. ఐతే ఓ వైపు కరోనా విజృంభిస్తుంటే ఓ మంత్రి రష్యా పర్యటనకు వెళ్లడం వెనక కారణం ఏమిటా..? అనే చర్చ సాగుతోంది.
ప్రభుత్వం జీవోలను వెబ్ సైట్ లో ఉంచే పద్ధతికి స్వస్తి పలకడంతో అసలు ఇది వ్యక్తిగత పర్యటనా..? లేక ప్రభుత్వ పర్యటనా..? అనేది కూడా బయటకు తెలియడం లేదు. మంత్రిగారు ఫేస్ బుక్ లో పోస్ట్ చేసే వరకు ఆయన రష్యా వెళ్లిన సంగతి తమకే తెలియదని వైసీపీ నేతలు వివరణ ఇస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.