ANDHRA PRADESH LOCAL ELECTIONS START TO DAY ON WARDS ALL EYE ON KUPPAM ELECTIONS NGS
AP Election 2021: ఏపీలో ప్రారంభమైన ఎన్నికలు.. కుప్పంలో పెరుగుతున్న హీట్
నేటి నుంచి ఏపీలో ఎన్నికలు
AP Elections: ఆంధ్రప్రదేశ్ లో మళ్లీ ఎన్నికల సందడి మొదలైంది. నేటి నుంచి మూడు రోజుల పాటు ఎన్నికలు జరగనున్నాయి. ముఖ్యంగా వీటిలో కుప్పం మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి. దీంతో అందరి చూపు కుప్పం ఫలితంపైనే ఉంది..
AP Panchayat Election Updates: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో మళ్లీ ఎన్నికల హడావుడి మొదలైంది. నెల్లూరు (Nellore corporation) కార్పొరేషన్‌తో పాటు 12 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఎన్నికల ప్రచార పర్వం నిన్నటితో ముగియగా.. నేటి నుంచి వరుసగా వరుసగా మూడ్రోజులు రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ‘స్థానిక’ సంస్థల ఎన్నికల సందడి కొనసాగనుంది. మొత్తం 17.69 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇవాళ వివిధ జిల్లాల్లోని 36 సర్పంచ్ స్థానాలతో పాటు వివిధ గ్రామాల్లోని 68 వార్డు స్థానాల్లో ఎన్నికలు జరుగుతుండగా.. రేపు అంటే నెల్లూరు కార్పొరేషన్‌తో పాటు 12 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో పోలింగ్ జరగనుంది. టీడీపీ అధ్యక్షడు.. చంద్రబాబు నాయుడు(Nara Chandrababu Naidu) సొంత నియోజకవర్గంలోని కుప్పం (Kuppam) మున్సిపాలిటీ కూడా ఇప్పుడు ఎన్నికలు జరగుతున్న వాటిలో ఒకటి. అందరి కళ్లూ దీనిపైనే కేంద్రీకృతమయ్యాయి. ఇవి కాకుండా మరో ఆరు కార్పొరేషన్లు, నాలుగు మున్సిపాలిటీల్లో మొత్తం 14 డివిజన్లు, వార్డులకు కూడా సోమవారమే ఉప ఎన్నికలు జరగనున్నాయి. మంగళవారం 10 జెడ్పీటీసీ స్థానాలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా 123 ఎంపీటీసీ స్థానాల్లో పొలింగ్ కొనసాగనుంది.
ఇవాళ జరిగే ఎన్నికల్లో మొత్తం 1,00,032 మంది.. మున్సిపల్ ఎన్నికల్లో 8,62,066 మంది.. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో 8,07,637 మంది ఓటు హక్కు వినియోగించుకుంటారని రాష్ట్ర ఎన్నికల కమిషన్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొంది. మూడ్రోజుల పాటు సాగే ఈ ఎన్నికలు బ్యాలెట్ విధానంలో ఉంటాయి. సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికకు ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ నిర్వహించి, మధ్యాహ్నం రెండు గంటల తర్వాత ఓట్ల లెక్కింపు చేపడతారు. మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు 17న.. ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల ఓట్ల లెక్కింపు 18న చేపడతారు.
స్థానిక ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో పూర్తి పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని ఆ ప్రకటనలో తెలిపారు. ఎన్నికలు జరిగే అన్ని ప్రాంతాల్లో ఇప్పటికే ముందస్తు ఏర్పాట్లు పూర్తిచేశామన్నారు. దీనిపై చర్చించేందుకు అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో పాటు ఆయా నగర కమిషనర్లతో ఆమె శనివారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పోలింగ్ సందర్భంగా పూర్తిస్థాయిలో కరోనా నియంత్రణ జాగ్రత్తలు చేపట్టాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కారణాలతో మిగిలిపోయిన గ్రామ పంచాయతీలు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలకు నిర్వహిస్తున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన కోవిడ్ నిబంధనలపై అధికారులకు నీలం సాహ్ని మార్గదర్శకాలు జారీ చేశారు. ఎన్నికల నిర్వహణలో అధికారులు గుమిగూడకూడదన్నారు. కౌంటింగ్ సమయంలో కూడా కోవిడ్ నిబంధనలు పాటించాలని ఆదేశించారు. పోలింగ్‌కు ఒకరోజు ముందే పోలింగ్ స్టేషన్‌ను సానిటైజ్ చెయ్యాలని సిబ్బందికి సూచించారు. అలాగే ఎన్నికల పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొనే ప్రతి ఒకరు మాస్కు, సానిటైజరు ఉపయోగించాలన్నారు. కేంద్ర హోం శాఖ, రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన కోవిడ్ 19 నిబంధనలను పాటించాలన్నారు. పోలింగ్ స్టేషన్లో పోలింగ్ నిర్వహించే అధికారుల మధ్య భౌతిక దూరం పాటిస్తూ పోలింగ్ నిర్వహించాలని ఆమె ఆదేశించారు.
Published by:Nagesh Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.