ANDHRA PRADESH LAGADAPATI RAJAGOPAL PREDICTS PEOPLE WILL VOTE FOR EXPERIENCED LEADER IN AP ELECTION 2019 AK
మళ్లీ అనుభవజ్ఞులకే పట్టం... చంద్రబాబు వైపే లగడపాటి మొగ్గు ?
లగడపాటి రాజగోపాల్ సర్వే (లోక్సభ) : టీడీపీకి 15, వైసీపీకి 10
Lagadapati Rajagopal comments | తన సర్వేల ద్వారా ప్రజల నాడిని ఒడిసిపట్టుకోవడంలో అనేకసార్లు విజయం సాధించిన మాజీ ఎంపీ, ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల్లో ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీ మధ్య పోటీ హోరాహోరీగా ఉన్న సంగతి తెలిసిందే. ఎన్నికల్లో ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారనే విషయాన్ని ఎవరూ సరిగ్గా అంచనా వేయలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో తన సర్వేల ద్వారా ప్రజల నాడిని ఒడిసిపట్టుకోవడంలో అనేకసార్లు విజయం సాధించిన మాజీ ఎంపీ, ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాలినడకన తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చిన లగడపాటి... ఈ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలను మరోసారి అనుభవజ్ఞులకే పట్టం కట్టే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. అభివృద్ధి, సంక్షేమం రెండింటిని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. తెలుగు ప్రజలు ఎప్పుడూ కచ్చితమైన తీర్పే ఇచ్చారని... ఈ సారి కూడా అలాంటి తీర్పు ఇవ్వబోతున్నారని వ్యాఖ్యానించారు. మే 19న తుది దశ పోలింగ్ పూర్తయిన తరువాత రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికలపై తన సర్వే అంచనాలను విడుదల చేస్తానని లగడపాటి రాజగోపాల్ అన్నారు.
అయితే లగడపాటి రాజగోపాల్ వ్యాఖ్యలను పరిశీలిస్తే... ఏపీ ప్రజలు చంద్రబాబుకే పట్టం కట్టబోతున్నారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అనుభవజ్ఞులకే ప్రజలు మరోసారి పట్టం కట్టబోతున్నారనే ఆయన వ్యాఖ్యల వెనుక అర్థం ఇదేనని చర్చించుకుంటున్నారు. అయితే వైసీపీ వర్గాలు మాత్రం లగడపాటి వ్యాఖ్యలను పెద్దగా పట్టించుకోవాల్సిన పనిలేదని అంటున్నాయి. లగడపాటి చాలాకాలం నుంచి చంద్రబాబుకు అనుకూలంగా పని చేస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల విషయంలోనూ లగడపాటి ఫలితాలు తారుమారయ్యాయని గుర్తు చేస్తున్నారు. మొత్తానికి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండిపెండెంట్లు ఎక్కువగా గెలుస్తారంటూ ప్రచారానికి ముందు ప్రకటించి ఖంగుతిన్న లగడపాటి రాజగోపాల్... ఏపీ ఫలితాలను అంచనా వేయడంలో విజయం సాధిస్తారేమో చూడాలి.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.