Home /News /politics /

తనయుడి గెలుపు కోసం శ్రమిస్తున్న మాజీ ఎంపీ

తనయుడి గెలుపు కోసం శ్రమిస్తున్న మాజీ ఎంపీ

జేసీ దివాకర్ రెడ్డి

జేసీ దివాకర్ రెడ్డి

అనంతపురం ఎంపీగా ఈ సారి తన తనయుడు జేసీ పవన్ కుమార్ రెడ్డిని టీడీపీ తరపున బరిలోకి దింపిన జేసీ దివాకర్ రెడ్డి... కుమారుడి గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

    ఆంధ్రప్రదేశ్‌లోని అత్యంత సీనియర్ నాయకుల్లో ఒకరైన మాజీమంత్రి, అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి... ఈ సారి ఎన్నికలకు దూరంగా ఉన్నారు. అనంతపురం ఎంపీగా ఈ సారి తన తనయుడు జేసీ పవన్ కుమార్ రెడ్డిని టీడీపీ తరపున బరిలోకి దింపిన జేసీ దివాకర్ రెడ్డి... కుమారుడి గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఓటమి ఎరుగని నేతగా అనేకసార్లు గెలుపొందిన జేసీ దివాకర్ రెడ్డి... తన కుమారుడి గెలుపు కోసం తన రాజకీయవ్యూహాలన్నింటిని అమలు చేస్తున్నారు. కుమారుడు ఎంపీగా పోటీ చేస్తుండటంతో... నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ సీట్లలో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న జేసీ... టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులతోనూ సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు.

    నిజానికి అనంతపురం నియోజకవర్గం పరిధిలోకి వచ్చే అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చాలని జేసీ దివాకర్ రెడ్డి చంద్రబాబుకు సూచించారు. అయితే జేసీ సూచన మేరకు ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలను పక్కనపెట్టిన జేసీ దివాకర్ రెడ్డి... తరచూ తాను గొడవపడే అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరికి సీటు రాకుండా మాత్రం అడ్డుకోలేకపోయారు. రాయదుర్గం నుంచి తన అల్లుడు దీపక్ రెడ్డిని బరిలోకి దింపాలని చివరివరకు ప్రయత్నించి విఫలమైన జేసీ... చివరకు ఆయనను బుజ్జగించి రెబల్‌గా బరిలోకి దిగకుండా చూశారు. కొన్ని చోట్ల ఎమ్మెల్యే అభ్యర్థులతో జేసీ కుటుంబానికి ఆశించిన స్థాయిలో సఖ్యత లేదనే ప్రచారం కూడా ఉంది.

    ఇక అనంతపురం ఎంపీ సీటును ఎలాగైనా తమ సొంతం చేసుకోవాలని భావిస్తున్న ప్రధాన ప్రతిపక్షం వైసీపీ... ఇక్కడ ఎంపీగా బరిలో ఉన్న రంగయ్యను ఎలాగైనా గెలిపించుకోవాలని వ్యూహాలు రచిస్తోంది. ఈసారి అనంతపురంలో తమకు మంచి ఫలితాలు వస్తాయనే భావనలో ఉన్న వైసీపీ... ఎమ్మెల్యేలను గెలిపించుకోవడంతో పాటు జేసీ ఫ్యామిలీ ఆధిపత్యానికి గండి కొట్లాలని ప్లాన్ చేస్తోంది. మొత్తానికి తనయుడి రాజకీయ భవిష్యత్తును నిలబెట్టేందుకు తన పొలిటికల్ కెరీర్‌ను వదలుకుంటున్న జేసీ దివాకర్ రెడ్డి... కుమారుడిని భారీ మెజార్టీతో గెలిపించడంలో సక్సెస్ అవుతారో లేదో చూడాలి.
    First published:

    Tags: Anantapur S01p19, Andhra Pradesh Assembly Election 2019, Andhra Pradesh Lok Sabha Elections 2019, JC Diwakar Reddy, Lok Sabha Election 2019, Tdp, Ysrcp

    తదుపరి వార్తలు