‘క్లబ్‌లో కూర్చుని పేకాట ఆడుకోండి’… వైసీపీపై పవన్ కళ్యాణ్ ఫైర్

ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీని లక్ష్యంగా చేసుకుని మరోసారి విమర్శలు గుప్పించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. నెల్లూరులో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

news18-telugu
Updated: March 26, 2019, 3:51 PM IST
‘క్లబ్‌లో కూర్చుని పేకాట ఆడుకోండి’… వైసీపీపై పవన్ కళ్యాణ్ ఫైర్
నెల్లూరులో పార్టీ కార్యకర్తల సమావేశంలో పవన్
  • Share this:
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువగా వైసీపీనే టార్గెట్ చేసుకుంటున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్... తాజాగా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నెల్లూరు జిల్లా కోవూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించిన పవన్ కళ్యాణ్... వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులపై ఘాటు విమర్శలు చేశారు. వాళ్లు ఎమ్మెల్యే అభ్యర్థులా లేక బెట్టింగ్ రాయుళ్లా అంటూ కామెంట్ చేశారు. శ్రీధర్ రెడ్డి, అనిల్ యాదవ్ ప్రతి విషయంపై బెట్టింగ్‌లు బెడుతుంటారని ఆరోపించారు. అసలు వారికి ఎమ్మెల్యే టికెట్లు ఎందుకని ప్రశ్నించిన పవన్... వాళ్లు క్లబ్‌లో కూర్చుని పేకాట ఆడుకోవాలని వ్యాఖ్యానించారు.

పోలీసులను బెదిరించే వాళ్లకు ఎమ్మెల్యే టికెట్లు ఇస్తారా ? అంటూ పవన్ కళ్యాణ్ దుయ్యబట్టారు. వైసీపీ ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నేతలు కొందరికి పేకాట క్లబ్‌లతో సంబంధాలు ఉన్నాయంటూ గతంలో కేసులు నమోదయ్యాయి. కొద్దిరోజుల క్రితం పోలీసులను బెదిరించారనే ఆరోపణల కారణంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులే టార్గెట్‌గా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

తెలంగాణలోని అధికార పార్టీ టీఆర్ఎస్‌తో వైసీపీ లాలూచీ పడిందని ఇటీవల విమర్శించిన పవన్ కళ్యాణ్... తాజాగా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులను టార్గెట్ చేసుకుని వ్యాఖ్యలు చేయడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. టీడీపీతో పాటు జనసేనను కూడా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తుండటంతో... పవన్ కళ్యాణ్ కూడా వైసీపీపై పదునైన విమర్శలు గుప్పిస్తున్నట్టు కనిపిస్తోంది.




First published: March 26, 2019, 3:43 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading