ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టులో షాక్ తగిలింగి. గ్రామ పంచాయతీల్లో అధికారాలకు సంబంధించి జారీ చేసిన కీలక జీవోను హైకోర్టు కొట్టివేసింది. గ్రామ సర్పంచ్ లు, పంచాయతీ కార్యదర్శుల అధికారాల్లో కొన్నింటిన వీఆర్వోలకు బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏఢాది మార్చి 25న జీవో నెం.2 జారీ చసింది. ఈ జీవోను సవాల్ చేస్తూ గుంటూరు జిల్లా తోకలవానిపాలెం సర్పంచ్ కృష్ణమోహన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సోమవారం దీనిపై విచారణ జరిపిన కోర్టు జీవోను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. పిటిషన్ తదుపరి విచారణను నాలుగు వారాలు వాయిదా వేసింది. ప్రభుత్వం జారీ చేసిన జీవో పంచాయతీ కార్యదర్శుల హక్కులను హరించే విధంగా ఉందని పిటిషనర్ తరపు లాయర్ నర్రా శ్రీనివాసరావు కోర్టులో వాదనలు వినిపించారు. అలాగే ఈ జీవో రాజ్యాంగంలోని ఆర్టికల్ 73, ఏపీ పంచాయతీ రాజ్ చట్టానికి వ్యతిరేకంగా ఉందని తెలిపారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు అందించేందుకు వీఆర్వో వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వ తరు లాయర్ కోర్టుకు తెలపారు.
ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు జీవో నెం.2పై నిర్ణయాన్ని వెల్లడించింది. ఇదే అంశంపై గతంలోనూ విచారణ జరిపిన హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. గ్రామపంచాయతీలు, సర్పంచ్ వ్యవస్థ ఉండగా దీనికి సమాంతరంగా సచివాలయాలు ఏర్పాటు ఏంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. సంక్షేమ పథకాలు పంచాయతీల నుంచి ఎందుకు అమలు చేయకూడదని పేర్కొంది.
ఇదిలా ఉంటే గ్రామ సచివాలయాలు, పంచాయతీలకు సంబంధం లేదని ప్రభుత్వం చెప్తున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. విలేజ్ సెక్రటేరియట్లలో వీఆర్వో డ్రాయింగ్, డిస్బబ్ర్ మెంట్ అధికారిగా ఉంటారని చెప్తునా.. సచివాలయాలకు సంబంధించిన వస్తువులు, ఇతర బిల్లుల చెల్లింపుకు నిధులు విడుదల చేయాలంటూ పంచాయతీ కార్యదర్శులకు ఆదేశాలు వెళ్తున్నాయి. స్టేషనరీ, ఇంటర్నెట్ ఛార్జీలు, ఇతర రోజువారీ ఖర్చులు కూడా పంచాయతీలపై వేస్తున్నారు. ఈ విషయంలో గుంటూరు జిల్లా పంచాయతీ అధికారి వాలంటీర్ల కోసం బయోమెట్రిక్ మిషన్లను పంచాయతీ నిధులతో కొనుగోలు చేయాలంటూ కార్యదర్శలకు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలుస్తోంది.
జీవో నెం.2లో ఏముందంటే..!
రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 అక్టోబర్ 2 నుంచి గ్రామాల్లో సచివాలయ వ్యవస్థను శ్రీకారం చుట్టింది. అంతకుముందే ఈ వ్యవస్థపై జారీ చేసిన జీవోలో పంచాయతీ కార్యదర్శులు సచివాలయాల్లో కన్వీనర్, డ్రాయింగ్ అండ్ డిస్బర్స్ మెంట్ ఆఫీసర్ గా వ్యవహరిస్తారని పేర్కొంది. అలాగే సచివాలయాల నిర్వహణలో పంచాయతీల పాత్ర ఉంటుందని కూడా స్పష్టం చేసింది. అంతేకాకుండా సచివాలయ సిబ్బంది సెలవులను సర్పంచ్ మంజూరు చేస్తాని పేర్కొంది. ఐతే ఈ ఏడాది ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించిన అనంతరం మార్చి 25న జీవో నెం.2ను జారీ చేసింది. పంచాయతీ కార్యదర్శులు సచివాలయాల్లో లింక్ ఆఫీసర్లుగానే వ్యవహరిస్తారని.. వీఆర్వోలు డీడీఓలుగా వ్యవహరిస్తారని ఆ జీవోలో పేర్కొంది. అలాగే సచివాలయ ఉద్యోగుల సెలువుల వ్యవహారాన్ని కూడా వీఆర్వోలకే అప్పగించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP High Court, Gram Panchayat Elections, Village secretariat