AP Local Body Elections: ఎస్ఈసీకి హైకోర్టు షాక్.. పరిషత్ ఎన్నికలపై స్టే..

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు(ఫైల్ ఫొటో)

MPTC, ZPTC Elections: ఏపీలో పరిషత్ ఎన్నికలపై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఎన్నికలపై స్టే విధించింది.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘానికి హైకోర్టు షాకిచ్చింది. పరిషత్ ఎన్నికలపై స్టే విధిచింది. దీంతో ఎల్లుండి జరగాల్సిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు బ్రేక్ పడింది. కోడ్ అమలులో సుప్రీం కోర్టు మార్గదర్శకాలను పాటించలేదని తెలిపింది. ఎన్నికలను నిలిపేయాలంటూ బీజేపీ, టీడీపీ పార్టీలు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు.. బీజేపీ పిటిషన్ ను కొట్టేసింది. ఐతే టీడీపీ పిటిషన్ ను విచారించిన అనంతరం ఎన్నికలపై స్టే విధిస్తున్నట్లు ప్రకటించింది. తదుపరి విచారణను ఈనెల 15కు వాయిదా వేసింది. తదుపరి విచారణ సందర్భంగా అఫిడవిట్ దాఖలు చేయాల్సిందిగా ఎస్ఈసీని కోర్టు ఆదేశించింది. సుప్రీం కోర్టు మార్గదర్శకాల ప్రకారం 4 వారల ఎన్నికల కోడ్ అమలు చేయడంలో ఎస్ఈసీ విఫలమైందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఎల్లుండి 516 జెడ్పీటీసీ 7,258 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికల జరగాల్సి ఉండగా హైకోర్టు స్టే ఆదేశాలతో చివరి నిముషంలో బ్రేక్ పడింది. ఐతే కోర్టు ఆదేశాలపై ఎస్ఈసీ ఎలా ముందుకెళ్తుందన్నది ఆసక్తికరంగా మారింది.

    జడ్పీసీ ఎన్నికల బరిలో 2,092 మంది, ఎంపీటీసీ బరిలో 19,002 మంది అభ్యర్థులు ఉన్నారు. ఇప్పటికే 126 జెడ్పీటీసీ స్థానాలు, 2,371 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. ఎన్నికల సిబ్బంది, భద్రతా సిబ్బంది కేటాయింపుతో పాటు బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్ల తరలింపు వంటి ఏర్పాట్లను ప్రభుత్వం పూర్తి చేసింది.

    ఇది చదవండి: సీఎం జగన్ బెయిలు రద్దు చేయాలి... సీబీఐ కోర్టులో రఘురామ పిటిషన్


    ఈనెల 1న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన నీలం సాహ్నీ.. అదే రోజు నోటిఫికేషన్ విడుదల చేశారు. గత ఏడాది ఎక్కడైతే ప్రక్రియ నిలిచిందో.. అక్కడి నుంచే ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. ఐతే ఎస్ఈసీ ప్రకటనను వ్యతిరేకించిన ప్రధాన ప్రతిపక్షం టీడీపీతో పాటు జనసేన, బీజేపీ నోటిఫికేషన్ రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్లు వేశాయి. ఐతే బీజేపీ పిటిషన్ సమగ్రంగా లేనందున హైకోర్టు తోసిపుచ్చింది. టీడీపీ పిటిషన్ పై విచారణ జరిపి ఉత్తర్వులిచ్చింది.

    ఐతే హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేసేందుకు ధర్మాసనం ఈనెల 15వరకు అవకాశమిచ్చినా.. ఎస్ఈసీ మాత్రం హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేయాలని భావిస్తోంది. నిజానికి హైకోర్టు ఇలాంటి తీర్పు ఇస్తుందని అటు ప్రభుత్వంతో పాటు ఇటు ఎస్ఈసీ కూడా ఊహించలేదు. ఇప్పటికే ఎన్నికల ఏర్పాట్లు పూర్తైనందున హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసి ముందుకెళ్లాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సుప్రీం మార్గదర్శకాలను అమలు కాలేదంటూ కోర్టు ఆక్షేపించిన నేపథ్యంలో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసినా దానిపై ఎలాంటి ఆదేశాలిస్తుందన్నది చర్చనీయాంశంగా మారింది.
    Published by:Purna Chandra
    First published: