ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. పంచాయతీ ఎన్నికలకు ధీటుగా మున్సిపల్ ఎన్నికల్లోనూ వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు హై కోర్టు షాకిచ్చింది. గత ఏడాది నోటిఫికేషన్ సందర్భంగా బెదిరింపుల కారణంగా నామినేషన్లు వేయలేకపోయిన వారికి ఎస్ఈసీ మరో అవకాశం కల్పించింది. ఫిర్యాదుల పరిశీలన అనంతర చిత్తూరు జిల్లా తిరుపతి, పుంగనూరు, కడప జిల్లా రాయచోటి, ఎర్రగుంట్ల మున్సిపాలిటీల్లోని అభ్యర్థులకు నామినేషన్ వేసేందుకు ఎన్నికల కమిషన్ అవకాశం కల్పించింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు వెళ్లగా..ధర్మాసనం ఎస్ఈసీ నిర్ణయాన్ని తప్పుబడుతూ తీర్పు వెలువరించింది. ఎన్నికల ప్రక్రియలో మరోసారి నామినేషన్లకు అవకాశం కల్పించడం సరికాదని ప్రభుత్వం తన పిటిషన్లో పేర్కొంది.
ఎస్ఈసీ అవకాశం కల్పించిన 14 వార్డుల్లో ఏడు చోట్ల రీ నామినేషన్లు దాఖలు కాగా.. హైకోర్టు తీర్పునేపథ్యంలో ఆ నామినేషన్లన్నీ రద్దయ్యాయి. మున్సిపల్ ఎన్నికల సమయంలో ఎస్ఈసీకి హైకోర్టు వరుస షాకులిస్తోంది. వార్డు వాలంటీర్లు సెల్ ఫోన్లు తిరిగిచ్చేయాలన్న ఆదేశాలను హైకోర్టు కొట్టివేయగా.. తాజాగా రీ నామినేషన్ల ఆదేశాలను డిస్మిస్ చేసింది.
నామినేషన్ల వేయలేకపోయిన ఘటనలపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలించిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ తిరుపతి కార్పొరేషన్తో పాటు పుంగనూరు, రాయచోటి పురపాలక సంఘాలు, ఎర్రగుంట్ల నగర పంచాయతీల్లో నామినేషన్లు అవకాశం కల్పించారు. దౌర్జన్యాలు, బెదిరింపుల కారణంగా నామినేషన్లు వేయలేకపోయామని పలువురు అభ్యర్థులు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులకు రుజువులు ఉండడంతో..వాటన్నింటినీ పరిశీలించిన ఎన్నికల కమిషనర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తిరుపతిలో 2, 8, 10, 21, 41, 45 వార్డులు, పుంగనూరులో 9, 14, 28 వార్డులు, కడప జిల్లా రాయచోటిలో 20, 31 వార్డులు, ఎర్రగుంట్లలో 6, 11, 15 వార్డుల్లో నామినేషన్లు వేసేందుకు అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఐతే హైకోర్టు తీర్పుతో ఎస్ఈసీ ఆదేశాలతో పాటు నామినేషన్లు కూడా రద్దయ్యాయి.