Andhra Pradesh: పంచాయతీ ఎన్నికల ముందు ఏపీలో కలకలం... రోడ్డెక్కిన వాలంటీర్లు.. అసలు కారణం అదే

ప్రతీకాత్మక చిత్రం

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (CM YS Jaganmohan Reddy) గ్రామ/వార్డు వాలంటీర్ల ( Grama Volunteers) వ్యవస్థను ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నారు.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గ్రామ/వార్డు వాలంటీర్ల వ్యవస్థను ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 4లక్షల మందికి పైగా వాలంటీర్లను నియమించిన ప్రభుత్వం.. వారి ద్వారా సంక్షేమ పథకాలను ఇంటింటికీ అందిస్తోంది. నెలకు రూ.5వేల గౌరవ వేతనంతో పనిచేస్తున్న వాలంటీర్లు నెలవారీ పెన్షన్ల దగ్గర నుంచి ప్రతి సంక్షేమ పథకానికి సంబంధించిన ప్రక్రియను పూర్తి చేసి గ్రామ సచివాలయంలో సమర్పిస్తున్నారు. అలాగే పెన్షన్ల పంపిణీ కూడా వారే చేపడుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వం అంటే గ్రామ సచివాలయాలు, వాలంటీర్లే అనే పరిస్థితికి వచ్చింది. ఐతే ఉన్నట్లుండి వాలంటీర్లంతా రోడ్డెక్కారు. జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్లు, మున్సిపల్ కాల్యాలయాలను ముట్టడించారు.

    జీతాలు పెంచాలి
    తమకు ప్రభుత్వం చెల్లిస్తున్న రూ.5వేల వేతనాన్ని పెంచాలని వాలంటీర్లు డిమాండ్ చేస్తున్నారు. జీతాల పెంపుతో పాటు ఉగ్యోగ భద్రత కల్పించాలని కోరుతున్నారు. తమ జీతాన్ని రూ.15వేలకు పెంచడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింటచాలని వాలంటీర్లు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అలాగే గ్రామ సచివాలయాల్లో, ఎంపీడీవో కార్యాలయాల్లో తమకు గౌరవం ఇవ్వడం లేదని.. అధికారులంతా తమను చులకనగా చూస్తున్నారని ఆరోపిస్తున్నారు. అలాగే ప్రతి పథకాన్ని తమకే అంటగడుతున్నారని.. సచివాలయంలోని అన్ని శాఖల పనులు తామొక్కరమే చేయాల్సి వస్తుందంటున్నారు. నియామకాల సమయంలో ప్రభుత్వం చెప్పిందొకటి చేస్తున్నది ఒకటని.. అన్ని పనులు తమకే చెప్తూ వెట్టిచాకిరీ చేయిస్తున్నారంటూ కొందరు వాలంటీర్లు ఘాటుగానే వ్యాఖ్యానించారు. డిమాండ్లు పరిష్కరించేవరకు ఆఫీసులకు వెళ్లేది లేదని భీష్మించుకొని కూర్చున్నారు.

    విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎదుట ధర్నాకు దిగిన వేలాది మంది కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. అటు వాలంటీర్లు.. ఇటు పోలీసుల మధ్య తోపులాట జరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు వాలంటీర్లను అరెస్ట్ చేసి పీఎస్ కు తరలించారు. అలాగే పలు జిల్లాల్లో వాలంటీర్లు కలెక్టరేట్లు, మున్సిపల్ కాల్యాలయాల వద్ద ఆందోళనకు దిగారు.

    ఎన్నికల ముందు కలకలం
    ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికల తొలిదశ పోలింగ్ కు కొన్ని గంటల ముందు రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లు ఆందోళనకు దిగడం చర్చనీయాంశమైంది. వాలంటీర్ల ఆందోళనను అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ప్రతి పథకానికి వాలంటీర్లకే బాధ్యతలప్పజెప్పుతూ వారిని వారియర్స్ గా అభివర్ణిస్తున్న ప్రభుత్వం వారి డిమాండ్లపై స్పందిస్తుందా..? వాళ్లు అడిగినట్లు నెలకు రూ.15వేల జీతం, ఉద్యోగ భద్రత కల్పిస్తుందా అనేది వేచి చూడాలి.
    Published by:Purna Chandra
    First published: